కరవు కాటు.. తుపాను పోటు.. కనికరం చూపని సర్కారు

ఖరీఫ్‌లో కరవు దెబ్బతీసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా.. సుమారు 30 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగు తగ్గింది. వేసిన పంటలైనా చేతికొస్తాయనుకున్న రైతుల ఆశల్ని మిగ్‌జాం తుపాను చిదిమేసింది.

Published : 09 Dec 2023 04:50 IST

నిండా మునిగిన వరి రైతు
ఎకరాకు తిత్లీ సమయంలో ఇచ్చింది రూ.8 వేలు.. ఇప్పుడిచ్చేది రూ.6వేలే
అదీ కేంద్రం ఇస్తున్న సాయంతోనే సరిపెట్టేస్తున్న జగన్‌

ఈనాడు - అమరావతి: ఖరీఫ్‌లో కరవు దెబ్బతీసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా.. సుమారు 30 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగు తగ్గింది. వేసిన పంటలైనా చేతికొస్తాయనుకున్న రైతుల ఆశల్ని మిగ్‌జాం తుపాను చిదిమేసింది. నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడి కోతకు సిద్ధంగా ఉన్న వరిని ముంచేసింది. మిరప, మినుము, మొక్కజొన్న తదితర పంటలతోపాటు అరటి, బొప్పాయి, పూలతోటల రైతుల ఆశల్ని తుంచేసింది. లక్షల ఎకరాల్లో పంట వర్షార్పణమయింది. అటు కరవు కాటు, ఇటు తుపాను పోటుతో.. ఈ ఏడాది రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఖరీఫ్‌ పంట చేతికొచ్చే దశలో నీటిపాలవగా.. రబీలో వేసిన పైరు కూడా వర్షార్పణమైంది. అయినా ప్రభుత్వానికి రైతుల్ని ఆదుకోవాలనే చిత్తశుద్ధి కొరవడింది. 400 పైగా మండలాల్లో కరవు తీవ్రత నెలకొన్నా కాస్త కరవే అంటూ 103 మండలాలతో సరిపెట్టిన ముఖ్యమంత్రి జగన్‌కు.. తీవ్ర తుపానుతో నిలువెల్లా మునిగిన అన్నదాతలకు పెట్టుబడి సాయం పెంచి ఇద్దామన్న ఆలోచనా కొరవడింది. ఎకరానికి కనీసం రూ.12 వేల చొప్పున అయినా ఇవ్వాలని రైతులు కోరుతుంటే.. వైకాపా సర్కారు మాత్రం కేంద్రం నిర్ణయించిన మేరకు ఎకరాకు రూ.6 వేలతో సరిపెడుతోంది. తిత్లీ తుపాను సమయంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఎకరా వరికి రూ.8 వేలు, అరటికి రూ.12వేలు ఇవ్వగా.. వైకాపా ప్రభుత్వం అది కూడా తమవల్ల కాదంటూ చేతులెత్తేసింది.

ఖరీఫ్‌లో విత్తు పడక.. రబీలోనూ వానల్లేక

ఈ ఏడాది ఖరీఫ్‌ ఆరంభం నుంచి రైతుకు ప్రతికూల వాతావరణమే ఎదురవుతోంది. జూన్‌లో 31.5%, ఆగస్టులో 55% చొప్పున సాధారణం కంటే తక్కువ వానలు కురిశాయి. అక్టోబరులో 90% తక్కువ వర్షపాతం నమోదైంది. గత శతాబ్దంలో ఎన్నడూ లేనంత తక్కువ వానలు కురిశాయి. సాధారణ విస్తీర్ణం కంటే సుమారు 30 లక్షల ఎకరాలకు పైగా సాగు తగ్గింది. 400కు పైగా మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం 7 జిల్లాల్లోని 103 మండలాలనే కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. ఉత్తరాంధ్ర, ప్రకాశం, వైయస్‌ఆర్‌ జిల్లాలో తీవ్ర వర్షాభావం నెలకొన్నా ఒక్క కరవు మండలాన్నీ ప్రకటించలేదు. తమ పాలనలో కరవు లేదంటూ ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతుండటంతో.. అధికారులు కూడా నోరు మెదపని పరిస్థితి నెలకొంది. 103 కరవు మండలాల్లో 14.21 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, కేంద్ర నిబంధనల ప్రకారం రూ.503 కోట్లు, రాష్ట్ర విపత్తు నిబంధనల ప్రకారం రూ.844 కోట్ల పెట్టుబడి సాయం చేయాల్సి ఉంటుందని గుర్తించారు. రబీలోనూ కరవు కారణంగా.. వరి, శనగ, ఇతర పంటల సాగు తగ్గింది. సాధారణ విస్తీర్ణం 56 లక్షల ఎకరాలు ఉంటే.. ఇప్పటికి 12 లక్షల ఎకరాల్లోనే విత్తు పడింది.

ఎకరాకు రూ.20 వేల పైనే నష్టం

ఖరీఫ్‌లో 62 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, సుమారు 25 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేసినట్లు అంచనా. 32 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఇందులో 20% కోతలు పూర్తయి ఉంటాయనుకున్నా 80% కోతకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో మిగ్‌జాం విరుచుకుపడి వరిని ముంచేసింది. మొత్తంగా 22 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. వరి పొలాల్లో నీరు బయటకు వెళ్లినా పంట నష్టం తప్పదు. మొత్తంగా ఎకరాకు రూ.20 వేల వరకు నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు. వరి కోసి కుప్ప నూర్చినా ధాన్యంలో తేమ శాతం ఉందంటూ ఆర్‌బీకే సిబ్బంది సతాయించారు. నిబంధనల ప్రకారం 17% తేమ వచ్చినా తీసుకోవచ్చు. 15% ఉంటేనే తీసుకుంటామంటూ వేధించారు. ఈలోగా వాన విరుచుకుపడింది. తుపాను తీరం దాటడానికి ఒక్కరోజు ముందు.. తేమ శాతంతో పనిలేకుండా ధాన్యం కొనమని సీఎం ఆదేశించారు. అదే వారం రోజుల ముందు ప్రకటించి ఉంటే అధిక శాతం ధాన్యం మిల్లులకు చేరేది. సర్కారు నిర్లక్ష్యంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ధాన్యం రాశుల కిందకు నీరు చేరింది. తుపాను రాకముందే.. ధాన్యంలో తేమ ఎక్కువగా ఉందంటూ వ్యాపారులు మద్దతు ధర కంటే బస్తాకు రూ.400 వరకు తగ్గించి కొన్నారు. ఇప్పుడు తడిసిన ధాన్యానికి మరింత కోత పెడతారని రైతులు వాపోతున్నారు.  

ఉదారంగా సాయం చేయలేరా?

వరి రైతులు ఎకరాకు సగటున రూ.20 వేలకు పైగా నష్టపోయారు. విపత్తు నిబంధనల ప్రకారం ఎకరాకు రూ.6 వేలు ఇస్తారు. అదీ 33% నష్టం ఉండాలి, పొలంలో నీరు బయటకు పోతే నష్టం కిందకు రాదు లాంటి సవాలక్ష కొర్రీలు వేస్తారు. మొక్కజొన్న పూర్తిగా నేల కరవాలంటారు. మొత్తంగా చూస్తే.. పంటలు దెబ్బతిన్న రైతుల్లో 20% మందికి కూడా కూడా సాయం అందదు. నిబంధనల్ని పక్కన పెట్టి.. ఎకరాకు కనీసం రూ.12 వేలకు తగ్గకుండా పెట్టుబడి రాయితీ ఇస్తే కొంతైనా భరోసా లభిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఆ ఉదారత కనిపించడం లేదు.

మిరప, మినుము, పొగాకు, మొక్కజొన్నకూ నష్టమే

ఎకరాకు రూ.1.50 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టిన మిరప రైతులూ మిగ్‌జాంతో తీవ్రంగా నష్టపోయారు. పల్నాడు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్‌ జిల్లాల్లో మిరప చేలలో నీరు నిలవడంతోపాటు కొన్నిచోట్ల గాలులకు మొక్కలు నేలవాలాయి. ఈ ఏడాది సుమారు 6 లక్షల ఎకరాల్లో మిరప వేశారు. జెమిని వైరస్‌తో కొంత దెబ్బతింది. వర్షాభావంతో సాగు నీరందక కొంత మిరప పీకేశారు. తెగుళ్ల బారిన పడిన పంటను కాపాడుకునేందుకు పురుగుమందులకు భారీగా ఖర్చు పెట్టారు. నీటితడికి రూ.20వేలకు పైగా అయింది. తుపాను ధాటికి ఇప్పుడు మొత్తం మునిగింది.

  • ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పొగాకు తోటలు తుపానుకు నేలవాలాయి. చాలాచోట్ల నీరు నిలిచింది. శనగ, మొక్కజొన్న, మినుము, ఆముదం నీటిలో మునిగాయి.
  • అన్నమయ్య జిల్లాలో అరటి, బొప్పాయి నేలమట్టమయ్యాయి. ప్రకాశం జిల్లాలోనూ పండ్లతోటల రైతులు ఎకరాకు రూ.50వేలకు పైగా నష్టపోయారు. కూరగాయ పంటలూ దెబ్బతిన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని