Dharmana Prasadarao: విద్యుత్తు ఛార్జీల పెంపు వాస్తవమే: మంత్రి ధర్మాన

విద్యుత్తు ఛార్జీలు పెరిగిన మాట వాస్తవమేనని, దేశంలో ప్రతి రాష్ట్రంలో పెరిగాయని, ధరల పెరుగుదల అనేది కేంద్రం చేతిలో ఉంటుందని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

Updated : 14 Dec 2023 10:00 IST

ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, న్యూస్‌టుడే, పాతపట్నం: విద్యుత్తు ఛార్జీలు పెరిగిన మాట వాస్తవమేనని, దేశంలో ప్రతి రాష్ట్రంలో పెరిగాయని, ధరల పెరుగుదల అనేది కేంద్రం చేతిలో ఉంటుందని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో బుధవారం జరిగిన సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రజలకు లబ్ధి చేకూరేలా పథకాలు, ఇళ్లు ఇస్తుంటే ప్రతిపక్షాలు రోడ్లు బాగా లేవని గుంతలు చూపిస్తున్నాయన్నారు. ఏడాది సమయం ఇస్తే రోడ్లు వేస్తామన్నారు. స్థూల జాతీయోత్పత్తిలో రాష్ట్రం నాలుగేళ్లలో ప్రగతి సాధించిందన్నారు. గతంలో 14 ఏళ్ల పాటు చంద్రబాబు పాలనలో ప్రగతి కనిపించలేదని తెలిపారు. శాసనసభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలందరికీ విద్య, వైద్యం, సంక్షేమం అందించామని, తెదేపా గతంలో జన్మభూమి కమిటీల పేరుతో పేదలకు పథకాలు అందకుండా చేసిందన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ గత ప్రభుత్వం వంశధార నిర్వాసితులకు అన్యాయం చేసి, అడ్డగోలుగా నిర్వాసితులను ఖాళీ చేయించిందని చెప్పారు.

సామాజిక సాధికార యాత్ర సభతో స్థానికులకు ఇబ్బందులు తప్పలేదు. సభా వేదికను పాతపట్నం ప్రధాన రహదారిపై ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. పాతపట్నం లోపలికి వైకాపా జెండా ఉన్న వాహనాలనే అనుమతించడంతో పోలీసులపై స్థానికులు మండిపడ్డారు. ప్రారంభ ఉపన్యాసంతోనే ప్రజలు వెనుదిరగడం ప్రారంభించారు. ముందుగా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, అనంతరం మంత్రి ధర్మాన ప్రసాదరావు, శాసనసభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడారు. సభాపతి సీతారాం మాట్లాడుతుండగా ఓ వ్యక్తి తన సమస్య చెప్పుకోవాలని పలుమార్లు అరవడంతో అతన్ని పక్కకు తీయండి అంటూ ఆవేశపూరితంగా మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని