నిబంధనలకు ‘సున్నం’ కొట్టి.. జగన్‌కు దోచిపెట్టి!

పాలించే వారు మనవారైతే గనులు, భూగర్భ వనరులను ‘నిక్షేప’ంగా దోచేయొచ్చని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జమానాలో జగన్‌ బ్యాచ్‌ నిరూపించింది.

Updated : 12 Feb 2024 07:05 IST

ఈశ్వర్‌, దాల్మియా సిమెంట్స్‌ పేరిట కుట్ర
హవాలా రూపంలో జగన్‌ జేబుల్లోకి రూ.55 కోట్లు
407 ఎకరాల్లో సున్నపురాయి మైనింగ్‌కు అక్రమ అనుమతి
జగన్‌ కంపెనీల్లోకి రూ.95 కోట్లు మళ్లింపు
2013 ఏప్రిల్‌లోనే సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు
విచారణ పదేళ్లలో 249 సార్లు వాయిదా
రుజువైతే నిందితులకు జీవితఖైదుకు అవకాశం
ఈటీవీ, హైదరాబాద్‌

అసలు కంపెనీయే లేదు... అయినా గనులు కావాలంటూ దరఖాస్తు చేశారు! తిరస్కరిస్తే కొద్దికాలం ఆగారు... తమ నేత వచ్చాక మేతకు శ్రీకారం చుట్టారు! లేని కంపెనీ పేరిటే దర్జాగా లీజులు పొందారు... పెట్టని పరిశ్రమకు శంకుస్థాపన చేశారు... ముడుపులిచ్చిన ఇంకో కంపెనీకి అన్నింటినీ అంటగట్టారు... ఈ జగన్నాటకంలో జగమంతా తెలిసిన ఏ1 భారీగా లబ్ధి పొందారు!! ఈ అవినీతి దందాపై సీబీఐ కేసు వేస్తే... పదేళ్లుగా వాయిదాలతో నడిపిస్తున్నారు...!

పాలించే వారు మనవారైతే గనులు, భూగర్భ వనరులను ‘నిక్షేప’ంగా దోచేయొచ్చని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జమానాలో జగన్‌ బ్యాచ్‌ నిరూపించింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డగోలు దోపిడీకి తెగబడింది. ఉన్నతాధికారులూ వారికి అంటకాగారు. తన తండ్రి అధికారం మాటున జగన్‌ చేసిన కుంభకోణాలపై సీబీఐ పెట్టిన కేసుల్లో దాల్మియా సిమెంట్స్‌ ఒకటి. ఈ సంస్థకు 407.05 హెక్టార్ల సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా కట్టబెట్టినందుకు జగన్‌ కంపెనీల్లోకి రూ.95 కోట్లు చేరాయని, హవాలా రూపంలోనూ రూ.55 కోట్లు ఆయనకు అందాయని సీబీఐ వెల్లడించింది. 13 మందిని నిందితులుగా తేలుస్తూ దాఖలైన ఈ కేసు... ఇప్పటికి 249సార్లు వాయిదా పడింది.

పక్కన పెట్టిన దరఖాస్తుకు ప్రాణం పోశారు... 

కడప జిల్లా మైలవరం మండలంలో 407 హెక్టార్లలో సున్నపురాయి నిక్షేపాల ప్రాస్పెక్టింగ్‌ లైసెన్స్‌ కోసం పులివెందులకు చెందిన ఏవీ రాజ్యలక్ష్మి మేనేజింగ్‌ పార్ట్‌నర్‌గా ఉన్న జయ మినరల్స్‌ సంస్థ 1997లో గనుల శాఖకు దరఖాస్తు చేసింది. సరైన వివరాలు లేకపోవడం, దరఖాస్తులో పేర్కొన్న చిరునామాలో ఆ కంపెనీయే లేకపోవడంతో అప్పటి ప్రభుత్వం దాన్ని పక్కనపెట్టింది. వైఎస్‌ 2004లో సీఎం అయ్యాక అదే దరఖాస్తు మళ్లీ తెరపైకి వచ్చింది.


తప్పుడు నివేదికతో లీజు బదిలీ

నిబంధనల ప్రకారం... ప్రాస్పెక్టింగ్‌ లైసెన్స్‌ను, మైనింగ్‌ లీజులను లాభాల కోసం ఇతరులకు విక్రయించరాదు. అయితే, ఇక్కడ ఎలాంటి ఆర్థిక లబ్ధి లేదంటూ వి.డి.రాజగోపాల్‌ తప్పుడు నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. దాంతో మైనింగ్‌ లీజులను ‘దాల్మియా’ కు 2008 డిసెంబరు 18న బదిలీ చేశారు. అయితే ఈశ్వర్‌ సిమెంట్స్‌ను టేకోవర్‌ చేసేందుకు ‘దాల్మియా’ రూ.3.75 కోట్లు చెల్లించింది. ఇందులో ‘ఈశ్వర్‌’కు రూ.2.14 కోట్ల మేరకు అక్రమంగా లబ్ధి జరిగినట్లు సీబీఐ నిర్ధారించింది.


ఫైళ్లు కదిలిన కొద్దీ జగన్‌కు లబ్ధి

రఘురాం సిమెంట్స్‌ లిమిటెడ్‌లో జగన్‌కు చెందిన సిలికాన్‌ బిల్డర్స్‌, సండూర్‌ పవర్‌లు 2006 అక్టోబరులో వాటాలు పొందాయి. 2006 డిసెంబరు 1న ‘రఘురాం’లో జగన్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ కంపెనీ పేరును 2010 సెప్టెంబరు 1న భారతీ సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రై.లి.గా మార్చారు. ఇందులో వైఎస్‌ భారతీరెడ్డి 2010 డిసెంబరు 26న బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌లో చేరారు. మరోవైపు లైసెన్స్‌, లీజుల ఫైళ్లు కదులుతున్న కొద్దీ... పునీత్‌ దాల్మియా నుంచి జగన్‌కు లబ్ధి చేకూరిందని సీబీఐ వివరించింది. ‘రఘురాం’లో పెట్టుబడుల ముసుగులో దాల్మియా సిమెంట్స్‌ నుంచి జగన్‌... 2007 మార్చి 28 నుంచి 2009 ఆగస్టు 5 వరకు ఆరు విడతల్లో రూ.95 కోట్లను పొందినట్లు వెల్లడించింది.


గుట్టువిప్పిన పెన్‌డ్రైవ్‌

రఘురాం సిమెంట్స్‌ నుంచి కొన్న షేర్లను  ఫ్రాన్స్‌కు చెందిన పర్‌ ఫిసిమ్‌ సంస్థకు 2010 ఏప్రిల్‌లో ‘దాల్మియా’ అమ్మేసింది. పర్‌ ఫిసిమ్‌తో విజయసాయిరెడ్డి సంప్రదింపులు జరిపారని, ఈ లావాదేవీలో ‘దాల్మియా’కు రూ.146.58 కోట్లు వచ్చాయని, అందులో పన్నులు పోగా మిగిలిన రూ.139 కోట్లు హవాలా మార్గంలో మళ్లీ జగన్‌కే చేరతాయనే వివరాలు ఉన్నట్లు సీబీఐ వివరించింది. ఆదాయపు పన్ను శాఖ సోదాల్లో దాల్మియా సంస్థ మేనేజర్‌ వద్ద లభించిన పెన్‌డ్రైవ్‌... హవాలా లావాదేవీల గుట్టురట్టు చేసింది. అందులోని వివరాల ప్రకారం... ‘జేఆర్‌ అకౌంట్‌’ అంటే జగన్మోహన్‌రెడ్డికి రూ.55 కోట్లు హవాలా మార్గంలో చేరాయని, మరో రూ.84 కోట్ల బ్యాలెన్స్‌ ఉందని తేలింది. అదే సమయంలో జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రాథమిక విచారణకు తెలంగాణ హైకోర్టు ఆదేశించడంతో 2011 జూన్‌ నుంచి లావాదేవీలు నిలిచిపోయాయని సీబీఐ వెల్లడించింది.


 కుట్రలోకి సజ్జల అండ్‌ కో...

సజ్జల దివాకర్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భగీరథి డైరెక్టర్లుగా ఉన్న ఈశ్వర్‌ సిమెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రంగంలోకి దిగింది. జయ మినరల్స్‌ను తాము టేకోవర్‌ చేశామని, ప్రాస్పెక్టింగ్‌ లైసెన్సును జయ మినరల్స్‌కు బదులుగా ఈశ్వర్‌ సిమెంట్స్‌ పేరిట ఇవ్వాలని సజ్జల దివాకర్‌రెడ్డి 2004 అక్టోబరులో గనుల శాఖను కోరారు. మరోవైపు ఈశ్వర్‌ సిమెంట్స్‌ పేరిట మూడు నెలల్లో ప్రాస్పెక్టింగ్‌ లైసెన్స్‌, మైనింగ్‌ లీజులు సంపాదించి...వాటిని ‘దాల్మియా’కు బదిలీ చేయాలని... 2006 ఏప్రిల్‌ 12న సజ్జల దివాకర్‌రెడ్డి, దాల్మియా సిమెంట్స్‌ ఎండీ పునీత్‌ దాల్మియాలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కుట్రలో భాగంగా పునీత్‌ తన ఉద్యోగి టుగ్నైట్‌ను 2006 ఆగస్టు 18న ఈశ్వర్‌ సిమెంట్స్‌లోకి డైరెక్టర్‌గా దింపారు.


డైరెక్టర్‌ నుంచి మంత్రి వరకు అధికార దుర్వినియోగం

గతంలోనే దరఖాస్తును తిరస్కరించారని తెలిసీ.. గనుల శాఖ అప్పటి డైరెక్టర్‌ వి.డి.రాజగోపాల్‌ మూడు నెలల వ్యవధిలో ఈశ్వర్‌ సిమెంట్స్‌కు బదిలీ చేయాలన్న షరతుతో జయ మినరల్స్‌ పేరిట ప్రాస్పెక్టింగ్‌ లైసెన్సును మంజూరు చేయాలని సిఫార్సు చేశారు. పరిశ్రమల శాఖ నాటి కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఆ ఫైల్‌ను గనుల మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పంపించగా ఆమె అనుమతించారు. దీంతో శ్రీలక్ష్మి 2006 జులై 14న జయ మినరల్స్‌కు 407.05 హెక్టార్ల సున్నపురాయి నిక్షేపాలపై ప్రాస్పెక్టింగ్‌ లైసెన్స్‌ మంజూరు చేశారని సీబీఐ అభియోగం.


నిందితులకు యావజ్జీవ జైలుశిక్ష పడే అవకాశం

సీబీఐ నమోదు చేసిన ఐపీసీ 120(బి) రెడ్‌విత్‌ 420, 409, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 9, 12, 13(2) రెడ్‌విత్‌ 13(1)(సి)(డి) ప్రకారం... నిందితులకు యావజ్జీవ జైలుశిక్ష పడే అవకాశముంది. రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలం జైలుశిక్ష పడితే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వారిపై అనర్హత వేటు పడుతుంది. శిక్ష అనుభవించిన తర్వాత ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయలేరు.


చెల్లింపులను ‘జె’తో కన్ఫర్మ్‌ చేయించండి

‘2010 డిసెంబరు 31 నాటికి 3500 టన్నులు అందింది. మరో 500 టన్నుల స్టాక్‌ 2011 జనవరి 3 నాటికి పంపిస్తామని మీరు హామీ ఇచ్చారు’ అని విజయసాయిరెడ్డి పంపించిన ఈ-మెయిల్‌ ప్రతిని పెన్‌డ్రైవ్‌లో సీబీఐ గుర్తించింది. దాని ప్రకారం... 2010 డిసెంబరు 31నాటికి రూ.35 కోట్లు, 2011 జనవరి 3 వరకు మరో రూ.5 కోట్ల చెల్లింపులు జరిగాయని సీబీఐ తెలిపింది. ‘‘విజయసాయి గారూ.. నిన్నటివరకు రూ.11.25 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయి ‘జె’తో కన్ఫర్మ్‌ చేయించండి’’ అని పునీత్‌ దాల్మియా చేసిన ఎస్‌ఎంఎస్‌ కూడా పెన్‌డ్రైవ్‌లో లభించింది. ‘హైదరాబాద్‌ పార్టీకి 2011వ ఆర్థిక సంవత్సరంలో నెలకు రూ.1.25 కోట్ల చొప్పున రూ.15 కోట్ల చెల్లింపు’ అనే మరో ఆధారాన్ని కూడా సీబీఐ గుర్తించింది.


సీబీఐ కేసులో విచారణ 249 సార్లు వాయిదా

హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో 2013 ఏప్రిల్‌ 8న అభియోగపత్రం దాఖలైంది. ఇందులో ఏ1గా జగన్‌ను, ఏ2గా వి.విజయసాయిరెడ్డిని, ఏ3గా పునీత్‌ దాల్మియాను, ఏ4 సబితా ఇంద్రారెడ్డిని, ఏ5గా వై.శ్రీలక్ష్మితోపాటు మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చింది. ఈ కేసు విచారణ సీబీఐ కోర్టులో ఇప్పటివరకు 249సార్లు వాయిదా పడింది. విచారణ సాగుతుండగానే ఏ7 సజ్జల దివాకర్‌రెడ్డి మరణించారు. పునీత్‌ దాల్మియా క్వాష్‌ పిటిషన్‌ వేయడంతో హైకోర్టు 2016లో స్టే విధించగా విచారణ చాలాకాలం నిలిచిపోయింది. హైకోర్టు 2021లో స్టే ఎత్తివేయడంతో విచారణ మళ్లీ కొనసాగింది. నిందితుల డిశ్ఛార్జి పిటిషన్లపై వాదనలు ముగిశాయి. అభియోగాల నమోదు జరగాల్సి ఉంది. ఈ కేసులో ఈడీ ఇంకా ఛార్జిషీటు వేయలేదు. గతంలో పలుమార్లు ఛార్జిషీట్‌ సమర్పించినా సాంకేతిక కారణాలతో న్యాయస్థానం వెనక్కి పంపింది.


దొడ్డిదారిన దాల్మియా ప్రవేశం...

ప్రభుత్వం నుంచి జీవో రాగానే ప్రాస్పెక్టింగ్‌ లైసెన్సును ఈశ్వర్‌ సిమెంట్స్‌ పేరిట బదిలీ చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి 2006 ఆగస్టు 23న గనుల శాఖకు దరఖాస్తు చేశారు. అంతకుముందే.. సిమెంట్‌ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని సజ్జల దివాకర్‌రెడ్డి గనుల శాఖకు తప్పుడు అఫిడవిట్‌ సమర్పించినట్లు సీబీఐ వివరించింది. ఆ తర్వాత.. ఈశ్వర్‌ సిమెంట్స్‌లో డైరెక్టర్‌గా ఉన్న దాల్మియా ఉద్యోగి టుగ్నైట్‌.. సున్నపురాయి మైనింగ్‌ లీజు కోసం 2007 ఫిబ్రవరి 15న దరఖాస్తు చేశారు. అదే ఏడాది ఏప్రిల్‌ 20న ఈశ్వర్‌ సిమెంట్స్‌ పరిశ్రమకు శంకుస్థాపన చేసినట్లు నివేదిక ఇచ్చారు. వాస్తవానికి ఆ రోజు వైఎస్‌ శంకుస్థాపన చేసింది దాల్మియా సిమెంట్స్‌దేనని సీబీఐ స్పష్టంచేసింది. ఈ కార్యక్రమానికి జగన్‌ హాజరైనట్లు వెల్లడించింది. ప్లాంటు ఈశ్వర్‌ సిమెంట్స్‌ది కాదని తెలిసినా.. రాజగోపాల్‌ నోట్‌ పంపించగా శ్రీలక్ష్మి, సబిత దాన్ని ఆమోదించారు. ఇలా.. ఈశ్వర్‌ సిమెంట్స్‌కు 30 ఏళ్లపాటు సున్నపురాయి మైనింగ్‌ లీజును ఇస్తూ 2008 జనవరి 9న జీవో జారీచేశారు. తర్వాత ఆ లీజును దాల్మియాకు బదిలీ చేయాలంటూ ఈశ్వర్‌ సిమెంట్స్‌ దరఖాస్తు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని