IT: ఐటీకి చావుదెబ్బ!

హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్‌, ముంబయి, పుణె, దిల్లీ, నొయిడా తదితర నగరాల్లోనే కాదు.. అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా.. లాంటి దేశాల్లోనూ ఐటీ నిపుణుల్లో అత్యధికులు తెలుగువారే. వారిలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే.

Updated : 18 Dec 2023 09:45 IST

రాష్ట్రంలో పురోగతి లేని ఐటీ రంగం
పెట్టుబడుల ఆకర్షణలో వెనకబడిన వైకాపా సర్కారు
5 ఏళ్లలో వచ్చింది అరకొర కంపెనీలే
ఈనాడు - అమరావతి

హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్‌, ముంబయి, పుణె, దిల్లీ, నొయిడా తదితర నగరాల్లోనే కాదు.. అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా.. లాంటి దేశాల్లోనూ ఐటీ నిపుణుల్లో (IT professionals) అత్యధికులు తెలుగువారే. వారిలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే. రాష్ట్రంలో ప్రముఖ నగరాలుగా వినుతికెక్కిన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడ వంటి ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమ విస్తరించి ఉంటే రాష్ట్ర యువతలో అధికశాతానికి వలసబాట తప్పేది. సొంత రాష్ట్రంలో ఘనమైన ఉపాధి దొరికేది. రెండు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్‌ విడివడిన అనంతరం తెదేపా ప్రభుత్వం ఐటీ రంగంపై చూపిన శ్రద్ధ వైకాపా సర్కారు చూపకపోవడంతో ఆ రంగం ముందడుగు వేయలేకపోయింది.

అదానీ సంస్థ విశాఖలో రూ.70 వేల కోట్లతో 5 గిగావాట్ల(5,000 మెగావాట్ల) డేటా సెంటర్‌ ఏర్పాటుకు తెదేపా ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే 20 ఏళ్లలో ఈ సెంటర్‌ అభివృద్ధి చేస్తామని పేర్కొంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరావడంతోనే రాజకీయ వేధింపులకే ప్రాధాన్యం ఇచ్చింది. ఈ తీరుతో అదానీ సంస్థ తన పెట్టుబడుల పరిధిని రూ.21,844 కోట్లకు తగ్గించి.. 300 మెగావాట్ల డేటా సెంటర్‌ ఏర్పాటుకు పరిమితమైంది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్‌ పీపీఏలు, గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు కేటాయించిన భూములపై సమీక్ష పేరుతో   పారిశ్రామికవేత్తల్ని వేధింపులకు గురిచేయడంతో బడా సంస్థలు తమ నూతన కార్యాలయాల ఏర్పాటు, పెట్టుబడి, విస్తరణ ప్రణాళికల అమలుకు ఆంధ్రప్రదేశ్‌ను పరిగణనలోకి తీసుకోవడం మానేశాయి.

ఐటీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని జగన్‌ ప్రభుత్వం పదేపదే చెప్పింది. ఐటీ పార్కులు, ఆఫీసు స్పేసెస్‌, కాన్సెప్ట్‌ సిటీలను ఏర్పాటు చేస్తామంటూనే ఏళ్లు గడిపేసింది. నైపుణ్య మానవ వనరులు, వందల సంఖ్యలో ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నా ఐటీ కంపెనీలను ఆకట్టుకోలేని అసమర్థ ప్రభుత్వంగా మిగిలిపోయింది. దాంతో రాష్ట్రం నుంచి ఏటా లక్షల మంది యువత ఇంజినీరింగ్‌ పట్టాలతో బయటకు వస్తున్నా సొంత రాష్ట్రంలో ఉపాధి దొరక్క.. వలస వెళ్తున్నారు.

ప్రోత్సాహం ఎక్కడ?

ఐటీ పరిశ్రమలకు అనువైన వాతావరణాన్ని కల్పించేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయకపోగా.. ఉన్న వాటినీ నిరుపయోగంగా మార్చేసింది జగన్‌ ప్రభుత్వం. గత ప్రభుత్వం విశాఖలో స్టార్టప్‌ విలేజ్‌ను ప్రారంభించింది. సుమారు 50 స్టార్టప్‌ కంపెనీలు ప్రత్యక్షంగా.. మరో 80 స్టార్టప్‌లు వర్చువల్‌ విధానంలో కార్యకలాపాలను ప్రారంభించాయి. ఆ తర్వాత దశ యాక్సిలరేటర్‌ స్థాయి కంపెనీల కోసం సింగపూర్‌కు చెందిన కంపెనీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేలా సమన్వయం చేసింది. వాటిని యథావిధిగా వినియోగించుకున్నా.. ఐటీ రంగంలో పొరుగు రాష్ట్రాలతో ఏపీ పోటీ పడేది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్టార్టప్‌ విలేజ్‌ను మూసేసి.. అక్కడి భవనాలను మూడేళ్లుగా నిరుపయోగంగా ఉంచింది. మిలీనియం టవర్స్‌ 1, 2 భవనాలను ఖాళీగా ఉంచింది. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన కంపెనీలు తప్పించి.. కొత్త కంపెనీలకు అందులో స్థలాన్ని కేటాయించలేదు.

ప్రభుత్వ కృషితో వచ్చాయా?

వర్క్‌ఫ్రమ్‌ హోం విధానంలో పనిచేస్తున్న తమ ఉద్యోగుల కోసం కొన్ని చోట్ల ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటుచేయాలని ఇన్ఫోసిస్‌ నిర్ణయించి.. ఏపీలో విశాఖను ఎంపిక చేసుకుంది. దీంతో అదనంగా ఉపాధి ఏమీ రాలేదు. గత ప్రభుత్వ హయాంలో గన్నవరం దగ్గర హెచ్‌సీఎల్‌ సంస్థ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. యువతకు సొంతంగా శిక్షణ ఇచ్చి.. ఉపాధి కల్పిస్తోంది. కానీ, కృష్ణా జిల్లాలో హెచ్‌సీఎల్‌ కేంద్రం 2023లో ఏర్పాటు చేసినట్లుగా జగన్‌ ప్రభుత్వం పేర్కొనడం హాస్యాస్పదమైంది.

ముగ్గురున్నా ముందుకేది?

ఐటీ రంగంలో పెట్టుబడులు తీసుకురావడానికి ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను భారీ వేతనాలు ఇచ్చి మరీ నియమించింది. వారిలో శ్రీనాథ్‌ దేవిరెడ్డి, విద్యాసాగర్‌రెడ్డిలు (సాంకేతిక), రాజశేఖరరెడ్డి (పాలసీ, ఇన్వెస్ట్‌మెంట్‌)లను నియమించినా ఫలితం కనపడలేదు. ప్రభుత్వ విధానంలో పేర్కొన్న ప్రకారం గత 5 ఏళ్లలో 21 సంస్థలు కేవలం రూ.6.20 కోట్లను ప్రోత్సాహకాలుగా పొందాయి. అంటే ఏటా సగటున రూ.1.24 కోట్లు ప్రోత్సాహకాల కింద చెల్లించినట్లైంది. దీన్ని బట్టి ఈ రంగంలో పురోగతిని అర్థం చేసుకోవచ్చు.

అరచేతిలో వైకుంఠం.. ఐటీ పాలసీ

2021-24 ఐటీ పాలసీలో ప్రాధాన్యతలను ప్రభుత్వం వివరించింది. ఐటీ రంగాన్ని తామే పతాక స్థాయిలో అభివృద్ధి చేస్తామని కబుర్లు చెప్పింది. ప్రభుత్వం తక్షణం పలు లక్ష్యాలను సాధించాల్సి ఉందని పాలసీలో చెప్పింది. అవి..

  • ఐటీ పరిశ్రమలకు అవసరమైన నిపుణులను తయారు చేయడం
  • ఐటీ కార్యకలాపాలను ప్రారంభించడానికి వీలుగా కోవర్కింగ్‌ స్పేస్‌, శాటిలైట్‌ సెంటర్ల ఏర్పాటు
  • స్టార్టప్‌లు, కొత్త ఆలోచనలను ప్రోత్సహించడం
  • పెట్టుబడులతో వచ్చేవారికి తక్షణ అనుమతులు
  • విశాఖలో ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ పార్కును అభివృద్ధి చేయడం ద్వారా ఐటీ రంగానికి అవసరమైన రీసెర్చ్‌ యూనివర్సిటీ, ఇంక్యుబేషన్‌ సెంటర్స్‌, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, ల్యాబ్‌లు, కో-వర్కింగ్‌ స్పేసెస్‌, స్టేట్‌ డేటా సెంటర్‌ వంటి వాటిని అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. ఇప్పటికీ ప్రాజెక్టు అందుబాటులోకి రాలేదు.

వచ్చే ఏడాది మార్చితో ప్రభుత్వం ప్రకటించిన పాలసీ గడువు కూడా పూర్తి కానుంది. పాలసీలో ప్రాధాన్యతలుగా పేర్కొన్న వాటిలో మెజారిటీ లక్ష్యాలను ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది.


వచ్చింది.. నామమాత్రం

గత అయిదేళ్లలో రాష్ట్రం ఐటీ రంగంలో నామమాత్రపు పెట్టుబడులనే ఆకర్షించగలిగింది. ఏపీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఏజెన్సీ (ఏపీఈఐటీఏ), సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌టీపీఐ), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఐటీఏఏపీ) గణాంకాల ప్రకారం గత 5 ఏళ్ల జగన్‌ పాలనలో రాష్ట్రానికి కేవలం 59 ఐటీ సంస్థలే వచ్చాయి. వాటిలోనూ అధికశాతం విశాఖ, తిరుపతికే పరిమితమయ్యాయి.

విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో వివిధ సంస్థలతో రూ.13.12 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటిలో ఐటీ రంగానికి సంబంధించినవి రూ.41,748 కోట్లే. మొత్తం పెట్టుబడుల ఒప్పందాల్లో వాటి వాటా 3.18 శాతం మాత్రమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని