Tirupati: జిల్లా కలెక్టర్‌ చేయాల్సిన పనేనా?

జిల్లా కలెక్టర్‌వంటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న అధికారులు నిష్పాక్షికంగా, నిబద్ధతతో ఉండటంతోపాటు.. ఉదాత్త శైలిని తమ చేతల్లోను, నడవడికలోను చూపించాలి.

Updated : 02 Feb 2024 09:35 IST

ఎమ్మెల్యే భూమన ఇంటికి వెళ్లి కలిసిన తిరుపతి కలెక్టర్‌ లక్ష్మీశ
శాలువా కప్పి పుష్పగుచ్ఛంతో సత్కారం
అలాంటి అధికారి ఆధ్వర్యంలో నిష్పాక్షిక ఎన్నికలు జరగవని విపక్షాల అనుమానం

ఈనాడు, తిరుపతి: జిల్లా కలెక్టర్‌వంటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న అధికారులు నిష్పాక్షికంగా, నిబద్ధతతో ఉండటంతోపాటు.. ఉదాత్త శైలిని తమ చేతల్లోను, నడవడికలోను చూపించాలి. విలువలు, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ తమ కిందిస్థాయి అధికారులకు మార్గనిర్దేశం చేయాలి. కానీ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీశ తిరుపతి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే, తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను కలవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. తిరుపతి జిల్లా కలెక్టర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టిన తర్వాత లక్ష్మీశ.. భూమన ఇంటికి వెళ్లడంతోపాటు ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్ఛంతో సత్కరించారు. సాధారణంగా జిల్లాకు కొత్త కలెక్టర్‌ వస్తే ఎమ్మెల్యేలే వీలు చూసుకుని వెళ్లి కలుస్తుంటారు.

ఎమ్మెల్యేల ఇంటికి జిల్లా కలెక్టర్లు వెళ్లి కలవడం సంప్రదాయాలకు విరుద్ధం. అధికార పార్టీ నాయకులకు లక్ష్మీశ ఎంత సన్నిహితులో తాజా ఉదంతం చెబుతోందని.. అలాంటి అధికారిని జిల్లా కలెక్టర్‌గా నియమిస్తే ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహిస్తారని ఎలా ఆశించగలమని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి కలవడం తప్పుడు సంకేతాలను పంపించడం లేదా? అని లక్ష్మీశను ‘ఈనాడు’ ప్రశ్నించగా.. భూమన తితిదే ఛైర్మన్‌ హోదాలో ఉండటం వల్లే వెళ్లి కలిశానని బదులిచ్చారు. భూమన తితిదే ఛైర్మన్‌ అయినంత మాత్రాన కలెక్టర్‌ వెళ్లి కలవాలన్న నిబంధనగానీ, ప్రొటోకాల్‌గానీ లేదు. నెలలో ఎన్నికల షెడ్యూల్‌ రానున్న సమయంలో జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించే కలెక్టర్‌.. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి కలవడం సమర్థనీయం కాదని, అది నైతిక విలువలకు విరుద్ధమన్న విమర్శలున్నాయి. 

జీవీఎంసీ కమిషనర్‌గా వివాదాస్పద నిర్ణయం 

లక్ష్మీశ మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్‌గా ఉన్నప్పుడు.. వైకాపా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి చెందిన ఒక ప్రాజెక్టుకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఒక్క రోజులోనే అనుమతులిచ్చేయడం వివాదాస్పదమైంది. అధికార పార్టీ పెద్దలంటే అంతగా విధేయత ప్రదర్శించే అధికారిని ఎన్నికలకు కొన్ని రోజులు ముందు.. అది కూడా తీవ్రస్థాయి ఎన్నికల అక్రమాలకు కేంద్రబిందువుగా మారిన తిరుపతి జిల్లా కలెక్టర్‌గా నియమించడంపై ఇప్పటికే విమర్శలున్నాయి. ఇప్పుడు ఆయన భూమన ఇంటికి వెళ్లడం మరో వివాదానికి కారణమైంది. వచ్చే ఎన్నికల్లో తిరుపతి శాసనసభ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా భూమన కరుణాకర్‌రెడ్డి కుమారుడు అభినయ్‌రెడ్డి పోటీ చేయనున్నారు.

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల సందర్భంగా జరిగిన అక్రమాలు, నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను తయారుచేసిన వ్యవహారంలో భూమన, ఆయన కుమారుడి పాత్ర ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ఆ వ్యవహారంలో అప్పట్లో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌గా, ఈఆర్వోగా వ్యవహరించిన ఐఏఎస్‌ అధికారి గిరీషాను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సస్పెండ్‌ చేసింది. ఒక తహసీల్దారు, మరో అధికారీ సస్పెండయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగాను తిరుపతిలో అక్రమాలు చోటుచేసుకోవడంతో రెండు కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాల్సి వచ్చింది. తాజాగా ఓటర్ల జాబితాల్లోనూ అక్రమాలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. అలాంటి అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతంలో లక్ష్మీశ వంటి అధికారులను నియమించడమేంటని విపక్షాలు నిలదీస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు