నింగినంటిన నిరసన గళం

ఈనాడు కార్యాలయం మీద, పాత్రికేయులపైన వైకాపా మూక దాడులకు పాల్పడడంపై వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లావ్యాప్తంగా బుధవారం రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు.

Published : 22 Feb 2024 04:58 IST

ఈనాడు కార్యాలయంపై దాష్టీకానికి నిరసన
ప్రభుత్వానికి, కాటసానికివ్యతిరేకంగా నినాదాలు

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: ఈనాడు కార్యాలయం మీద, పాత్రికేయులపైన వైకాపా మూక దాడులకు పాల్పడడంపై వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లావ్యాప్తంగా బుధవారం రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. పలు పార్టీల నాయకులు మద్దతు పలికారు. ఈనాడు కార్యాలయంపై దాడి అప్రజాస్వామికమని.. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ఆ పార్టీ నేతల అక్రమాలను బయట పెడుతోందనే అక్కసుతో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న జగన్‌ తీరును ఎండగట్టారు. వచ్చే ఎన్నికల్లో భయపెట్టి గెలిచేందుకు అధికార పార్టీ నేతలు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని పలువురు పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకుల తప్పులను ప్రశ్నిస్తూ.. అక్రమాలు వెలికితీస్తున్నందుకే దౌర్జన్యాలకు దిగుతున్నారని, ఇందుకు కారకులైన నేతల పని పట్టాలని పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని ఈనాడు కార్యాలయంపై మంగళవారం సాయంత్రం వైకాపా మూక దాడులను నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే, వివిధ పాత్రికేయ సంఘాల పిలుపు మేరకు కలెక్టరేట్‌ వద్ద బుధవారం భారీ ధర్నా జరిగింది. తెదేపా, జనసేన, వామపక్ష పార్టీలతోపాటు పలువురు స్వచ్ఛందంగా తరలివచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. దాడులతో పత్రికల గొంతు నొక్కలేరని పలువురు పేర్కొన్నారు.

నిందితులను అరెస్టు చేయాలి

ఈనాడు ప్రాంతీయ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ కర్నూలు కలెక్టరేట్‌ వద్ద ఉదయం 10.30 గంటలకు నిరసన ప్రారంభమైంది. పాత్రికేయ సంఘాల ప్రతినిధులతోపాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి డౌన్‌డౌన్‌ అని నినదించారు. దాడి చేయించిన ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డిని, దాడికి పాల్పడినవారిని అరెస్టు చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం పోవాలని.. భూ కబ్జాదారులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

మూడో పట్టణ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఆందోళనకారుల వద్దకు చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. తాము శాంతియుతంగా ధర్నా చేస్తున్నామని, కొంత సమయం ఇవ్వాలని నేతలు కోరారు. సహనం కోల్పోయిన సీఐ పాత్రికేయ సంఘాల నాయకులను పక్కకు తోశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.


దాడి ఘటనలపై అదనపు ఎస్పీకి ఫిర్యాదు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: కర్నూలులోని ఈనాడు కార్యాలయంపై, మద్దికెర ఆంధ్రజ్యోతి విలేకరి వీరశేఖర్‌పై దాడికి పాల్పడిన వైకాపా మూకలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ఐజేయూ జాతీయ సమితి సభ్యులు కొండప్ప, నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి శ్రీనివాసగౌడ్‌ తదితరులు బుధవారం అదనపు ఎస్పీ నాగరాజుకు వినతిపత్రం అందించారు.


అదనపు ఎస్పీకి వీడియోల అందజేత

ఈనాడు, కర్నూలు: కర్నూలులోని ‘ఈనాడు’ కార్యాలయంపై  దాడి చేసిన వైకాపా నాయకులు, కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ‘ఈనాడు’ ప్రకటనల విభాగం ఉద్యోగి గోపాల్‌, కర్నూలు యూనిట్‌ ఇన్‌ఛార్జి అలీ బుధవారం రాత్రి జిల్లా అదనపు ఎస్పీ నాగరాజుకు ఫిర్యాదు చేశారు. దాడి వీడియోలను అందించారు. దాడిలో పాల్గొన్నవారి వివరాలనుఫిర్యాదులో పేర్కొన్నారు.


మీడియాపై దాడులను ఖండిస్తూ సీపీఐ తీర్మానం

ఈనాడు, ఈనాడు డిజిటల్‌-అమరావతి: రాష్ట్రంలో పత్రిక కార్యాలయాలు, విలేకరులపై వైకాపా శ్రేణుల అమానుష దాడులను ఖండిస్తూ సీపీఐ రాష్ట్ర సమితి సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.


ప్రభుత్వమే ప్రోత్సహించడం దురదృష్టకరం
-కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్‌

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల గురించి పత్రికల్లో వస్తున్న కథనాలతో అసహనానికి గురై దాడులు చేయిస్తున్నారు. ప్రభుత్వమే వీటిని ప్రోత్సహించేలా వ్యవహరించడం దురదృష్టకరం.


ప్రశ్నించే గళం వింటే జగన్‌కు వణుకు
- తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు

వాస్తవాల్ని ప్రజలకు చేరవేసే మీడియా దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్‌ పునాదులు కదులుతున్నాయి. ప్రశ్నించే గళం వింటేనే జగన్‌ వణికిపోతున్నారు. ఆయన అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు, హత్యారాజకీయాల్ని వెలుగులోకి తెస్తున్నారనే మీడియాపై దాడులు చేయిస్తున్నారు.


కాటసానిపై కేసు నమోదు చేయాలి
-తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆయన అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. గతంలో ఎన్టీఆర్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైనా ‘ఈనాడు’ వార్తలు రాసింది. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వెళ్తే కథనాలూ ప్రచురించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని