హైకోర్టు ముందు జగన్‌ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు

‘ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం. ఈ ఏడాది మే 2తో జేపీ సంస్థకు గడువు ముగియడంతో రీచ్‌ల్లో ఎక్కడా ఇసుక తవ్వడం లేదు.

Updated : 08 Dec 2023 09:41 IST

మే 2 తర్వాత రాష్ట్రంలో ఎక్కడా ఇసుక తవ్వకాలే లేవట
కేవలం నిల్వ కేంద్రాల్లో ఇసుకే విక్రయిస్తున్నారట
ఈసీలు తీసుకున్నాకే తవ్వుతామన్న సర్కారు
ఈసీలు ఇవ్వకున్నా అన్ని జిల్లాల్లో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు
ఈనాడు, అమరావతి

‘ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం. ఈ ఏడాది మే 2తో జేపీ సంస్థకు గడువు ముగియడంతో రీచ్‌ల్లో ఎక్కడా ఇసుక తవ్వడం లేదు. గతంలో తవ్వి తీసి స్టాక్‌ యార్డుల్లో నిల్వ చేసిన ఇసుకను మాత్రమే తరలిస్తున్నారు. పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే ఇసుక తవ్వకాలు చేపడతారని హామీ ఇస్తున్నాం.’

ఇది రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ముంగిట ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ బుధవారం చెప్పిన మాట. అయితే గురువారం కూడా పలు జిల్లాల్లోని ఓపెన్‌ రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు దర్జాగా కొనసాగాయి. వీటికి ఎటువంటి పర్యావరణ అనుమతుల్లేవు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ముందు ప్రభుత్వం ఎంత పచ్చి అబద్ధాలు చెప్పించింది అనడానికి ఈ తవ్వకాలే నిదర్శనం.

‘రాష్ట్రంలో ఇసుక టెండర్లలో రెండు ఏజెన్సీలు ఎంపికయ్యాయి. వాటితో ఒప్పందాల ప్రక్రియ తుది దశలో ఉంది. అది పూర్తికాగానే ఆ సంస్థలు ఇసుక ఆపరేషన్స్‌ మొదలుపెడతాయి. అప్పటి వరకు పాత ఏజెన్సీ ద్వారానే అనుమతి ఉన్న అన్ని రీచ్‌ల్లో ఇసుక కార్యకలాపాలు జరుగుతాయి’

ఇది గత నెల 25న గనులశాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి ఇచ్చిన అధికారిక ప్రకటన. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా ఓపెన్‌ రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలకు పర్యావరణ సంస్థ అనుమతి ఇవ్వలేదు. కానీ పాత ఏజెన్సీ (జేపీ సంస్థ)తో అన్ని రీచ్‌ల్లో తవ్వకాలు జరుగుతాయంటూ గనులశాఖ సంచాలకులు వితండవాదం చేస్తున్న తీరిది.

సాక్షాత్తూ హైకోర్టునూ జగన్‌ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. పర్యావరణ అనుమతులు కొత్తగా తీసుకున్నాకే మళ్లీ ఇసుక తవ్వకాలు చేపట్టాలంటూ పర్యావరణ సంస్థ ఏప్రిల్‌లోనే స్పష్టంగా చెప్పింది. అదేమీ పట్టించుకోకుండా ఇప్పటికీ ఇసుక తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాలు, విక్రయాలను 2021 మే నుంచి జేపీ సంస్థ చేపట్టింది. అయితే ఉపగుత్తేదారుగా తమిళనాడుకు చెందిన టర్న్‌కీ సంస్థ మొత్తం వ్యవహారం నడిపింది. మధ్యలో దానిపేరిట అధికార పార్టీ నేతలు రంగప్రవేశం చేసి రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో సిండికేట్లుగా ఏర్పడి నదులను ఊడ్చేశారు. దీనిపై గతంలో అమరావతి మండలం ధరణికోటకు చెందిన దండా నాగేంద్రకుమార్‌ చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. సెమీ మెకనైజ్డ్‌ విధానంలో తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు పునఃపరిశీలించాలని ఈ ఏడాది మార్చిలో ఆదేశాలు వచ్చాయి. దీంతో జేపీ సంస్థకు అనుమతిచ్చిన 110 రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ఆపేయాలని రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ (సియా) ఏప్రిల్‌ 24న గనుల శాఖకు, జేపీ సంస్థకు ఆదేశాలిచ్చింది. సియా ఆదేశాలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా నేటికీ తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి.

కళ్ల ముందే తవ్వేస్తున్నా.. మొండి వాదన

వివిధ జిల్లాల్లోని ప్రధాన నదుల్లో ఈసీలు లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా.. అదేమీ లేదంటూ గనులశాఖ మొండిగా వాదిస్తోంది. కళ్ల ముందే భారీ యంత్రాలతో ఇసుక తవ్వి, వందల లారీల్లో తరలిస్తున్నప్పటికీ అది నిజం కాదంటూ అడ్డంగా బుకాయిస్తోంది. ప్రతిపక్ష పార్టీలైన తెదేపా, జనసేన, భాజపా నేతలు రాష్ట్రవ్యాప్తంగా అనేక రీచ్‌ల్లో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకుంటే, ఆ పూట తవ్వకాలు ఆపేస్తున్నారు. మర్నాటి నుంచి యథావిధిగా దందా కొనసాగిస్తున్నారు.


ఇవన్నీ కనిపించలేదా?

  • అనంతపురం జిల్లా పెద్దపప్పూరులోని పెన్నా నదిలో రెండు రీచ్‌ల్లో, సీఎం సొంత జిల్లా వైయస్‌ఆర్‌లోని సిద్ధవటం మండలం జంగాలపల్లి, మూలపల్లిలో గురువారం ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరిగాయి.
  • శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ముద్దాడ, కొత్తూరు మండలం అంగూరు, జనుమూరు మండలం డొంపాక, పొందూరు మండలం సింగూరు రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు నిరాటంకంగా సాగుతున్నాయి.
  • నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు ఇసుక రీచ్‌లో తవ్వకాలు కొనసాగుతున్నాయి.
  • ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వేమగిరి, కాటవరం, జొన్నాడ, తాతపూడి తదితర రీచ్‌ల్లో ఇసుక తవ్వుతున్నారు. గురువారంనుంచి నదిలో నీరు ప్రవహిస్తుండటంతో తవ్వకాలు ఆపారు.
  • ఉమ్మడి కృష్ణా జిల్లాలోని చోడవరం, శ్రీకాకుళం, మద్దూరు, రొయ్యూరు, లంకపల్లి, గనిఆత్కూరు తదితర రీచ్‌ల్లో భారీ యంత్రాలతో ఇసుక తవ్వి తరలించారు. ఎగువ నుంచి వరద రావడంతో రెండు రోజులుగా తవ్వకాలు ఆపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని