తెల్లకాగితం మీద పేర్లు రాసిస్తే... ఓట్లు తొలగిస్తున్నారు

చాలా నియోజకవర్గాల్లో వైకాపా నాయకులు తెల్లకాగితాలపై పేర్లు రాసిస్తుంటే.. ఎన్నికల సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా ప్రతిపక్ష పార్టీల ఓట్లు తొలగిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

Published : 09 Dec 2023 04:54 IST

గంపగుత్తగా ఫారం-6, 7ల స్వీకరణ
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి తెదేపా అధినేత చంద్రబాబు ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: చాలా నియోజకవర్గాల్లో వైకాపా నాయకులు తెల్లకాగితాలపై పేర్లు రాసిస్తుంటే.. ఎన్నికల సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా ప్రతిపక్ష పార్టీల ఓట్లు తొలగిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అధికారపార్టీ నాయకులు గంపగుత్తగా ఫారం-7 దరఖాస్తులు చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. దొంగ ఓట్ల నమోదు, అనర్హుల్ని జాబితాలో చేర్చడం, పెద్ద సంఖ్యలో ప్రతిపక్ష పార్టీలు, వారి సానుభూతిపరుల ఓట్లు తొలగించడం, ఒకే ఇంటి నంబరుతో ఓట్లు, ఒకేలాంటి ఫొటోలున్నాయని నోటీసులు ఇవ్వడం, కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ఉల్లంఘన లాంటి అయిదు ప్రధాన అంశాల్ని లేఖలో ప్రస్తావించారు. ఈ వివరాల్ని తెదేపా బృందం శుక్రవారం ఎన్నికల సంఘానికి అందజేసింది. లేఖలోని అంశాలు..

ఓటర్లుగా అనర్హులు: ‘‘అనర్హుల్ని ఓటరు జాబితాలో చేర్చేందుకు గంపగుత్తగా ఫారం-6 దరఖాస్తులు చేస్తున్నారు. అయినా క్షేత్రస్థాయి సిబ్బంది వాటిని ఆమోదిస్తున్నారు. కనీసం తనిఖీలు కూడా చేయట్లేదు. సమగ్ర సవరణ కంటే ముందు గుర్తించిన మృతుల ఓట్లు, ఇంటింటి సర్వేలో గుర్తించినవి,  ప్రభుత్వం వద్ద ఉన్న జనన మరణ నమోదు సమాచారం ఆధారంగా మృతుల ఓట్లను జాబితాలో నుంచి తొలగించాలి. కానీ అవి కొనసాగుతున్నాయి.’’ ‘‘ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభించడానికి ముందే డీఎస్‌ఈ, పీఎస్‌ఈల్ని తొలగించాల్సి ఉన్నా ఆ పని చేయలేదు. నేటికీ ఆ ప్రక్రియ కొనసాగుతోంది. అనేక నియోజకవర్గాల్లో ఒక్కొక్కరికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయి. వీటినీ సరిచేయలేదు. ఓటరు జాబితాను ఇంటి నంబర్ల ప్రకారం వరుస క్రమంలో ఉండేలా చూడాలి. ఈ విధానం లేదు.’’

తనిఖీ చేయకుండా తొలగింపు

‘‘ప్రతిపక్ష పార్టీల ఓట్లు తొలగించడమే లక్ష్యంగా అధికార పార్టీ నాయకులు ఫారం-7 కింద దరఖాస్తులు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం గంపగుత్తగా దరఖాస్తులు స్వీకరించకూడదు. ఓటు తొలగించాలంటే అందుకు తగిన ఆధారాలు చూపించాలి. ఇవేమీ క్షేత్రస్థాయి సిబ్బంది పట్టించుకోవట్లేదు. కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక వైకాపా నాయకులు రాసిస్తున్న పేర్లను అన్యాయంగా జాబితా నుంచి తొలగిస్తున్నారు. కనీసం క్షేత్రస్థాయిలో తనిఖీ చేయకుండా తప్పుడు ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఓటర్లకు నోటీసులు జారీచేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. ఓటరుగా నమోదు కానివారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, చనిపోయిన వారు, ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నవారి సమాచారాన్ని సమగ్రంగా తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ముసాయిదా జాబితా విడుదల చేసి నెల గడుస్తున్నా ఈ సమాచారం లేదు’’ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ అంశాలపై దృష్టిపెట్టి... అవకతవకలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇప్పటికీ 5 లక్షల వరకు మరణించిన వారి ఓట్లు, 3.5 లక్షల వరకు డూప్లికేట్‌ ఓట్లు జాబితాలో ఉన్నాయని తెదేపా నేతలు ఆరోపించారు. చంద్రబాబు రాసిన లేఖను శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ నేతృత్వంలో తెదేపా బృందం సీఈఓకు అందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని