ఓటమి భయంతోనే వైకాపా దాడులు

పత్రికా కార్యాలయాలు, పాత్రికేయులపై వైకాపా గూండాల దాడులను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు, ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు చేపట్టి నిరసన వ్యక్తం చేశాయి.

Updated : 22 Feb 2024 05:33 IST

కదం తొక్కిన జర్నలిస్టులు గళం కలిపిన ప్రతిపక్షాలు
ఈనాడు కార్యాలయంపై వైకాపా దాడికి ఖండన
ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలని హెచ్చరిక
రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు
నేడు చలో కర్నూలు.. చలో అనంతపురం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పత్రికా కార్యాలయాలు, పాత్రికేయులపై వైకాపా గూండాల దాడులను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు, ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు చేపట్టి నిరసన వ్యక్తం చేశాయి. ఎన్నికల్లో గెలవలేమనే భయంతోనే ముఖ్యమంత్రి జగన్‌ ఈ తరహా దాడులకు పురిగొల్పుతున్నారని విరుచుకుపడ్డాయి. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మండిపడ్డాయి. దాడులు ఇలాగే కొనసాగితే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించాయి. ఆందోళనల్లో తెదేపా, జనసేన, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంతో పాటు ఏఐఎస్‌ఎఫ్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌, గిరిజన విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. దాడులను ముక్తకంఠంతో ఖండించారు. దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీ, ఆర్‌డీవో, తహసీల్దార్‌లకు వినతిపత్రాలు ఇచ్చారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా కఠిన చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ‘ఈనాడు’ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ చలో కర్నూలు, ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడిని నిరసిస్తూ గురువారం చలో అనంతపురం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్‌ వెల్లడించారు.

కార్యకర్తలను రెచ్చగొడుతున్న జగన్‌

గుంటూరులో ఏపీడబ్ల్యూజేఏ ఆధ్వర్యంలో జర్నలిస్టులు, తెదేపా నేతలు నక్కా ఆనంద్‌బాబు, కన్నా లక్ష్మీనారాయణ, నజీర్‌ అహమ్మద్‌, డి.ప్రభాకర్‌ ఆందోళన నిర్వహించారు. హిందూ కళాశాల కూడలిలో మానవహారం నిర్వహించారు. నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ అకృత్యాలు బయటపెడుతుంటే తట్టుకోలేకనే వైకాపా కార్యకర్తలు మీడియాపై దాడులకు తెగబడుతున్నారు. నియంతృత్వ ధోరణితో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ‘చొక్కాలు మడతపెట్టమంటూ సీఎం జగన్‌ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు’ అని మండిపడ్డారు.

తాడేపల్లి ఆదేశాల మేరకే దాడులు

ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు విజయవాడలో ధర్నా చేపట్టారు. ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ఐజేయూ, జనసేన, తెదేపా, సీపీఐ, సీపీఎం జిల్లా నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ సర్కిల్‌, గాంధీ విగ్రహం బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ దాడులను జరుగుతున్నాయని మండిపడ్డారు. జిల్లా అదనపు ఎస్పీ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు.

కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలి

తిరుపతిలో ఏఐఎస్‌ఎఫ్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌, గిరిజన విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలని.. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. జర్నలిస్టులపై మాట్లాడేటప్పుడు కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

ఎన్నికల్లో గెలవలేమనే భయంతోనే దాడులు

విజయనగరంలో ఏపీయూడబ్ల్యూజే, ఏపీయూడబ్ల్యూజేఎఫ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌లో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. గజపతినగరం తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి కేఏ నాయుడు, భోగాపురం మండలంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగారాజు, పాలకొండలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి రామమల్లిక నాయుడు, పలువురు ఆందోళనలు నిర్వహించారు. ఎన్నికల్లో గెలవమనే భయంతోనే ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని తెదేపా నియోజకవర్గం ఇన్‌ఛార్జి అశోక్‌గజపతిరాజు విమర్శించారు. మీడియాని భయబ్రాంతులకు గురిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు.

దాడులు కొనసాగితే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం

పల్నాడు జిల్లాలోని నరసరావుపేట గాంధీ విగ్రహం నుంచి ఆర్‌డీవో కార్యాలయం వరకు ఏపీయూడబ్యూజీ జర్నలిస్టులు, ప్రజాసంఘాలు, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం నాయకులు ర్యాలీ చేసి మానవహారం చేపట్టారు. జర్నలిస్టులపై దాడులు ఇలాగే కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

జర్నలిస్టులపై దాడి చేసేవారిని శిక్షించాలి

  • వైకాపా దాడిని మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఖండించారు. రేపు సాక్షి జర్నలిస్టులకు కూడా ఇదే గతి పడుతుందని, అవినీతి సొమ్ముతో పుట్టిన ఆ పత్రిక నుంచి బయటపడాలని జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టులు, కార్యాలయాలపై దాడులు చేసే అల్లరి మూకను శిక్షించాలని ప్రెస్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ రంజనప్రకాష్‌ దేశాయ్‌కు సామాజిక కార్యకర్త అప్పన్న లేఖ రాశారు.
  • ఒంగోలులో ఏపీడబ్ల్యూజేఎఫ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరై జేసీ గోపాలకృష్ణకు, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. జిల్లాలోని తాల్లూరు, దొనకొండ, కనిగిరి ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు.
  • ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే జర్నలిస్టులపై దాడులను ఏపీసీసీ ప్రధాన కార్యదర్శులు మహమ్మద్‌ ఆరిఫ్‌, శివన్నారాయణ ఖండించారు. ఈ నిరంకుశ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్‌ కాకినాడ జిల్లాలోని అంబాజీపేట మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు స్థానిక ఎమ్మార్వోకు వినతిపత్రాన్ని అందించారు. నిందితులను శిక్షించాలని కోరుతూ అనపర్తి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దారును కలిసి వినతిపత్రం అందజేశారు.  
  • అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో తెదేపా నాయకులు అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని ధర్నా నిర్వహించారు. ఆగలి తహసీల్దార్‌ కార్యాలయంలో మండల విలేకరుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.
  • వైకాపా దాడులను శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాజకీయ పార్టీలు, జర్నలిస్టు సంఘాలు ఆక్షేపించాయి. పత్రికా స్వేచ్ఛను హరించేలా దాడులు చేస్తున్నారని తెదేపా కావలి నియోజకవర్గ బాధ్యులు కావ్య కృష్ణారెడ్డి మండిపడ్డారు. బుధవారం పార్టీ తరఫున నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లాలోని సైదాపురం తహసీల్దారు కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి పాత్రికేయులు నిరసన తెలిపారు.


ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం

పత్రికా కార్యాలయాలు, విలేకరులపై దాడులు సరికావని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇలాంటి దాడులు విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు.


దాడి అమానుషం
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్‌

విజయవాడ (గాంధీనగర్‌), న్యూస్‌టుడే: పాత్రికేయులపై భౌతిక దాడులకు పాల్పడి.. పత్రికా స్వేచ్ఛను హరించాలనే ఆలోచనలో ఉన్న ఏ ప్రభుత్వాలు మనుగడ సాగించలేదని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్‌ అన్నారు. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఏపీయూడబ్ల్యూజే అర్బన్‌ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌ వద్ద పాత్రికేయులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జనార్దన్‌ మాట్లాడుతూ.. నిజాలు రాసే ‘ఈనాడు’పై దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని, ప్రభుత్వ వైఫల్యాలపై వ్యతిరేక వార్తలు రాస్తున్నారనే అక్కసుతో దాడులకు తెగబడడం సరికాదన్నారు. యూనియన్‌ సీనియర్‌ నాయకుడు ఎస్‌.కె.బాబు, యూనియన్‌ అర్బన్‌ అధ్యక్షుడు చావా రవి, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్‌.రమణారెడ్డి, ప్రెస్‌ క్లబ్‌ కార్యదర్శి డి.నాగరాజు, ఫొటో జర్నలిస్టు అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు విజయభాస్కర్‌, జర్నలిస్టులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని