Union Budget 2024: రాజధాని అమరావతి రైల్వే లైన్‌కు ‘వెయ్యి రూపాయలిచ్చిన’ కేంద్రం!

రాజధాని అమరావతిని ఇటు విజయవాడకు, అటు గుంటూరుకు అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన కొత్త రైల్వే లైన్‌కు బడ్జెట్‌లో ఎంత ఇవ్వనున్నారో తెలుసా? అక్షరాలా వెయ్యి రూపాయలు మాత్రమే.

Updated : 02 Feb 2024 06:56 IST

విశాఖపట్నం జోన్‌కు రూ. 9 కోట్లు
రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులకు కలిపి రూ. 9,138 కోట్ల కేటాయింపులు
భారీగా నిధులు సాధించడంలో మరోసారి వైకాపా ఎంపీలు విఫలం

ఈనాడు-అమరావతి: రాజధాని అమరావతిని ఇటు విజయవాడకు, అటు గుంటూరుకు అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన కొత్త రైల్వే లైన్‌కు బడ్జెట్‌లో ఎంత ఇవ్వనున్నారో తెలుసా? అక్షరాలా వెయ్యి రూపాయలు మాత్రమే. రూ.2,679 కోట్ల వ్యయమయ్యే ఈ లైన్‌కు గత అయిదేళ్లలో రూ.2.20 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అది కూడా సర్వేల కోసం వెచ్చించిందే. ఇపుడు రూ.వెయ్యి ఇస్తామని పేర్కొనడం చూస్తే కేంద్రం మన రాష్ట్రానికి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థమవుతోంది. రాష్ట్రంలో గతంలో మంజూరైన వివిధ లైన్లకు కూడా రూ.వెయ్యి నుంచి గరిష్ఠంగా రూ.10 లక్షలు ప్రకటించారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా జోన్‌ కార్యాలయాలు తదితరాలకు కలిపి రూ.170 కోట్లు వ్యయం అవుతుందని గతంలో అంచనా వేయగా, దీనికి ఇప్పుడు ఇస్తామంటున్నది కేవలం రూ.9 కోట్లు. ఇది రాష్ట్రంలో కీలక రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం బడ్జెట్‌లో పేర్కొన్న నిధుల తీరు. కొన్నింటికి మొక్కుబడిగా ఇవ్వగా.. అత్యధిక ప్రాజెక్టులకు మొండిచేయి చూపింది. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ నిధులు సాధించడంలో జగన్‌ ప్రభుత్వం, వైకాపా ఎంపీలు మరోసారి విఫలమయ్యారు. కేంద్ర తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, అందులో రైల్వే శాఖకు సంబంధించిన వివరాలను విడుదల చేశారు. వాటిలో రాష్ట్రానికి చెందిన కీలక ప్రాజెక్టుల పరిస్థితి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. మొత్తంగా రాష్ట్రంలోని దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు, తూర్పుకోస్తా రైల్వేలోని వాల్తేరు డివిజన్‌కు కలిపి రూ.9,138 కోట్లు కేటాయించారు.

అంతమంది ఎంపీలున్నా..

ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఎంత ఒత్తిడి తీసుకొస్తేనే అంత పెద్ద మొత్తంలో నిధుల కేటాయింపు ఉంటుంది. ఈ విషయంలో వైకాపా ప్రభుత్వం మరోసారి విఫలమైంది. లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి 31 మంది వైకాపా ఎంపీలున్నా.. రాష్ట్రానికి పెద్దఎత్తున రైల్వే నిధులను రాబట్టలేకపోయారు. విశాఖలో జోన్‌ కార్యాలయానికి సిద్ధంగా ఉన్నామని రైల్వేశాఖ చెబుతుంటే.. దానికి భూమిని అప్పగించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దీంతో కేంద్రం అత్తెసరు నిధులతో సరిపెట్టింది. మొత్తంగా ఈసారి బడ్జెట్‌లో రాష్ట్రంలోని రెండు, మూడో లైన్లకు మాత్రమే కొంత ఆశాజనకంగా నిధుల కేటాయింపు జరిగింది.

ఇంత నిర్లక్ష్యమా?

రాజధాని ప్రాంతం అమరావతిని రైల్వే లైన్లతో అనుసంధానం చేసేందుకు వీలుగా ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు, అమరావతి-పెదకూరపాడు, సత్తెనపల్లి-నరసరావుపేట మధ్య 106 కి.మీ. కొత్త లైన్‌కు కేవలం రూ.వెయ్యి మాత్రమే కేటాయించారు. దీనికి రూ.2,679 కోట్లు వ్యయమవుతుందని గతంలో అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎంత వాటా వెచ్చిస్తుందో తెలపాలని రైల్వేశాఖ ప్రతిసారి కోరుతూనే ఉంది. కానీ జగన్‌ ప్రభుత్వం ఏటా మౌనం వహిస్తోంది. దీంతో కేంద్రం కూడా పట్టనట్లు వదిలేసింది. వైకాపా ప్రభుత్వ తీరుతో రాష్ట్ర రాజధానికి రైల్వే అనుసంధానం కల్పించే ప్రాజెక్టు ఇప్పుడప్పుడే పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదు.

రూ.9 కోట్లు ఎక్కడ సరిపోతాయి?

విభజన హామీల్లో భాగంగా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్‌, రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి అయిదేళ్లు అవుతోంది. అందుకు సంబంధించి భవనాల నిర్మాణం, వసతుల కల్పన తదితరాలకు కలిపి రూ.170 కోట్లు అవసరమని గతంలో డీపీఆర్‌ సిద్ధం చేశారు. తాజాగా డీపీఆర్‌లో అంచనా విలువ మరింత పెరిగింది. ఈసారి దానికి బడ్జెట్‌ కేటాయించింది మాత్రం కేవలం రూ.9 కోట్లు మాత్రమే.

ఆ లైన్లను పట్టాలెక్కించే ఉద్దేశం ఉందా?

  • రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు ఎప్పుడో మంజూరైన వివిధ లైన్లకు ఈసారి కూడా బడ్జెట్‌లో పేర్కొన్న నిధులు చూస్తే, అసలు వాటిని పట్టాలెక్కించే ఉద్దేశం లేదని స్పష్టమవుతోంది. పలు ప్రాజెక్టులకు మరీ ఘోరంగా రూ.వెయ్యి చొప్పున కేటాయించారు.
  •  కాకినాడ-పిఠాపురం (21.51 కి.మీ.), మాచర్ల-నల్గొండ (92 కి.మీ.), కంభం-ప్రొద్దుటూరు (142 కి.మీ.), గూడూరు-దుగరాజపట్నం (41.55 కి.మీ.) లైన్లకు కేవలం రూ.వెయ్యి చొప్పున ఇవ్వనున్నారు.
  •  కొండపల్లి-కొత్తగూడెం (125 కి.మీ.) రూ.10 లక్షలు, భద్రాచలం-కొవ్వూరు (151 కి.మీ.) రూ.10 లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు.
  • జగ్గయ్యపేట నుంచి తెలంగాణలోని మేల్లచెరువు వరకు 19.1 కి.మీ. కొత్తలైన్‌కు రూపాయి కూడా ఇస్తామని చూపలేదు.

కీలక మార్గాలు పూర్తయ్యేదెప్పుడు?

రాష్ట్రంలో వివిధ కీలకమైన రైల్వే లైన్లకు కేటాయింపులు చూస్తే, అవి కూడా ఇప్పుడపుపడే పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

  • కడప-బెంగళూరు (255 కి.మీ.) లైన్‌కు బడ్జెట్‌లో రూ.10.01 లక్షలు మాత్రమే ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 2008-09లో మంజూరైన ఈ ప్రాజెక్టు విలువ రూ.2,071 కోట్లుకాగా, ఆరేళ్ల కిందటే కడప నుంచి పెండ్లిమర్రి వరకు 21 కి.మీ. పూర్తయింది. జగన్‌ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయి. గత బడ్జెట్‌లో కూడా దీనికి రూ.10.01 లక్షలు ఇవ్వగా, ఈసారి కూడా అంతే మొత్తం విదల్చనున్నారు.
  • నడికుడి-శ్రీకాళహస్తి (309 కి.మీ.)మార్గం అంచనా విలువ రూ.2,643 కోట్లు కాగా రూ.450 కోట్లు కేటాయించారు.
  • కోటిపల్లి-నర్సాపురం మధ్య 57.21 కి.మీ. కొత్త లైన్‌ అంచనా వ్యయం రూ.2,120 కోట్లుకాగా, దీనికి ఈసారి ఇస్తామంటున్నది రూ.300 కోట్లు.

రెండు, మూడో లైన్లకు అధిక నిధులు

రాష్ట్రంలో రెండు, మూడు లైన్లకు ఇవ్వనున్న నిధులు ఆశాజనకంగా ఉన్నాయి. ఇందులో కాజీపేట-విజయవాడ (219 కి.మీ.) మూడో లైన్‌కు రూ.310 కోట్లు, విజయవాడ-గూడూరు (287 కి.మీ.) మూడో లైన్‌కు రూ.500 కోట్లు, గుంటూరు-గుంతకల్లు (401 కి.మీ.) రెండో లైన్‌కు రూ.283.50 కోట్లు, గుంటూరు-బీబీనగర్‌ (248కి.మీ.) రెండో లైన్‌కు రూ.200 కోట్లు ఉన్నాయి.

సర్వే దశలో ఉన్న దువ్వాడ-విజయవాడ మధ్య 335 కి.మీ. మూడో లైన్‌కు కేవలం రూ.వెయ్యి ఇవ్వనున్నారు.


కర్నూలు వ్యాగన్‌ మరమ్మతుల కేంద్రానికి రూ.115 కోట్లు

ర్నూలులోని వ్యాగన్‌ మరమ్మతుల కేంద్రం (మిడిలైఫ్‌ వ్యాగన్‌ రిహ్యాబిలిటేషన్‌ వర్క్‌షాపు)నకు రూ.115 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. పదేళ్ల కిందట ఈ ప్రాజెక్టు మంజూరైనా దీని పనులు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని