ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులు

సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులని హైకోర్టు ప్రకటించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న జీవో 4 ప్రకారం నియామక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Published : 22 Feb 2024 04:58 IST

జీవో 4కు అనుగుణంగా ప్రక్రియ చేపట్టాలి
మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులని హైకోర్టు ప్రకటించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న జీవో 4 ప్రకారం నియామక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీఈడీ అభ్యర్థులను ఎస్‌జీటీ పోస్టుల భర్తీకి అనుమతించే నోటిఫికేషన్‌లోని నిబంధనపై స్టే విధించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌, జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి సభ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేస్తూ విచారణను ఏప్రిల్‌ 29కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ బీఈడీ అభ్యర్థులను ఎస్‌జీటీ పోస్టులకు అనుమతించబోమని తెలిపారు. నోటిఫికేషన్‌లోని సంబంధిత నిబంధనపై స్టే విధించాలని, జీవో 4కు అనుగుణంగా పోస్టుల భర్తీకి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఏజీ చెప్పిన వివరాలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులను వెలువరించింది. ఈ నెల 12న జారీ చేసిన నోటిఫికేషన్లో ఎస్‌జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ ఉన్న వారిని అనుమతించడాన్ని సవాలు చేస్తూ పలువురు డీఈడీ అభ్యర్థులు హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని