శ్రీశైలం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పు

శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్లంజ్‌పూల్‌ ముప్పు నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందన్నది ప్రశ్నార్థకమైంది. జలాశయం వద్ద సుమారు 130 అడుగుల లోతు గొయ్యి (ప్లంజ్‌పూల్‌) ఏర్పడింది.

Updated : 12 Feb 2024 07:02 IST

ప్లంజ్‌పూల్‌పై ప్రారంభంకాని అధ్యయనాలు
రూ.137 కోట్ల పనులకు నిధుల కొరత

ఈనాడు, కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్లంజ్‌పూల్‌ ముప్పు నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందన్నది ప్రశ్నార్థకమైంది. జలాశయం వద్ద సుమారు 130 అడుగుల లోతు గొయ్యి (ప్లంజ్‌పూల్‌) ఏర్పడింది. దీన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పూడ్చకపోతే పెనుముప్పు తలెత్తే ప్రమాదముందని నిపుణులు కొన్నేళ్లుగా హెచ్చరిస్తున్నారు. సమస్య తీవ్రతపై ప్రస్తుత ప్రభుత్వం ఐదేళ్లుగా స్పందించ లేదు. సంక్లిష్టమైన ఈ సమస్యపై అధ్యయనం చేసేందుకే సుమారు రూ.15 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. దేశంలోని పలు పరిశోధన సంస్థలకు చెందిన నిపుణులతో అధ్యయనం చేయించాలి. అన్ని బృందాల నిపుణులు ఇచ్చిన నివేదికల్లో ఉత్తమమైనది ఎంపిక చేసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వం కనీసం ఒక్క నిపుణుల బృందంతోనూ అధ్యయనాన్ని ప్రారంభించలేదు.

ప్రపంచ బ్యాంకు నిధులే దిక్కు

ప్రాజెక్టు మరమ్మతులకు ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ పనులు పూర్తి చేసేందుకు రూ.137 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేసి ఆరు నెలల కిందట ప్రతిపాదనలు పంపారు. దీని ఆధారంగా ప్రపంచబ్యాంకు తరఫున ‘డ్యాంసేఫ్టీ రివ్యూ ప్యానెల్‌’ ప్రతినిధులు సుమారు రెండు నెలల కిందట ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు అధికారులకు కొన్ని సూచనలు చేసి తదనుగుణంగా ప్రతిపాదనలను మార్చి పంపాలని సూచించారు. ఈ ప్రతిపాదనలు పంపాక నిధులు విడుదలయ్యే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్లంజ్‌పూల్‌ను పూడ్చేందుకు చేయాల్సిన అధ్యయనాలనూ ప్రతిపాదనల్లోనే పొందుపరిచారు. దీంతో ఆయా పనులకు నిధులు మంజూరైతేగానీ ప్లంజ్‌పూల్‌ పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం ప్రారంభించే అవకాశాలు లేని దుస్థితి తలెత్తింది.

డ్యాంల భద్రత చట్టంతోనైనా కదలిక వచ్చేనా?

డ్యాంల భద్రత చట్టం-2021ని కేంద్రం అందుబాటులోకి తెచ్చాక జలశక్తి మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు ఆ చట్టం కింద దేశవ్యాప్తంగా పలు డ్యాంల స్థితిగతులను అధ్యయనం చేయిస్తున్నారు. ఇందులో భాగంగా నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ ప్రతినిధులు ప్రాజెక్టును ఇటీవల పరిశీలించారు. ప్లంజ్‌పూల్‌ ముప్పు తీవ్రమైనది కావడంతో ఈ పనులను అత్యవసరంగా ప్రారంభించాలని స్పష్టమైన సూచనలిస్తారని తెలుస్తోంది.

చేయించాల్సిన పనులెన్నో..

డ్యాం ప్లంజ్‌పూల్‌ పూడ్చివేత పనుల అధ్యయనంతో సహా మొత్తం రూ.137 కోట్ల విలువ మరమ్మతులు సత్వరం చేయించాల్సి ఉంది. రిటైనింగ్‌ గోడలు, డౌన్‌స్ట్రీమ్‌ యాప్రాన్‌, సిలిండర్లు, యాప్రాన్‌ దగ్గరకు వెళ్లే అప్రోచ్‌ రోడ్డు తదితర పనులు చేయించాలి. ప్రాజెక్టు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు కమిటీ, కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ వై.కె.మూర్తి ఆధ్వర్యంలోని మరో కమిటీ, కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌ ఎ.బి.పాండ్యా నేతృత్వంలోని కేంద్ర కమిటీ ఇప్పటికే అధ్యయనాలు చేసి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాయి. ఆయా సిఫార్సులు అమలుకు నోచుకోకపోగా.. అత్యవసరంగా చేయాల్సిన పనులపైనా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని