ఉల్లంఘనలు నిజం

రాష్ట్రమంతటా అనుమతులు లేకుండా ఇష్టానుసారం ఇసుక తవ్వకాలతో అధికారపార్టీ నేతలు కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారంటూ ప్రతిపక్షాలు, పత్రికలు, మీడియా ఎంత మొత్తుకున్నా జగన్‌ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు.

Updated : 22 Feb 2024 08:20 IST

ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలు
భారీ యంత్రాలతో తోడేస్తున్నారు
రీచ్‌ల వివరాలేవీ ఇవ్వని ఏపీ ప్రభుత్వం, గనులశాఖ
ఎన్జీటీకి కేంద్ర ప్రభుత్వ సంచలన నివేదిక
ఇసుక తవ్వకాల్లేవంటూ కలెక్టర్లు ఇచ్చిన నివేదికపై షాక్‌కు గురైన ఎన్జీటీ
ఈనాడు - అమరావతి

రాష్ట్రమంతటా అనుమతులు లేకుండా ఇష్టానుసారం ఇసుక తవ్వకాలతో అధికారపార్టీ నేతలు కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారంటూ ప్రతిపక్షాలు, పత్రికలు, మీడియా ఎంత మొత్తుకున్నా జగన్‌ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇసుకాసురులు అరాచకాలు చేస్తూ, ప్రశ్నించేవారిపై దాడిచేసే స్థాయికి వెళ్లిపోయినా వారికి అడ్డగోలుగా అండదండలు అందించింది. అయితే జగన్‌ ప్రభుత్వం చేస్తున్న ఇసుక దందా పచ్చినిజమని, దోపిడీ పక్కాగా సాగుతోందంటూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్‌) బట్టబయలు చేసింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు ఇచ్చిన నివేదికలో ఇసుక దోపిడీని కళ్లకు కట్టినట్లు వివరించింది. దీంతో ఇసుక గుత్తేదారు, రాష్ట్ర ప్రభుత్వం, గనులశాఖ, జిల్లా కలెక్టర్ల తీరుపై ఎన్జీటీ మండిపడింది. ఇదంతా చేసిన గుత్తేదారు శిక్షార్హులేనంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇవన్నీ సుప్రీంకోర్టు ముందు ఉంచనున్నట్లు స్పష్టం చేసింది. ‘ఇసుక తవ్వకాల్లో పెద్దఎత్తున ఉల్లంఘనలు జరుగుతున్నాయి. రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ (సియా) నిరుడు ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు ఇసుక తవ్వకాలకు కొత్తగా పర్యావరణ అనుమతులు (ఈసీలు) జారీ చేయలేదు. అయినా సరే భారీ యంత్రాలతో ఇసుక తవ్వేస్తున్నారు. 24 గంటలూ (రోజంతా) తవ్వేస్తూ ఒక్కో రీచ్‌ నుంచి వెయ్యి నుంచి 2 వేల టన్నుల ఇసుక తరలిస్తున్నారు.

చేతిరాతతో వేబిల్లులు ఇస్తున్నారు. కంప్యూటరైజ్డ్‌ బిల్లులు లేవు. సీసీ కెమెరాలు లేవు. వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ లేదు. ఇలా అడుగడుగునా ఉల్లంఘనలే. జిల్లాల వారీగా రీచ్‌ వివరాలు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం, గనులశాఖ అవేవీ ఇవ్వలేదు’ అని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటూ ఎన్జీటీకి ఇచ్చిన నివేదికలో కుండబద్దలు కొట్టేసింది. అయితే దీనికి విరుద్ధంగా రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ ఇసుక తవ్వకాలే జరగడం లేదంటూ అన్ని  జిల్లాల కలెక్టర్లు ఒకే విధంగా ఇచ్చిన నివేదికను చూసి ఎన్జీటీ నిర్ఘాంతపోయింది. తాము పరిశీలించిన రీచ్‌ల్లో గతంలోగానీ, ఇప్పుడు గానీ ఇసుక తవ్వకాలు జరుగుతున్న దాఖలాలే కనిపించలేదంటూ కలెక్టర్లు ఇచ్చిన నివేదికపై విస్మయం వ్యక్తం చేసింది. ఎంఓఈఎఫ్‌ నివేదికను సుప్రీంకోర్టు ముందు ఉంచాలంటూ కీలక ఆదేశాలిచ్చింది. అన్ని జిల్లాల్లోనూ ఇసుక రీచ్‌లు పరిశీలించి ఆ నివేదికను కూడా సుప్రీంకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాలు చేస్తుండటంపై గుంటూరు జిల్లాకు చెందిన దండా నాగేంద్రకుమార్‌, చిత్తూరు జిల్లాలోని అరణియార్‌ నదిలో ఇసుక తవ్వకాలపై డి.హేమకుమార్‌ గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ఎన్జీటీ జ్యుడిషియల్‌ సభ్యురాలు జస్టిస్‌ పుష్పా సత్యనారాయణ, ఎక్స్‌పర్ట్‌ మెంబర్‌ డాక్టర్‌ సత్యగోపాల్‌ కొర్లపాటి బుధవారం విచారణ చేపట్టారు.

తవ్విపారేస్తున్నారన్న కేంద్రం

అయితే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనవరి 17 నుంచి 19 వరకు ఇసుక రీచ్‌లు తనిఖీలు చేయగా.. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, 2021 నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయంటూ ఎంవోఈఎఫ్‌ కమిటీ మంగళవారం ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. బుధవారం నాటి విచారణలో ఆ నివేదికలోని అంశాలను ఎన్జీటీ ప్రస్తావించింది.

కేంద్ర నివేదికలోని కీలకాంశాలివీ.  

  • ఉమ్మడి గుంటూరు జిల్లాలో 8 రీచ్‌లు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 6 రీచ్‌లను తనిఖీ చేయగా, వేటికీ సియా ఈసీలు, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నుంచి కన్సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌, కన్సెంట్‌ ఫర్‌ ఆపరేషన్‌ అనుమతులు కూడా లేవు. అయినా వాటిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.  
  • ఆ రీచ్‌ల్లో జీసీకేసీ ప్రాజెక్ట్స్‌ అండ్‌ వర్క్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ 2 నుంచి 2.2 టన్నుల బకెట్‌ సామర్థ్యంతో ఉండే జేసీబీలు, హిటాచీలతో దర్జాగా ఇసుక తవ్వేస్తోంది.
  • రోజుకు సగటున 2 వేల టన్నుల వరకు ఇసుక తవ్వితీసి, టన్ను రూ.475 చొప్పున విక్రయిస్తున్నారు.
  • ఎంవోఈఎఫ్‌ జారీచేసిన.. సుస్థిర ఇసుక తవ్వకాల నిర్వహణ మార్గదర్శకాలు-2016, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అండ్‌ మానిటరింగ్‌ గైడ్‌లైన్స్‌-2020లను గుత్తేదారు సంస్థ పూర్తిగా ఉల్లంఘించింది.
  • గూగుల్‌ ఎర్త్‌లో 2021 నుంచి అందుబాటులో ఉన్న శాటిలైట్‌ చిత్రాలను విశ్లేషిస్తే.. విజయవాడ గనులశాఖ ఏడీ జారీ చేసిన లీజు ప్రాంతానికి బయట ఇసుక తవ్వుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. రీచ్‌ ఒక చోట ఉంటే తవ్వకాలు దానికి ఎంతో దూరం వరకు జరిగాయని తేటతెల్లమైంది.
  • 2021 నుంచి జారీ చేసిన ఈసీల షరతులను జేపీ పవర్‌ వెంచర్స్‌ విస్మరించింది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి సియా కొత్త ఈసీలు జారీచేయకపోయినా నవంబరు వరకు జేపీ సంస్థ భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు కొనసాగించింది. డిసెంబరు నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జీసీకేసీ ప్రాజెక్ట్స్‌ సంస్థ భారీ యంత్రాలతో ఇసుక తవ్వుతోంది. దీనికీ ఎటువంటి అనుమతులు లేవు.
  • ఈ నెల 19న (సోమవారం) డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ రీచ్‌లో ఎంవోఈఎఫ్‌ కమిటీ పరిశీలిస్తే.. అక్కడా జేసీబీలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ వాటి ఫొటోలతో సహా నివేదికలో స్పష్టంలో చేసింది’ అని ఎన్జీటీ పేర్కొంది.

మనుషులతో తవ్వకాలకే అనుమతించామన్న సియా

రాష్ట్రవ్యాప్తంగా సెమీ మెకనైజ్డ్‌ విధానంలో ఇసుక తవ్వకాలు ఆపేయాలంటూ జేపీ సంస్థకు, గనులశాఖ సంచాలకులకు  2023 ఏప్రిల్‌ 24న ఆదేశాలిచ్చామని, ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కొత్త ఈసీలు జారీ చేయలేదని సియా.. ఎన్జీటీకి స్పష్టం చేసింది. గత నెల 23, 24, ఈ నెల 7వ తేదీల్లో సమావేశాలు నిర్వహించి ఏడాది కాల వ్యవధితో 41 రీచ్‌ల్లో మాన్యువల్‌గా మాత్రమే ఇసుక తవ్వకాలకు వీలుగా గనుల శాఖకు అనుమతులు జారీచేసినట్లు పేర్కొంది. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదని స్పష్టంగా పేర్కొన్నట్లు వివరించింది.

అన్నీ ఉల్లంఘనలే.. శిక్షకు అర్హులే

అన్ని అంశాలను పరిశీలించాక, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ (ఎంఓఈఎఫ్‌) ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఇసుక గుత్తేదారు ఎటువంటి ఈసీలు లేకుండా భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు నిర్వహించారని, నిబంధనలు ఉల్లంఘించారని.. దీంతో గుత్తేదారు సంస్థ శిక్షార్హులు అని ఎన్జీటీ కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి భారీ జరిమానా వేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే గుత్తేదారుకు జరిమానా విధించడంపై గతంలో సుప్రీంకోర్టు స్టే ఇచ్చినందున.. ఈ అంశాన్ని సుప్రీంకోర్టుకు నివేదించడం సముచితమని అభిప్రాయపడింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నివేదికను తదుపరి విచారణలో సుప్రీంకోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. ఈలోపు మిగిలిన జిల్లాల్లో కూడా తనిఖీలు నిర్వహించి, ఆ నివేదికను సుప్రీంకోర్టు ముందు ఉంచాలని ఎంవోఈఎఫ్‌ను ఆదేశించింది. ఉల్లంఘనలపై పిటిషనర్లు గుర్తించిన అంశాలు సుప్రీంకోర్టుకు సమర్పించేందుకు అవకాశం కల్పిస్తూ.. పిటిషన్లపై విచారణను మూసివేస్తున్నట్లు ఎన్జీటీ ప్రకటించింది.

ఇదీ కేసు నేపథ్యం  

రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తవ్వుతున్నారన్న ఫిర్యాదులపై స్పందించిన ఎన్జీటీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నదుల్లో తక్షణం ఇసుక తవ్వకాలు ఆపేయాలని, కొత్తగా ఈసీలు తీసుకున్నాకే తవ్వకాలు చేపట్టాలని గత ఏడాది మార్చి 23న ఆదేశాలిచ్చింది. అరణియార్‌ నదిలో 18 రీచ్‌ల్లో జేపీ పవర్‌ సంస్థ నిబంధనలు ఉల్లంఘించిందంటూ రూ.18 కోట్లు జరిమానా విధించింది. దీనిపై జేపీ సంస్థ సుప్రీంకోర్టు ఆశ్రయించగా జరిమానాపై స్టే లభించింది. కానీ ఎన్జీటీ ఆదేశించినట్లు కొత్తగా ఈసీలు తీసుకొన్నాక ఇసుక తవ్వాలని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. అయినా సరే ఈసీలు లేకుండా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయంటూ పిటిషనర్‌ నాగేంద్రకుమార్‌ మళ్లీ ఎన్జీటీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఎంఓఈఎఫ్‌తో కూడిన సంయుక్త కమిటీ నివేదిక ఇవ్వాలని, అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా రీచ్‌లను పరిశీలించి నివేదికలు ఇవ్వాలని ఎన్జీటీ గతంలో ఆదేశించింది.

ముఖ్యనేత సోదరుడి కోసమే..

రాష్ట్రంలో కొంత కాలంగా ఇసుక దందా అంతా ‘ముఖ్య’నేత సోదరుడి కనుసన్నల్లో జరుగుతోంది. ఓ కార్పొరేట్‌ సంస్థలో గతంలో పీఆర్వోగా పనిచేసిన ఓ వ్యక్తి, మరో ఇద్దరు ఈ ఇసుక వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఎన్జీటీ, హైకోర్టు, సుప్రీంకోర్టుల ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా ఇష్టానుసారం ఇసుక వ్యాపారం చేసి, కోట్లాది రూపాయల సొమ్మును హైదరాబాద్‌ తరలిస్తున్నారు. నేరుగా ‘ముఖ్య’నేత సోదరుడే కీలక పాత్రధారి కావడంతో జిల్లాల్లో కలెక్టర్లు కూడా కళ్లకు గంతలు కట్టేసుకున్నారు. కలెక్టర్లే ప్రభుత్వ పెద్దలకు దాసోహమైతే.. తామెంత అన్నట్లుగా సంబంధిత శాఖల జిల్లా అధికారులూ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు.


అసలు తవ్వకాలే లేవన్న కలెక్టర్లు

ఎన్జీటీ ఆదేశాలు ఉన్నప్పటికీ ఈసీలు లేకుండా, భారీ యంత్రాలతో ఇసుక తవ్వేస్తున్నారంటూ పిటిషనర్‌ గతంలో ఎన్జీటీ దృష్టికి తీసుకురావడంతో దీనిపై నివేదిక ఇవ్వాలని ఎంవోఈఎఫ్‌, అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. దీంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి,  వైయస్‌ఆర్‌, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల జిల్లాల కలెక్టర్లు నివేదికలు అందజేశారని ఎన్జీటీ పేర్కొంది. అయితే ఎక్కడా ఇసుక తవ్వకాలు జరగడం లేదంటూ అన్ని జిల్లాల కలెక్టర్లూ ఒకేలా నివేదిక ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేసింది. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసినపుడు రీచ్‌ల్లో యంత్రాలు లేవని, ఇసుక తవ్వడం లేదని ఎలా పేర్కొన్నారని ప్రస్తావించింది. గతంలోగానీ, ఇటీవల గానీ ఆ రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు జరిగినట్లే లేదని పేర్కొనడాన్ని తీవ్రంగా పరిగణించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని