సొంతిల్లు ఉన్నంత మాత్రాన నివాసితుడిగా పరిగణించొద్దు

‘ఇతర రాష్ట్రాల్లోని తమ ఓటు హక్కును ఆంధ్రప్రదేశ్‌కు మార్చుకోవటం కోసం వచ్చే ఫాం-8లను పరిశీలించేటప్పుడు.. దరఖాస్తుదారుకు ఆ ప్రాంతంలో సొంతిల్లు ఉన్నంత మాత్రాన అక్కడి నివాసితుడిగా పరిగణించరాదు.

Updated : 09 Dec 2023 06:34 IST

క్షేత్రస్థాయిలో విచారించాకే నిర్ధారించుకోవాలి
ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి ఓటు హక్కు మార్చుకోవటానికి వచ్చే దరఖాస్తులపై ఎన్నికల సంఘం స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: ‘ఇతర రాష్ట్రాల్లోని తమ ఓటు హక్కును ఆంధ్రప్రదేశ్‌కు మార్చుకోవటం కోసం వచ్చే ఫాం-8లను పరిశీలించేటప్పుడు.. దరఖాస్తుదారుకు ఆ ప్రాంతంలో సొంతిల్లు ఉన్నంత మాత్రాన అక్కడి నివాసితుడిగా పరిగణించరాదు. క్షేత్రస్థాయిలో విచారించి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 20లో పేర్కొన్న అంశాల మేరకు స్థానిక నివాసితుడా కాదా అనేది నిర్ధారించుకోవాలి’ అని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆయా దరఖాస్తుదారుల ఫొటో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య (ఎపిక్‌ నెంబర్‌) ఆధారంగా ఒకటికి మించి ఓట్లున్నాయా అనేది చూడాలని బీఎల్వోలు, ఏఈఆర్వోలకు నిర్దేశించింది. అలా ఉన్నట్లు తేలితే బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్వోలు) ఆ వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరని పేర్కొంది. ఈ దరఖాస్తులపై రాజకీయ పార్టీల బూత్‌ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏలు) లేదా ఇతరులు ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాటిపై విచారణ జరపాలని ఆదేశించింది. వీటితో పాటు దరఖాస్తుదారు సమర్పించే పత్రాలు తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఓటు నమోదుపై ఈఆర్వో తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించింది. దరఖాస్తుదారు తప్పుడు సమాచారం, డిక్లరేషన్‌ ఇచ్చినట్లు నిర్ధారణైతే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని పేర్కొంది. తెలంగాణలో ఓటేసినవారు ఏపీలో ఓటేయకుండా చర్యలు తీసుకోవాలంటూ వైకాపా ఇటీవల ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజాగా ఈ ఆదేశాలిచ్చింది. ప్రధానాంశాలివి.

తప్పుడు డిక్లరేషన్‌ ఇస్తే కేసు

  • తొలిసారి ఓటు నమోదు చేసుకునేవారి నుంచి ఫాం-6తోపాటు ఎక్కడా ఓటర్ల జాబితాలో తమ పేరు లేదంటూ డిక్లరేషన్‌ తీసుకోవాలి.
  • 20 ఏళ్లు పైబడినవారు ఫాం-6 కింద కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే క్షుణ్ణంగా పరిశీలించాలి. నమోదులో ఎందుకు జాప్యం చేశారో ఆరా తీయాలి.
  • తమ ఓటు హక్కును ఒకచోట నుంచి మరోచోటికి మార్చుకోవటానికి ఫాం-8లో దరఖాస్తు చేసుకునేవారు ఫొటో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య (ఎపిక్‌ నెంబర్‌) తప్పనిసరిగా పొందుపరచాలి. లేదంటే దాన్ని అసంపూర్ణ దరఖాస్తుగా పరిగణించాలి.  ‘తప్పుడు సమాచారంతో డిక్లరేషన్‌ ఇస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 31 ప్రకారం ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తారనేదానిపై నాకు అవగాహన ఉంది’ అని ఆ దరఖాస్తుదారుల నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని