35 నిమిషాల్లోనే ముగించేశారు!

ముసాయిదా ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉందని ప్రతిపక్షాలు పదేపదే ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు రెండు- మూడు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి మమ అనిపిస్తున్నారు.

Published : 09 Dec 2023 04:47 IST

రెండు పోలింగ్‌ కేంద్రాల్లోనే పరిశీలించిన చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిశీలకుడు భాస్కర్‌

ఈనాడు- చిత్తూరు, న్యూస్‌టుడే - పుత్తూరు, వెదురుకుప్పం: ముసాయిదా ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉందని ప్రతిపక్షాలు పదేపదే ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు రెండు- మూడు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి మమ అనిపిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లోనూ శుక్రవారం ఇదే పరిస్థితి కనిపించింది. తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిశీలకులుగా నియమితులైన పోలా భాస్కర్‌ నగరి, గంగాధరనెల్లూరుల్లో ఒక్కో పోలింగ్‌ బూత్‌కు వెళ్లారు. రెండుచోట్ల కలిపి 35 నిమిషాలే ఉన్నారు. తిరుపతి జిల్లా పుత్తూరు మండలం తడుకు పంచాయతీ వేణుగోపాలపురం గ్రామంలోని కేంద్రం వద్ద 20 నిమిషాలున్న ఆయన బీఎల్వోలను జాబితాలో మార్పుచేర్పుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేణుగోపాలపురానికి చెందిన శరణ్య అనే మహిళ తనకు గతంలో పుత్తూరు మున్సిపాలిటీలో ఓటు ఉండగా అక్కడ తొలగించుకున్నానని తెలిపారు. స్వగ్రామంలో ఓటు కోసం దరఖాస్తు చేయగా చేర్చడం లేదని పోలా భాస్కర్‌కు ఫిర్యాదు చేశారు. తిరుపతి నగరానికి చెందిన 11 మంది ఓట్లు తమ పంచాయతీలో ఉన్నాయని వాటిని తొలగించాలని విజ్ఞప్తి చేయగా పరిశీలించి తీసేశారని.. తాజాగా అందులో ఆరుగురి ఓట్లు మళ్లీ చేర్చేందుకు వైకాపా నాయకులు యత్నిస్తున్నారని సర్పంచి వెంకటేష్‌ ఫిర్యాదు చేశారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గం క్షీరసముద్రంలో 15 నిమిషాలు ఉండగా బీఎంఆర్‌పురం గ్రామస్థులు తమ ఊళ్లో పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో కొందరి ఫొటోలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయని, మార్చాలని బీఎల్వోలను భాస్కర్‌ ఆదేశించారు. అనంతరం చిత్తూరు కలెక్టరేట్‌లో గంటరన్నపాటు అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గంలో తమ అభ్యంతరాలను పరిష్కరించడం లేదని, చనిపోయిన వ్యక్తుల ఓట్లు తొలగించడం లేదని చిత్తూరు పార్లమెంట్‌ తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని