TSRTC: బస్సుల్లో 15% పెరిగిన రద్దీ!

మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. గత ఆదివారం(3వ తేదీ)తో పోలిస్తే ఈ ఆదివారం(10వ తేదీ) దాదాపు 15 శాతం పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

Updated : 11 Dec 2023 09:59 IST

ఆర్టీసీ అధికారుల అంచనా
నేడు కార్తికమాసం ఆఖరి సోమవారం.. ప్రయాణికులు భారీగా పెరిగే అవకాశం
డ్రైవర్లు, కండక్టర్లకు సెలవుల రద్దు

ఈనాడు, హైదరాబాద్‌: మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో (TSRTC) రద్దీ పెరుగుతోంది. గత ఆదివారం(3వ తేదీ)తో పోలిస్తే ఈ ఆదివారం(10వ తేదీ) దాదాపు 15 శాతం పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అందులో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని చెబుతున్నారు. టిమ్స్‌లో ‘జీరో టికెట్‌’ సాఫ్ట్‌వేర్‌ వచ్చాక వాస్తవ సంఖ్యపై స్పష్టత వస్తుందని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా మిగతా రోజులతో పోలిస్తే సోమవారం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఈ నెల 11 కార్తికమాసంలో ఆఖరి సోమవారం కావడంతో మహిళా ప్రయాణికుల రద్దీ భారీగా ఉండవచ్చని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్లకు సెలవులను రద్దు చేసింది.

శైవ క్షేత్రాలకు అధిక బస్సులు

వేములవాడ, కీసరగుట్ట, రామప్ప, కాళేశ్వరం వంటి శైవ క్షేత్రాలకు పెద్దసంఖ్యలో బస్సులు నడిపించాలని ఆర్టీసీ నిర్ణయించింది. మిగతా రూట్లకు తగ్గించి.. శైవ క్షేత్రాలకు రద్దీకి తగ్గట్లు నడపాలని ఉన్నతాధికారులు ఆదివారం ఆదేశించారు. సాధారణ రోజుల్లో 31-32 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడుస్తాయి. సోమవారం ఆ సంఖ్య 34 లక్షల కిలోమీటర్లకు పెరుగుతుంది. ఈ నెల 11న(సోమవారం) మరో 10 శాతానికిపైగా బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. స్పేర్‌ బస్సులను కూడా సిద్ధం చేస్తోంది. ‘మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేందుకు ప్రయత్నిస్తాం. ఉన్న బస్సులతోనే ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు సరికొత్త వ్యూహాలపై దృష్టి పెడతాం. దూరప్రాంతాల వరకు కాకుండా ఎక్కడి వరకు రద్దీ ఉంటే.. అక్కడివరకే నడిపేలా ‘కట్‌’ ట్రిప్పులు వంటివి ఇందులో ఉంటాయి. అనుభవాన్ని బట్టి కొత్త ఆలోచనలకు అనుగుణంగా కార్యాచరణ పెడతాం’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి వివరించారు.


బస్సులకు ‘మహాలక్ష్మి’ కళ!

రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి పథకంతో బస్టాండ్‌లు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. వివిధ మార్గాల్లో గతంలో పల్లెవెలుగు బస్సుల్లో వెళ్లినవారు.. ప్రభుత్వం కల్పించిన ఉచిత ప్రయాణ సదుపాయంతో ఎక్స్‌ప్రెస్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఎక్స్‌ప్రెస్‌ల వద్ద రద్దీ నెలకొంటోంది. బస్సు ప్రధాన ద్వారం నుంచి ఎక్కువ సంఖ్యలో వెళుతుండటంతో కొందరు ప్రయాణికులు సీట్లు ఉండవన్న కంగారులో డ్రైవర్లు కూర్చొనే ద్వారం నుంచి లోనికి ప్రవేశిస్తున్నారు. నిర్మల్‌ బస్టాండ్‌లో ఆదివారం కనిపించిన దృశ్యాలివి..

న్యూస్‌టుడే, నిర్మల్‌ పట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని