రోడ్డెక్కిన పాడి రైతులు

సీఎం జగన్‌ సొంత జిల్లాలోనే పాడిరైతులు గిట్టుబాటు ధర కోసం శుక్రవారం రోడ్డెక్కారు. పాలను నేలపై పారబోసి ఆగ్రహం ప్రదర్శించారు. గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి సమస్యపై వేడుకున్నారు. ఆపై ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకుని ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించి అక్కడే బైఠాయించారు.

Published : 09 Dec 2023 04:48 IST

వైయస్‌ఆర్‌ జిల్లాలో పాలు పారబోసి నిరసన
సేకరణ.. గిట్టుబాటు ధర లేవంటూ ఆందోళన

ఈనాడు- కడప, న్యూస్‌టుడే- జమ్మలమడుగు: సీఎం జగన్‌ సొంత జిల్లాలోనే పాడిరైతులు గిట్టుబాటు ధర కోసం శుక్రవారం రోడ్డెక్కారు. పాలను నేలపై పారబోసి ఆగ్రహం ప్రదర్శించారు. గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి సమస్యపై వేడుకున్నారు. ఆపై ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకుని ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించి అక్కడే బైఠాయించారు. అంతకుముందు పట్టణంలో మహిళా రైతులు భారీగా ర్యాలీ నిర్వహించారు. జమ్మలమడుగు మండలంలోని పలు గ్రామాల నుంచి వందలమంది మహిళా రైతులు తరలివచ్చారు. గేదె పాల ధర లీటరుకు రూ.80 చెల్లించేవారని, దాన్ని రూ.55కు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగుమతులు పడిపోయినందున నెల రోజులుగా అమూల్‌, ఇతర డెయిరీలు పాలసేకరణ తగ్గించి, ధరలో భారీగా కోత పెట్టాయని వాపోయారు. జమ్మలమడుగు ప్రాంతంలోనే నిత్యం 6 వేల లీటర్ల ఉత్పత్తి జరుగుతోందని.. సేకరణ తగ్గిస్తే తాము పాలు ఏం చేసుకోవాలని ప్రశ్నించారు. ఇప్పుడు పాలమ్ముకోలేక.. గిట్టుబాటు ధర లేక వీధిన పడ్డామంటూ మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో పాల సేకరణ చేపట్టడంతో పాటు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు హయాంలో పశువుల దాణా రూ.800 ఉంటే రాయితీ కింద రూ.300 ఇచ్చేవారని.. జగన్‌ ప్రభుత్వంలో ఆ మాత్రం సాయం కూడా లేదని గర్జించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని