ప్రభుత్వ తీరుపై వ్యాజ్యం వేయడమే పాపమా?

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ప్రాంత రైతులు వేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు సింగిల్‌ జడ్జి విచారించొచ్చని వారి తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు శుక్రవారం హైకోర్టుకు నివేదించారు.

Updated : 09 Dec 2023 05:44 IST

ఫోరం షాపింగ్‌కు పాల్పడుతోంది సర్కారే
ప్రస్తుత బెంచ్‌ వ్యాజ్యంపై విచారణ జరపొచ్చు
త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపనక్కర్లేదు
అమరావతి రైతుల తరఫు న్యాయవాది వాదన
విశాఖకు కార్యాలయాల తరలింపుపై లోతైన విచారణ జరుపుతామన్న హైకోర్టు
సోమవారానికి వాయిదా

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ప్రాంత రైతులు వేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు సింగిల్‌ జడ్జి విచారించొచ్చని వారి తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాల్సిన అవసరం లేదన్నారు. నచ్చిన బెంచ్‌ వద్దకు వ్యాజ్యం విచారణకు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వమే ఫోరం షాపింగ్‌/ బెంచ్‌ హంటింగ్‌కు పాల్పడుతోందన్నారు. ప్రభుత్వ వాదన చూస్తుంటే కేసు విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవాలన్నట్లు ఉందని, ఇది కోర్టు ధిక్కరణేనని చెప్పారు. పిటిషనర్లు వ్యాజ్యం దాఖలు చేయడమే పాపం అన్నట్లు ప్రభుత్వం చూస్తోందన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించిన రోస్టర్‌ ప్రకారం తమ వ్యాజ్యంపై ప్రస్తుత బెంచ్‌ విచారణ జరపాలని కోరారు. సింగిల్‌ జడ్జి వద్దకు వ్యాజ్యం విచారణకు రావడంపై ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరంపై శుక్రవారం ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు ముగిశాయి. వ్యాజ్యాన్ని లోతుగా విచారించేందుకు సోమవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.

శుక్రవారం విచారణ ప్రారంభంకాగానే న్యాయమూర్తి స్పందిస్తూ.. ఫోరం షాపింగ్‌ ఆరోపణపై ఈ వ్యాజ్యం విచారణకు రావడానికి ముందురోజే, మీరు (ఏజీ) వాదనలు చెప్పకముందే ఓ పత్రిక (సాక్షి)లో కథనం వచ్చిందన్నారు. ఏజీ స్పందిస్తూ.. ఆ కథనంతో తనకు సంబంధం లేదన్నారు. కోర్టులో విచారణకు రాక ముందే కేసు వివరాలు మీడియాలో వచ్చేస్తున్నాయన్నారు. మీడియా ట్రయల్‌ నిర్వహిస్తున్నారన్నారు. ఇంటర్వ్యూలు ఇస్తున్నారన్నారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు స్పందిస్తూ స్కిల్‌ కేసుకు సంబంధించి సీఐడీ చీఫ్‌, అదనపు ఏజీ మీడియా సమావేశాలు నిర్వహించారని గుర్తుచేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై పర్యవేక్షణ ముసుగులో సీఎం క్యాంప్‌ కార్యాలయం పేరిట విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్‌ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని ప్రాంత రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం హైకోర్టులో వ్యాజ్యం వేసిన సంగతి తెలిసిందే.


త్రిసభ్య ధర్మాసనం వినడం సబబు

-ఏజీ

శుక్రవారం విచారణలో ఏజీ వాదనలు కొనసాగిస్తూ ఈ వ్యాజ్యంపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపడం సబబు అన్నారు. సింగిల్‌ జడ్జి వద్దకు విచారణకు వచ్చేందుకు వీలుగా వ్యాజ్యంలో వివరాలను తెలివిగా రాశారన్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటుపై అభ్యంతరం ఉంటే కోర్టు దృష్టికి తీసుకొచ్చేందుకు త్రిసభ్య ధర్మాసనం గతంలో వెసులుబాటు ఇచ్చిందని గుర్తుచేశారు. సంబంధం లేనివి, వ్యక్తిగత ప్రతీకారంతో కూడిన అంశాలను వ్యాజ్యంలో ప్రస్తావించారన్నారు. లోతుల్లోకి వెళ్లి విచారణ జరపాలని కోర్టు భావిస్తే వాదనలు వినిపిస్తామని చెప్పారు.


విశాఖకు పరిపాలన తరలించే ఎత్తుగడ

-ఉన్నం

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు ప్రతివాదనలు వినిపించారు. ‘కార్యాలయాల ఏర్పాటుకు విశాఖలో అనువైన ప్రదేశాలను గుర్తించి, ఐఏఎస్‌ కమిటీ చేసిన సిఫారసులకు వీలుగా ప్రభుత్వం జీవో 2283 జారీ చేసింది. దానిపై విచారణ రోస్టర్‌ ప్రకారం ఈ కోర్టు పరిధిలోనే ఉంది. అమరావతే రాజధాని అన్న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పును తప్పించుకునేందుకే సీఎం క్యాంప్‌ కార్యాలయం ముసుగులో దొడ్డిదారిన విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించబోతున్నారు. ప్రస్తుత సచివాలయం 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. క్యాంప్‌ ఆఫీసుల పేరుతో విశాఖలో కార్యాలయాల కోసం 7.53 లక్షల చ.అ.ల విస్తీర్ణం ఉన్న భవనాలను ఎంపిక చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే కార్యాలయాలన్నింటినీ అక్కడికి తరలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సీఎం కార్యాలయ ఏర్పాటుపై అప్పట్లో వ్యాజ్యం వేసిన పిటిషనర్లకే త్రిసభ్య ధర్మాసనం వెసులుబాటు ఇచ్చింది. ఆ వ్యాజ్యం ప్రస్తుత పిటిషనర్లు వేయలేదు. కాబట్టి ఈ వ్యాజ్యాన్ని త్రిసభ్య ధర్మాసనానికి పంపనక్కర్లేదు. ప్రస్తుత బెంచే మా వ్యాజ్యంపై విచారణ జరపొచ్చు. మేం ఫోరం షాపింగ్‌కు పాల్పడుతున్నామన్న ప్రభుత్వ వాదన అర్థరహితం. ఏజీ చాలాసేపు వాదనలు వినిపించినా ప్రస్తుత బెంచ్‌ ఈ వ్యాజ్యాన్ని ఎందుకు విచారించకూడదో చెప్పలేకపోయారు. పిటిషనర్ల ఆస్తులు రాజధాని నగర ప్రాంత పరిధిలో ఉన్నాయి. వారి వ్యక్తిగత ప్రయోజనం ముడిపడి ఉన్నందున రిట్‌ దాఖలు చేశారు. పిటిషనర్ల ఆవేదన, ఇబ్బందులనే అందులో ప్రస్తావించారు. త్రిసభ్య ధర్మాసనం తీర్పును ఉల్లంఘిస్తూ కార్యాలయాల తరలింపునకు అధికారులు భారీగా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. పర్యాటక రిసార్టు పేరుతో రుషికొండను ధ్వంసం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉన్నా రూ.200 కోట్లు ఖర్చు పెట్టి విలాసవంతమైన భవనాన్ని నిర్మించారు. అందులో సీఎం క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని గోప్యంగా ఉంచారు. వీటన్నింటికీ బాధ్యులను చేయాలనే అధికారులను ప్రతివాదులుగా పేర్కొన్నాం’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని