APPSC: ఒకే రోజు గ్రూపు-2, ఎస్‌బీఐ క్లరికల్‌ పోస్టుల రాత పరీక్షలు

ఏపీపీఎస్సీ నిర్లక్ష్యం నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీపీఎస్సీ వెనకాముందు చూసుకోకుండా ఈ నెల 25న ఎస్‌బీఐ క్లరికల్‌ మెయిన్స్‌ పరీక్ష జరుగుతున్న రోజే గ్రూపు-2 ప్రిలిమ్స్‌ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

Updated : 18 Feb 2024 10:09 IST

ఏది రాయాలో తెలియక అభ్యర్థుల హైరానా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఏపీపీఎస్సీ నిర్లక్ష్యం నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీపీఎస్సీ వెనకాముందు చూసుకోకుండా ఈ నెల 25న ఎస్‌బీఐ క్లరికల్‌ మెయిన్స్‌ పరీక్ష జరుగుతున్న రోజే గ్రూపు-2 ప్రిలిమ్స్‌ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. తేదీల ఖరారు సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియామక సంస్థల ద్వారా జరిగే పరీక్షలు, వాటి తేదీలను పరిగణనలోకి తీసుకొని ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించాలి. కానీ.. గ్రూపు-2 ప్రిలిమ్స్‌ తేదీ ఖరారులో ఎస్‌బీఐ పరీక్ష తేదీని పరిగణనలోకి తీసుకోలేదు. వాస్తవంగా ఎస్‌బీఐ నోటిఫికేషన్‌ గత నవంబరులో విడుదలైంది. ఆ నోటిఫికేషన్‌లోనే ఫిబ్రవరి 25న మెయిన్స్‌ ఉంటుందని ప్రకటించారు. దీనికి అనుగుణంగా అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. గ్రూపు-2 నోటిఫికేషన్‌ గత డిసెంబరు 7న ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో ప్రిలిమ్స్‌ ఫిబ్రవరి 25న నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. రెండూ ఒకే రోజున ఉన్నందున ఏ పరీక్ష రాయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. గ్రూపు-2 ఉద్యోగాలకు సుమారు 4.5 లక్షల మంది దరఖాస్తు చేశారు. గ్రూపు-2 నోటిఫికేషన్‌ జారీకి, ప్రిలిమ్స్‌ నిర్వహణ తేదీ మధ్య ఇచ్చిన సమయం తక్కువగా ఉన్నందున ప్రిలిమ్స్‌ నిర్వహణ తేదీని వాయిదా వేయాలన్న డిమాండు అభ్యర్థులనుంచి వస్తోంది. కొందరు అభ్యర్థులు విజయవాడలో కేంద్రం కేటాయించాలని దరఖాస్తులో పేర్కొంటే గుడివాడలో ఇచ్చారు. ఇలాగే ఇతర జిల్లాల్లోనూ జరిగింది.

ఎస్‌బీఐ హాల్‌టికెట్లు పంపితే తేదీని మార్పిస్తాం: ఏపీపీఎస్సీ

ఎస్‌బీఐ క్లరికల్‌ పరీక్షకు దరఖాస్తు చేసిన వారు హాల్‌టికెట్లను తమకు పంపించాలని ఏపీపీఎస్సీ అభ్యర్థులకు విజ్ఞప్తి చేసింది. ‘పరీక్ష విషయంలో ఎస్‌బీఐ ఉన్నతాధికారులను సంప్రదించాం. మాకు అందిన 10 మంది అభ్యర్థుల హాల్‌టికెట్లు వారికి పంపగా.. వారు మార్చి 4న (మరో స్లాట్‌) పరీక్ష నిర్వహించేందుకు ఆమోదించారు. ఇంకా ఎవరైనా ఉంటే ఈనెల 19లోగా తెలియజేయాలి. ఆ వివరాలను వారికి పంపి పరీక్ష తేదీల మార్పునకు కృషి చేస్తాం’ అని ఏపీపీఎస్సీ కార్యదర్శి శనివారం ప్రకటన జారీ చేశారు. అభ్యర్థులు విజ్ఞప్తులు పంపాల్సిన మెయిల్‌ అడ్రస్‌: appschelpdesk@gmail.com

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని