అయిదు ఎకరాలు ఎందుకు? ఆరున్నరెకరాలు ఇస్తాం తీసుకో..!

శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలోని అయిదు ఎకరాల భూమిని పేదలకు ఇళ్లస్థలాల పేరుతో వైకాపా నేత కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం ఏం చేయాలి? కబ్జా నుంచి కాపాడి వర్సిటీకి అప్పగించాలి.

Published : 09 Dec 2023 08:01 IST

ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నాయకుడికి బంపర్‌ ఆఫర్‌
ఎస్‌కేయూ వర్సిటీ భూమి ధారాదత్తానికి ప్రభుత్వ యత్నాలు

ఈనాడు, అమరావతి: శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలోని అయిదు ఎకరాల భూమిని పేదలకు ఇళ్లస్థలాల పేరుతో వైకాపా నేత కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం ఏం చేయాలి? కబ్జా నుంచి కాపాడి వర్సిటీకి అప్పగించాలి. ఇది సాధారణంగా జరిగే విషయం. కానీ, వైకాపా ప్రభుత్వం అంతా రివర్సే కదా..! ఈ వ్యవహారంలోనూ అలాగే చేస్తోంది. ఇళ్ల స్థలాల కోసం వర్సిటీకి చెందిన అయిదు ఎకరాల భూమి కావాలని అధికారులు కోరితే వర్సిటీకి చెందిన 6.40 ఎకరాలు ఇస్తామంటూ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒకవేళ ప్రభుత్వం నిజంగా పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలనుకుంటే వేరేచోట ప్రభుత్వ భూమిని ఇవ్వొచ్చు. భూమి అందుబాటులో లేకపోతే కొని ఇవ్వొచ్చు. కానీ, ఇందుకు విరుద్ధంగా వర్సిటీ భూములనే ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఉన్నతవిద్యలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ అధికారికి అనంతపురానికి చెందిన వైకాపా నాయకుడికీ మధ్య మంచి సంబంధాలు ఉండడంతో వర్సిటీలోని సర్వే నంబరు 289/2లోని 5 ఎకరాలకు బదులు.. వర్సిటీకి చెందిన 6.40 ఎకరాలు ఇస్తామని ఆయన ప్రతిపాదించారు. ఇలాంటి వ్యవహారం ఎక్కడైనా జరుగుతుందా? ఉన్నత విద్యాశాఖలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి చేస్తున్న ఈ ప్రతిపాదన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

గతంలో తిరస్కరించినా..

అప్పటి వీసీ రామకృష్ణారెడ్డి సైతం గత అక్టోబరులో ఇదే ప్రతిపాదన చేస్తే పాలకవర్గం తిరస్కరించింది. ఇచ్చేందుకు వీలులేదని పేర్కొంది. ఇప్పుడు కొత్త పాలకవర్గంలో ఈ ప్రతిపాదన పెట్టి, ప్రభుత్వానికి అప్పగించాలని తీర్మానించబోతున్నారు. ఆ తర్వాత వైకాపా నాయకుడు తన అధికారాన్ని వినియోగించి మొత్తం భూమిని తన ఆధీనంలోకి తీసుకోవాలని తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. వర్సిటీలోని ప్రభుత్వ భూమిని గతంలో రెవెన్యూ అధికారులు సర్వే చేసి, చుట్టూ ప్రహరీ నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో వర్సిటీ నిధులతో ప్రహరీ నిర్మించారు. లోపల ఉన్న ఆ స్థలానికి ఇటీవల వైకాపా నాయకుడు కంచె వేశారు. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో వర్సిటీ తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఈ అయిదు ఎకరాల భూమినీ వదిలేసి, వర్సిటీ భూముల్లో ఒకపక్కగా ఉన్న 6.40 ఎకరాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. మొదట విశ్వవిద్యాలయాల నిధులపై కన్నేసిన ప్రభుత్వం ఇప్పుడు వాటి భూములను లాగేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. వర్సిటీలకు నిధులు ఇవ్వాల్సిందిపోయి వాటికి చెందిన రూ.150 కోట్లను రాష్ట్ర ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయించుకుంది. ఈ కార్పొరేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. నిధులు తీసేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయ వర్సిటీకి చెందిన భూములపై పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని