Aadudam Andhra: ఆట అట్టర్‌ ఫ్లాప్‌!

ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం తొలిరోజే అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. లక్షల్లో క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారని అధికారులు చెప్పగా, వేలల్లోనూ మైదానాలకు రాలేదు.

Updated : 27 Dec 2023 10:20 IST

ముఖ్యమంత్రి ప్రారంభ అట్టహాసమే మిగిలింది
‘ఆడుదాం ఆంధ్రా’లో కొన్నిచోట్లే సాగిన ఆట
34 లక్షల ఆటగాళ్లన్నారు.. వేలల్లోనూ లేరు

ఈనాడు-అమరావతి, ఈనాడు యంత్రాంగం: ‘ఆడుదాం ఆంధ్రా’ (Aadudam Andhra) కార్యక్రమం తొలిరోజే అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. లక్షల్లో క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారని అధికారులు చెప్పగా, వేలల్లోనూ మైదానాలకు రాలేదు. ఆటగాళ్లు లేక పలుచోట్ల పోటీలే నిర్వహించలేదు. ఇంకొన్నిచోట్ల అప్పటికప్పుడు పేర్లు నమోదు చేసి పోటీలు పెట్టి మమ అనిపించారు. మైదానాలు ఖాళీగా కనిపించకుండా కొన్నిచోట్ల సచివాలయాల ఉద్యోగులే ఆటలాడారు. కోట్ల రూపాయిలు వెచ్చించి కొన్న క్రీడా పరికరాల్లో నాణ్యతలేమి కొట్టిచ్చినట్లు కనిపించింది. ఒక ఆటకే దెబ్బతిన్నాయి. ఈ కార్యక్రమానికి 34.19 లక్షల మంది క్రీడాకారులు, మరో 88.66 లక్షలమంది పేర్లు నమోదు చేసుకున్నట్లు ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసింది. ప్రతి సచివాలయ పరిధిలోనూ విధిగా పోటీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. క్రికెట్‌, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌ పోటీలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినా క్రీడా బృందాలు కనిపించలేదు. ఫోన్లు చేసినా స్పందన లేదు. అప్పటికిగానీ తెలియలేదు ఇవన్నీ ఉత్తుత్తి రిజిస్ట్రేషన్లని. క్రీడాకారుల కొరతతో శ్రీకాకుళం జిల్లాలో 319 సచివాలయాల్లో పోటీలే ప్రారంభం కాలేదు. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలోని అయిదో నంబరు సచివాలయ పరిధిలో మధ్యాహ్నం 12 గంటల వరకు ఆడేందుకు ఎవరూ రాలేదు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడి సచివాలయం-1, 2 పరిధిలో నాలుగు కబడ్డీ టీంలకు ఒక్కటే వచ్చింది. అప్పటికే బాగా ఆలస్యం కావడంతో అప్పటికప్పుడు తాత్కాలికంగా మరో టీం ఏర్పాటు చేసి పోటీలు నిర్వహించామనిపించారు.

  • కర్నూలులోని సిల్వర్‌ జూబ్లీ కళాశాల క్రీడా మైదానంలో ఆడడానికి తగినంత విస్తీర్ణం లేకపోయినా క్రికెట్‌ ఆడించేశారు. మ్యాచ్‌ చూడడం కోసం వచ్చిన వారితో జట్లను ఏర్పాటు చేయడంతో గందరగోళం నెలకొంది. బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు కొందరు వచ్చినప్పటికీ ఆడడానికి ప్రత్యర్థి జట్టు లేకపోవడంతో వెనక్కి వెళ్లిపోయారు. కబడ్డీ ఆడడానికి ఒక్కరూ రాలేదు.
  • నంద్యాల జిల్లా కోవెలకుంట్లలోని అయిదో నంబరు సచివాలయ పరిధిలో మధ్యాహ్నం 12 గంటల వరకు ఆటగాళ్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో సచివాలయ సిబ్బందిపై ఎంపీడీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు గురైన సిబ్బంది అప్పటికప్పుడు గ్రామంలోకి వెళ్లి కొంతమందిని తీసుకొచ్చి కబడ్డీ ఆడించి మమ అనిపించారు.
  • ప్యాపిలి మండలం వెంగళాంపల్లి గ్రామంలో వాలీబాల్‌ ఆడడానికి ఒక్కరూ రాలేదు. ఆడించాల్సిన ప్రదేశంలో రాళ్లు, రప్పలు, ముళ్లకంపలు ఉండడంతో 20 మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నా ఒక్కరూ రాలేదని సచివాలయ సిబ్బంది వాపోయారు. ఇష్టం లేకున్నా వారి పేర్లను నమోదు చేశారని కొందరు గ్రామస్థులు పేర్కొంటున్నారు.
  • నూనెపల్లెలోని మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన క్రికెట్‌ పోటీలకు ఎంపైర్‌గా వాలంటీర్‌ బాబు, లెగ్‌ ఎంపైర్‌గా వాలంటీర్‌ శ్రీనాథ్‌ వ్యవహరించారు.
  • అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మర్రిపాలెంలో పద్నాలుగు మంది కబడ్డీ క్రీడాకారులు పాల్గొంటే పర్యవేక్షణకు 24 మంది వాలంటీర్లు వచ్చారు.
  • శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో క్రీడాపరికరాలు అరకొరగా పంపిణీ జరిగాయి. చిలకపాలెం సచివాలయ పరిధిలో ఎమ్మెల్యే వస్తారని మధ్యాహ్నం 12:30 వరకు క్రీడాకారులు ఎదురుచూశారు. ఆయన రాకపోవడంతో అప్పటికప్పుడు ఎంపీపీ చిరంజీవితో కార్యక్రమం ప్రారంభించారు.
  • క్రికెట్‌ బ్యాట్స్‌ నాణ్యత లేకపోవడంతో చాలాచోట్ల క్రీడాకారులు తాము తెచ్చుకున్న బ్యాట్లతో ఆడుకున్నారు. ఆడేందుకు అనువుగా లేవని తెలిపారు.

కబడ్డీ ఆడిన వైకాపా నేతలు

  • తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడి సచివాలయం-1, 2 పరిధిలో 872 మంది క్రీడాకారులు పాల్గొంటారని, 304 మంది ప్రేక్షకులు పాల్గొంటారని నివేదిక ఇచ్చారు. క్రీడా మైదానాలు స్థానికంగా లభించక, కిలోమీటరున్నర దూరంలోని డిగ్రీ కళాశాలలో కబడ్డీ, వాలీబాల్‌, షటిల్‌ పోటీలకు ఏర్పాట్లు చేశారు. నాలుగు కబడ్డీ టీమ్‌లు పోటీలకు రావాల్సి ఉండగా ఒక్క టీమ్‌ మాత్రమే వచ్చింది. అప్పుటికప్పుడు ఓ డమ్మీ టీమ్‌ను ఏర్పాటు చేసి ఆడించారు. ఈ టీమ్‌లో చినకొండేపూడికి చెందిన వైకాపా నాయకుడు, విద్యా కమిటీ ఛైర్మన్‌ రామకృష్ణ కూడా కబడ్డీ ఆడి మమ అనిపించారు. వాలంటీర్లే ప్రేక్షకులయ్యారు.
  • కాకినాడ జిల్లా పెద్దాపురంలో క్రీడాకారులకు అల్పాహారం, భోజనాల ఏర్పాట్లు లేవు. పిఠాపురంలో ఆటాడేందుకు యువత ఆసక్తి చూపలేదు. పట్టణంలో 250 మంది వాలంటీర్లు ఉంటే 50 మంది కూడా హాజరుకాలేదు. సచివాలయ సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. ఆటలను ప్రారంభించి ప్రజాప్రతినిధులు వెళ్లిపోగా, క్రీడాకారులు లేక అధికారులు ఆడించలేదు.

మహిళా వాలంటీర్లతో వాలీబాల్‌ 

  • డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో ఎండకు తాళలేక ఓ విద్యార్థిని అస్వస్థతకు గురైంది. అల్లవరం మండలం గోడిలంకలో మహిళలెవరూ రాకపోవడంతో మహిళా వాలంటీర్లతోనే వాలీబాల్‌ ఆడించారు. ముమ్మిడివరంలోని ఎంజీఆర్‌ మైదానంలో ఆటలాడుతుండగా పందులు చొరబడ్డాయి. జడ్పీ బాలికోన్నత పాఠశాలలో క్రీడాకారులు లేక మధ్యాహ్నం 3 గంటల వరకు ఆటలు ప్రారంభం కాలేదు.

  • ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం అడవినెక్కలంలో వాలీబాల్‌ ఆడిన క్రీడాకారులే క్రికెట్‌ కూడా ఆడి 11.30 గంటలకు వెళ్లిపోయారు. మెడికల్‌ సిబ్బంది ఒక్కరు తప్ప.. మైదానం మొత్తం ఖాళీ అయిపోయింది.

సీఎం సొంత జిల్లాలో నాసిరకం బ్యాట్లు

  • క్రీడా పరికరాల నాసిరకం వ్యవహారం వైయస్‌ఆర్‌ జిల్లాలోనే బయటపడింది. ఎర్రగుంట్ల నగర పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో మొదటి మ్యాచ్‌లోనే క్రికెట్‌ బ్యాట్‌లు విరిగిపోయాయి. ప్రొద్దుటూరులోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానాన్ని విద్యార్థుల ద్వారా శుభ్రం చేయించి పోటీలను నిర్వహించారు. సిద్దవటంలో 80 ఏళ్ల వృద్ధురాలిని క్రీడాకారిణిగా ఎంపిక చేయడం విశేషం.

అందుబాటులో లేని సేవలు

  • డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం మున్సిపల్‌ ఉద్యోగులు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగలంతా పోటీల నిర్వహణకు వెళ్లడంతో వివిధ సేవలు, అవసరాల కోసం వచ్చిన వారికి ఎవరూ అందుబాటులో లేక ఇబ్బంది పడ్డారు. సచివాలయాలు, కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.
  • పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని బొడ్డవలస గురుకుల పాఠశాల మైదానంలో ఆడేందుకు పలువురు పేర్లు నమోదు చేయించుకున్నా కొత్తవలస నుంచి అమ్మాయిల జట్టు, కరాసువలస నుంచి అబ్బాయిల జట్టే వచ్చాయి. ఈ రెండు జట్లను మండల స్థాయికి పంపించారు. తోణాం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలోనూ అదే పరిస్థితి.

చూడాలని తీసుకొచ్చి ఆడించారు..

ప్రకాశం జిల్లా పీసీపల్లి పంచాయతీలో నిర్వహించిన క్రీడాపోటీలకు స్థానిక మహిళలు రాలేదు. ఈలోపు మురుగమ్మి పంచాయతీలోని అయ్యవారిపల్లికి చెందిన మహిళలు పొదుపు రుణాలు తీసుకునేందుకు పీసీపల్లి బ్యాంకుకు వచ్చారు. వారిని ఆడుదాం-ఆంధ్రా కార్యక్రమం చూడాలంటూ తీసుకొచ్చారు. కాసేపయ్యాక వారితోనే టెన్నికాయిట్‌ ఆడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు