నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు

తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్య పడవద్దని.. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు.

Published : 09 Dec 2023 05:03 IST

అందరినీ ఆదుకుంటాం.. సంక్రాంతికి పెట్టుబడి రాయితీ అందిస్తాం  
తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని తుపాను బాధితులతో సీఎం జగన్‌  
ఇలా వచ్చి.. మొక్కుబడిగా పంటలు చూసి.. అలా తిరుగుపయనం
కనీసం పొలం గట్టుకైనా వెళ్లకుండా రోడ్డు మీదే వేదికల ఏర్పాటు
తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని  తుపాను బాధితులతో సీఎం జగన్‌

ఈనాడు-తిరుపతి, అమరావతి: తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్య పడవద్దని.. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. పంట నష్టపోయిన రైతులకు బీమా, పెట్టుబడి రాయితీలు రావనే అపోహలు వద్దని స్పష్టం చేశారు. పంట నష్టానికి సంబంధించిన నమోదు ప్రక్రియను రేపో మాపో ప్రారంభిస్తామని తెలిపారు. ఇంకా ఎవరైనా ఉంటే నమోదుకు 15 రోజులు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. వచ్చే సంక్రాంతికి పెట్టుబడి రాయితీ జమ చేస్తామని, బీమా వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నాటికి అందిస్తామని స్పష్టం చేశారు. గతంలో పరిహారం ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు. ప్రస్తుతం రైతుల ప్రీమియం తామే చెల్లిస్తూ ఖరీఫ్‌ సీజన్‌కు బీమా అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సీఎం తన పర్యటనలో దెబ్బతిన్న పంటల పరిశీలనకు, రైతులతో మాట్లాడటానికి చాలా తక్కువ సమయమే కేటాయించారు. నష్టాన్ని హెలికాప్టర్‌ ద్వారా పరిశీలించారు. బాధితుల పరామర్శకు వచ్చిన సీఎంకు బాపట్ల జిల్లా పాతనందాయపాలెం, బుద్దాం గ్రామాల వద్ద అధికారులు రెడ్‌కార్పెట్‌ ఏర్పాటుచేయడం విమర్శలకు దారితీసింది. రెండుచోట్లా  కనీసం నేల మీద కాలు పెట్టకుండా జాతీయ రహదారిపై నుంచే పంట నష్టాన్ని పరిశీలించటానికి వీలుగా ప్రత్యేక టెంట్లు, వేదికలు ఏర్పాటు చేశారు. వాటిలో రెడ్‌కార్పెట్‌ పరిచారు. మొదట సీఎం తిరుపతి జిల్లాలో వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం పరిధిలో స్వర్ణముఖి నది కరకట్ట తెగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ స్థానికులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘పంట నష్టపోయిన రైతులు ఎవరూ భయపడవద్దు. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తాం’ అని అన్నారు.

సచివాలయ, వాలంటీరు వ్యవస్థ ద్వారా..

‘బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలతోపాటు ఒక లీటరు నూనె అందించాం. ఏ రాష్ట్రంలో లేనివిధంగా మన రాష్ట్రంలో సచివాలయ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఉంది. వీళ్ల ద్వారా ప్రతి ఇంటికీ రేషన్‌ కిట్లను పంపిణీ చేశాం. బాధిత కుటుంబాలకు రూ. 2,500 చొప్పున నాలుగైదు రోజుల్లో పంపిణీ చేస్తాం. సమస్యలు ఉంటే జగనన్నకు చెబుతాం ఫోన్‌ నంబరుకు చేయండి’ అని సూచించారు.  సీఎం పర్యటన సందర్భంగా వాకాడు పరిధిలోని బాలిరెడ్డిపాలెంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. సుమారు 200 మందికి పాసులు ఇచ్చి సీఎం కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని నేతలు చెప్పారని, ఇక్కడికి వస్తే ఆంక్షలు పెట్టారని స్థానికులు వాపోయారు.

నేనొస్తే సహాయ చర్యలకు ఇబ్బంది అని..  

తిరుపతి జిల్లా పర్యటన అనంతరం సీఎం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని పాతనందాయపాలెం చేరుకున్నారు. కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారి పక్కనే దెబ్బతిన్న మిర్చి పంటను, తర్వాత బుద్దాం గ్రామం వద్ద నీట మునిగిన వరి పొలాలను రహదారి పైనుంచే పరిశీలించారు. విపత్తులు వచ్చినప్పుడు తాను వెంటనే వస్తే అధికార యంత్రాంగం అంతా తన వెనకే ఉంటుందని, సహాయక చర్యలు లోపిస్తాయని సీఎం జగన్‌ స్పష్టంచేశారు. అందుకే కలెక్టర్‌,  జిల్లా యంత్రాంగం, సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థను అప్రమత్తం చేశామన్నారు. వారు ఏ మేరకు పని చేశారో పరిశీలనకు తాను వస్తానని, ఆ సమయంలో ఏ ఒక్కరూ నెగెటివ్‌ చెప్పకూడదని ఆదేశాలిచ్చామన్నారు. అధికారులు సహాయక చర్యలు బాగా చేశారని ప్రశంసించారు. గత నాలుగేళ్లలో తమ ప్రభుత్వం 55 లక్షలమంది రైతులకు రూ. 7,800 కోట్ల బీమా చెల్లించిందని.. చంద్రబాబు హయాంలో అయిదేళ్లలో 35 లక్షలమందికి రూ. 3,400 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. తొలుత మరుప్రోలువారిపాలెంలో తుపాను ప్రభావంపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను సీఎం తిలకరించారు. రైతులతో ముఖాముఖి ఉంటుందని కొందరు రైతుల్ని పిలిపించారు. అయితే పర్యటన ఆలస్యం అయిందంటూ వారితో చర్చించలేదు.  


గర్భిణిని, అంబులెన్సునూ అడ్డుకోవడమేనా?

  • బాపట్ల జిల్లాలో పురిటినొప్పులతో బాధపడుతున్న  అంజలి అనే మహిళను ఆటోలో ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా.. సీఎం వస్తున్న సమయంలో రోడ్డు మీద ఆటో నడపటం ఏంటని పోలీసులు అడ్డుకోవడంతో డ్రైవర్‌ ఆమెను అక్కడ దింపేసి వెళ్లిపోయాడు. ఆ మహిళ పంటిబిగువన నొప్పులు భరిస్తూ సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక వైద్యశిబిరం వద్ద కూలబడ్డారు. మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకోవడంతో పోలీసులు తమ వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలించారు.
  • బాపట్ల జిల్లా అధికారులు కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారిపై సీఎం కోసం హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం సీఎం పర్యటన ముగిసే వరకు హైవేపై వాహనాలు ఆపేయడంతో జనం తీవ్రంగా అవస్థలు పడ్డారు. కిలోమీటర్ల మేర చుట్టుతిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
  • తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలో పోలీసులు 2 గంటలపాటు వాహన రాకపోకలను అడ్డుకున్నారు. అత్యవసరంగా రోగిని ఆసుపత్రి తీసుకెళ్లడం కోసం 108 వాహనం విద్యానగర్‌ చేరుకోగా.. పోలీసులు అనుమతించలేదు. డ్రైవర్‌ అత్యవసరమని ప్రాధేయ పడటంతో కొంతసేపటికి వదిలిపెట్టారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని