రుణం వాడేసి.. విస్తరణ ఆపేసి..

ఆంధ్రావని రోడ్లంటే... ఇప్పుడు దేశమంతా పేరు మారుమోగిపోతోంది! రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనదారులు... జగన్‌ సర్కారు రోడ్ల నిర్వహణను దేశమంతా కథలు కథలుగా చేరవేస్తున్నారు!

Updated : 09 Dec 2023 14:07 IST

రాష్ట్రం వాటా ఇవ్వదు.. భూసేకరణ చేయదు
ఆగిపోయిన ఏడీబీ రుణ రహదారుల ప్రాజెక్టులు
నరకం చూస్తున్న వాహనదారులు
జగన్‌ ప్రభుత్వ చేతకానితనం
ఈనాడు - అమరావతి

తాము పెట్టకున్నా.. పెట్టేవారిని చూపిస్తే పుణ్యం వస్తుందంటారు! అలా చూపించటం అటుంచి... పెట్టేవారు మేం రెడీ అంటూ ముందుకొచ్చినా... వారిని పెట్టకుండా అడ్డుకుంటే ఏమొస్తుంది? పాపం వస్తుంది! అలాంటి పాపాన్నైనా మూటగట్టుకోవటానికి సిద్ధపడుతోందిగాని.. ప్రజలకు సౌకర్యాలు కల్పించే బుద్ధిపుట్టడం లేదు జగన్‌ సర్కారుకు! అందుకు ప్రత్యక్ష నిదర్శనం ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల విస్తరణ!

ఆంధ్రావని రోడ్లంటే... ఇప్పుడు దేశమంతా పేరు మారుమోగిపోతోంది! రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనదారులు... జగన్‌ సర్కారు రోడ్ల నిర్వహణను దేశమంతా కథలు కథలుగా చేరవేస్తున్నారు! ఆంధ్ర సరిహద్దులు దాటగానే... హమ్మయ్య అంటూ వెన్ను విరుచుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో రహదారుల గురించి జగన్‌ సర్కారు నిర్లక్ష్యం ఇప్పుడు అందరికీ అనుభవేక వైద్యమైంది. రాష్ట్రంలో రోడ్ల విస్తరణను ప్రభుత్వం ఎప్పుడో మరిచిపోయింది. వర్షాలకు అధ్వానంగా మారిన రహదారుల్లో కనీసం గుంతలు కూడా పూడ్చలేని దౌర్భాగ్యస్థితి! వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తుంటే ప్రభుత్వం పైశాచికానందం పొందుతోంది. అందుకేనేమో... రాష్ట్రంలో రహదారుల పనులకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడంలేదు. ఇప్పటికే న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఎన్‌డీబీ) రుణంతో చేపడుతున్న రహదారుల ప్రాజెక్టు అటకెక్కగా.. ఆసియా అభివృద్ధి బ్యాంక్‌(ఏడీబీ) రుణంతో చేయాల్సిన రహదారుల ప్రాజెక్టును కూడా ఇలాగే మూలకు చేరేలా చేస్తోంది.  ఆ సొమ్ము మాత్రం వాడేసుకుంది. ఇందులోని మొదటి విడతలో ఉన్న ఓ రహదారి పనులు చేయలేమని గుత్తేదారులు దండం పెట్టేయగా, రెండో విడతలోని టెండరు దక్కించుకొని, ఒప్పందం చేసుకున్న గుత్తేదారులు సైతం పునరాలోచనలో పడ్డారు. రుణం కింద ఇప్పటికే అడ్వాన్స్‌ సొమ్ము
తీసుకున్నారని, ఈ ప్రాజెక్టు సంగతి తేల్చాలని ఏడీబీ పదేపదే పట్టుబడుతున్నాసరే.. వైకాపా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా అనిపించడంలేదు.

జాతీయ రహదారుల నుంచి పారిశ్రామికవాడలకు అనుసంధానంచేసే రహదారుల విస్తరణకు ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం అందిస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో 78 శాతం ఏడీబీ రుణంగా ఇస్తుండగా, రాష్ట్రప్రభుత్వం కేవలం 22 శాతం వెచ్చించాల్సి ఉంటుంది. తొలి విడతలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట నుంచి రాజానగరం వరకు 30కి.మీ. నాలుగు వరుసలుగా విస్తరించే ప్రాజెక్టు 2018-19లో మంజూరైంది. రూ.298 కోట్ల అంచనా విలువతో గుత్తేదారు సంస్థ ఆరంభంలో వేగంగా పనులు చేపట్టింది. ఏడాదికే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రవాటా నిధులివ్వకుండా, గుత్తేదారుకు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. దీంతో ఈ ఏడాది జులై నాటికి అయిదేళ్లు అవుతున్నా ఇప్పటివరకు 30 శాతం పనులే జరిగాయి. గుత్తేదారుకు రూ.58 కోట్లే చెల్లించారు. ఇంకా రూ.47 కోట్లు బిల్లులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నా.. ప్రభుత్వం నుంచి ఉలుకూపలుకూ లేకపోవడంతో గుత్తేదారు సంస్థ ఆరు నెలలుగా పూర్తిగా పనులు ఆపేసింది.

రెండో దశ మొదలేకాలేదు..

ఏడీబీ రెండో దశలో పారిశ్రామిక ప్రాంతాలకు కలిపే నాలుగు రహదారులకు రుణం మంజూరుచేసింది. ఇందులో రెండు రహదారుల విస్తరణ పనులకు టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టలేని స్థితిలో ఉన్నారు.

  • తిరుపతి జిల్లాలోని నాయుడుపేట సమీపంలో కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిలోని ఓజిలి నుంచి పారిశ్రామికవాడ వరకు 8.4 కి.మీ రెండు వరుసలుగా రహదారి విస్తరణకు రూ.120 కోట్లతో ప్రాజెక్ట్‌ మంజూరైంది. పనులు దక్కించుకున్న గుత్తేదారు గతేడాది సెప్టెంబరులోనే ఒప్పందం చేసుకున్నారు. ఇందులో కూడా భూసేకరణ చేయకపోవడం, మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ ఊసేలేకపోవడంతో ఇప్పటివరకు పనులు మొదలుకాలేదు.
  • తిరుపతి జిల్లాలోని రౌతుసురమాల పారిశ్రామికవాడకు అనుసంధానం చేసే 9.3కి.మీ. రెండు వరుసల రహదారి (67.4 కోట్లు), అనకాపల్లి జిల్లా నక్కపల్లి పారిశ్రామికవాడకు అనుసంధానం చేసే 4.42 కి.మీ. (25.91 కోట్లు) పనులు కూడా ఇంకా మొదలుకాలేదు.

అడ్వాన్స్‌, ప్రభుత్వ వాటా ఖర్చుచేస్తేనే..

ఏడీబీ ప్రతిసారీ రూ.200 కోట్లు అడ్వాన్స్‌గా రుణం ఇస్తుంది. దానితోపాటు, రాష్ట్రప్రభుత్వ వాటా ఖర్చుచేస్తే.. మళ్లీ రుణంలో మిగిలిన మొత్తం దశలవారీగా విడుదలచేస్తుంది. అయితే మొదటి దశలో ఇలా ఇచ్చిన అడ్వాన్స్‌లో రూ.190 కోట్లు రాష్ట్రప్రభుత్వం వాడేసుకుంది. దీంతో రెండో విడత ప్రాజెక్టులో అడ్వాన్స్‌ ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. తొలి దశలో ఇచ్చిన రుణంతోపాటు, ప్రభుత్వ వాటాను కూడా ఖర్చుచేసి, ఆ పత్రాలు చూపిస్తేనే మిగిలిన రుణం ఇస్తామని తెగేసి చెప్పింది. దీంతో ప్రభుత్వం ఏడీబీ ప్రాజెక్టుల జోలికి కూడా వెళ్లడం లేదు.


ది అనకాపల్లి నుంచి అచ్యుతాపురం కూడలి వరకు ఉన్న 13.78 కి.మీ. రోడ్డు. దీన్ని రూ.243 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరించే పనులు బీవీఎస్‌ఆర్‌ అనే గుత్తేదారు సంస్థ దక్కించుకొని, గతేడాది జూన్‌లో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రహదారికి అవసరమైన భూమి సేకరించి అప్పగించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. భూసేకరణకు రూ.100 కోట్లు ఖర్చుచేయలేక చేతులెత్తేసింది. దీంతో ఏడాదిన్నరైనా పనులు మొదలుకాలేదు. 9 నెలల కిందటే గుత్తేదారు పనులు చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని, మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ ఇవ్వాలని ప్రభుత్వానికి పదేపదే విన్నవించినా ఎటువంటి స్పందన కనిపించలేదు. దీంతో ఈ రహదారిలో గంప మట్టి కూడా పోయలేకపోయారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని