Raghuram Reddy: పోస్టు ఏదైనా.. ప్రతిపక్షాన్ని వేధించటమే పని

కొల్లి రఘురామ్‌రెడ్డి... ఐజీ ర్యాంకు కలిగిన ఐపీఎస్‌ అధికారి... ఆయన ఏ పోస్టులో కొనసాగినా, ఏ బాధ్యతలు నిర్వహించినా.. ప్రతిపక్ష తెదేపాలోని ముఖ్య నాయకుల్ని వేధించటం, వారిని ఇబ్బంది పెట్టడమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తుంటారు.

Updated : 11 Feb 2024 13:31 IST

తెదేపా ముఖ్య నాయకులే లక్ష్యంగా దాడులు, కేసులు, అరెస్టులు
ఐపీఎస్‌ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి తీరు ఇదీ
తాజాగా మాజీ మంత్రి నారాయణ వైద్యకళాశాల, నివాసంలో సోదాలు  

ఈనాడు-అమరావతి: కొల్లి రఘురామ్‌రెడ్డి... ఐజీ ర్యాంకు కలిగిన ఐపీఎస్‌ అధికారి... ఆయన ఏ పోస్టులో కొనసాగినా, ఏ బాధ్యతలు నిర్వహించినా.. ప్రతిపక్ష తెదేపాలోని ముఖ్య నాయకుల్ని వేధించటం, వారిని ఇబ్బంది పెట్టడమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తుంటారు. గత తెదేపా ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై విచారణ కోసం జగన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ అధిపతిగా, నిఘా విభాగం ఐజీగా ఆయన తొలి నుంచీ ఈ కార్యకలాపాల్లోనే తలమునకలై ఉన్నారు. దాదాపు ఏడాదిగా ఔషధ నియంత్రణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న రఘురామ్‌రెడ్డి... ఆ పోస్టును సైతం ప్రతిపక్ష నాయకుల్ని వేధించటానికే వినియోగిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత పొంగూరు నారాయణ నివాసం, వైద్య కళాశాలకు ఔషధ నియంత్రణ విభాగాధికారులను పంపి తనిఖీలు చేయించారు. అధికారులు అక్కడ తలుపులు, బీరువాలు పగలగొట్టించి మరీ సోదాలు జరిపారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు సహా 70 మందికి పైగా పోలీసులతో దండెత్తి నాలుగున్నర గంటలపాటు అలజడి సృష్టించారు.

ఇంత చేసినా సరే మందుల క్రయవిక్రయాలకు సంబంధించిన ఎలాంటి పత్రాలూ వారికి లభించలేదు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే సోదాలు జరపాలి.. బాధ్యులు ఎంత పెద్దవారైనా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ  కానీ మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ... ప్రతిపక్ష తెదేపాలో క్రియాశీలక నేతే లక్ష్యంగా దాడులు చేయటాన్ని కక్ష సాధింపు చర్యలు అనకపోతే ఇంకేమనాలి? ఏదో ఉగ్రవాద శిబిరంపైకి వెళ్లినట్లు దండెత్తటం.. వేధించటం కాక మరేమవుతుంది? ప్రపంచాన్ని గడగడలాడించే ఐసిస్‌, బోకోహరామ్‌ వంటి ఉగ్రవాద సంస్థలు విరివిగా వినియోగించే ‘ఐసిస్‌ డ్రగ్‌’గా పేరొందిన ‘ట్రెమడాల్‌’ మాదకద్రవ్యాన్ని పల్నాడు జిల్లా నరసరావుపేటలోని సేఫ్‌ ఫార్ములేషన్స్‌ ఔషధ కంపెనీలో మాత్రల రూపంలో తయారుచేసి, విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఉదంతాన్ని ముంబై కస్టమ్స్‌ విభాగం బయటపెట్టినా సరే ఏపీ ఔషధ నియంత్రణ విభాగం ఈ స్థాయిలో అక్కడికి వెళ్లి దాడులు చేయలేదు. పోలీసుల్నీ తీసుకెళ్లలేదు. అలాంటిది నారాయణ వైద్య కళాశాలలోని మందుల దుకాణంలో అనధికారికంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారని ఫిర్యాదు అందిందంటూ భారీగా పోలీసుల్ని మోహరించి దాడులు చేశారు. ఇది అధికార దుర్వినియోగం కాదా? ఔషధ నియంత్రణ విభాగం ఉన్నది ప్రతిపక్షాలపై కక్ష సాధించటానికా?


భయభ్రాంతులకు గురిచేయడానికే..

కొల్లి రఘురామ్‌రెడ్డి.. గతేడాది మే 4 నుంచి ఔషధ నియంత్రణ విభాగం డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన నేతృత్వంలో ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక్కటైనా అంతర్‌రాష్ట్ర నకిలీ మందుల ముఠాను పట్టుకోగలిగారా? రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న మాదకద్రవ్యాల తయారీ ముఠాల్ని, సరఫరాదారుల్ని, వినియోగాన్ని అడ్డుకోగలిగారా? కనీసం వారిపై దాడులైనా చేశారా? ఈ ప్రశ్నలన్నింటికీ ‘లేదు’ అనే సమాధానమే వస్తుంది. అలాంటి ప్రధాన విధులు, బాధ్యతల్ని విస్మరించి, ఎన్నికల ముంగిట నారాయణే లక్ష్యంగా దాడులు చేయటమేంటి? సోదాల పేరిట భయభ్రాంతులకు గురిచేయటం, వారిలో ఆత్మస్థైర్యం సన్నగిల్లేలా చేయటం, ఎన్నికలపై దృష్టి పెట్టకుండా ఇబ్బందులు కల్పించటం, తద్వారా అధికార పార్టీకి మేలు చేకూర్చటం ఈ దాడుల వెనక ప్రధాన లక్ష్యమనేది స్పష్టమవుతోంది. ప్రభుత్వ పెద్దలు, అధికార వైకాపా ముఖ్యుల ఆదేశాల మేరకు రఘురామ్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని ఈ వేధింపులకు తెగబడుతున్నారని తెదేపా ఆరోపిస్తోంది. ఇలాంటి అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తోంది.


తొలి నుంచీ వైకాపాకు అనుకూలంగానే..

తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, మాజీ మంత్రి నారాయణ సహా పలువురిపైన కేసులు బనాయించి, వేధించటంలో సిట్‌ (ప్రత్యేక ఆర్థిక నేరాల విభాగం-2, సీఐడీ) అధిపతిగా రఘురామ్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. 2020 ఫిబ్రవరిలో సిట్‌ ఏర్పాటైనప్పటి నుంచి తెదేపా ముఖ్య నేతలే లక్ష్యంగా పనిచేశారు. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, నైపుణ్యాభివృద్ధి, ఫైబర్‌గ్రిడ్‌, ఎసైన్డ్‌ భూములు సహా వివిధ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్యుల తరఫున రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఆయనే అమలు చేశారన్న తీవ్ర విమర్శలున్నాయి. నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబును అరెస్టు చేశారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో లోకేశ్‌ను విచారణ పేరిట వేధించారు. చివరికి ఔషధ నియంత్రణ విభాగాన్ని కూడా కక్ష సాధింపు చర్యలకు వాడేశారు.


ఏకకాలంలో మూడు పోస్టులు

2006 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారైన రఘురామ్‌రెడ్డి 2013-14 సంవత్సరాల్లో కర్నూలు ఎస్పీగా పనిచేశారు. అప్పట్లో అక్కడి తెదేపా నాయకులను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. రఘురామ్‌రెడ్డి వైకాపాకు మద్దతుదారుగా వ్యవహరిస్తున్నారని, ఆయన జగన్‌కు మద్దతివ్వాలనుకుంటే ఎస్పీ పోస్టు నుంచి వైదొలగి వైకాపా అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని అప్పట్లో చంద్రబాబు ఆయనపై విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికల్లో తన ఓటమికి రఘురామ్‌రెడ్డే కారణమని అప్పట్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన టీజీ వెంకటేశ్‌ ఆరోపించారు. అయినప్పటికీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వచ్చాక ఆయనకు పశ్చిమగోదావరి ఎస్పీగా కీలక పోస్టింగ్‌ ఇచ్చారు. అక్కడా ఆయన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో ఆరు నెలల్లోనే గ్రేహౌండ్స్‌ గ్రూపు కమాండర్‌గా బదిలీ చేశారు. 2015 నుంచి 2017 వరకూ ఆ పోస్టులో కొనసాగిన రఘురామ్‌రెడ్డి తర్వాత డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లి హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టులో 2019 సెప్టెంబరు వరకూ కొనసాగారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి వైకాపా అధికారం చేపట్టిన మూడున్నర నెలల్లోనే (2019 సెప్టెంబరులో) ఆయన కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్‌ ముగించుకుని సొంత క్యాడరైన ఏపీకి తిరిగొచ్చారు. వెంటనే జగన్‌  ప్రభుత్వం ఆయనకు నిఘా విభాగం ఎస్పీగా బాధ్యతలు అప్పగించింది. అయిదు నెలలు తిరగకముందే 2020 ఫిబ్రవరిలో.. గత తెదేపా ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేసింది. ప్రతిపక్షాలను, రాజకీయంగా వైకాపాకు గిట్టని వారిని ఇబ్బందులు పెట్టేందుకు తెర వెనుక వ్యూహరచనలో ఈయనే కీలకంగా వ్యవహరిస్తుంటారని ప్రతిపక్షాలు తొలి నుంచి ఆరోపిస్తున్నాయి. ఐజీగా ఇటీవల పదోన్నతి పొందిన రఘురామ్‌రెడ్డి.. ప్రస్తుతం సిట్‌ అధిపతిగా, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా, ఔషధ నియంత్రణ విభాగం ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ జనరల్‌గా మూడు బాధ్యతలు ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. అయితే ఆయన ఈ పోస్టులన్నింటినీ ప్రతిపక్షాలపై కక్ష సాధింపునకే వినియోగిస్తుండటం తీవ్ర విమర్శల పాలవుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని