చంద్రబాబుపై అలిపిరి వద్ద జరిగిన దాడి కేసులో ముగ్గురు నిర్దోషులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెదేపా అధినేత చంద్రబాబుపై అలిపిరి వద్ద జరిగిన దాడి కేసులో ముగ్గురు నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ తిరుపతి నాలుగో అదనపు జిల్లా సెషన్సు న్యాయస్థానం ఇన్‌ఛార్జి న్యాయమూర్తి జి.అన్వర్‌ బాషా శుక్రవారం తీర్పు ఇచ్చారు.

Updated : 16 Dec 2023 08:02 IST

సెషన్సు కోర్టు న్యాయమూర్తి తీర్పు

తిరుపతి (లీగల్‌), న్యూస్‌టుడే: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెదేపా అధినేత చంద్రబాబుపై అలిపిరి వద్ద జరిగిన దాడి కేసులో ముగ్గురు నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ తిరుపతి నాలుగో అదనపు జిల్లా సెషన్సు న్యాయస్థానం ఇన్‌ఛార్జి న్యాయమూర్తి జి.అన్వర్‌ బాషా శుక్రవారం తీర్పు ఇచ్చారు. 2003 అక్టోబరులో అలిపిరి వద్ద పీపుల్స్‌వార్‌ గ్రూపు మందుపాతర పేల్చడంతో చంద్రబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపి నాటి పీపుల్స్‌వార్‌ అగ్రనేతలు సహా 33 మందిపై కేసు నమోదు చేసి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. వారిలో తిరుపతికి చెందిన జి.రామమోహన్‌రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఎస్‌.నరసింహారెడ్డి, కేశవలపై విచారణ అనంతరం తిరుపతి సహాయ సెషన్సు న్యాయస్థానం ఒక్కొక్కరికి నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ 2014లో తీర్పు ఇచ్చింది. వారు జిల్లా కోర్టులో అప్పీలు చేసుకున్నారు. దీనిపై శుక్రవారం తీర్పు వెలువరిస్తూ వారు ముగ్గురూ నిర్దోషులని జిల్లా కోర్టు ప్రకటించింది. గతంలో ఈ కేసులో కడప జిల్లాకు చెందిన ముప్పిరెడ్డి రామస్వామిరెడ్డి, జోతెం నాగార్జున, కొల్లం గంగిరెడ్డి, ఎన్‌.పాండురంగారెడ్డిలకు కింది కోర్టు ఏడేళ్ల శిక్ష విధించింది. నిందితులు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. తర్వాత కేసును తిరుపతిలోని నాలుగో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టుకు బదిలీ చేయగా, విచారణ అనంతరం 2012లో గంగిరెడ్డి, పాండురంగారెడ్డిలను న్యాయమూర్తి నిర్దోషులుగా ప్రకటించారు. రామస్వామిరెడ్డి, నాగార్జునలపై హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు