నాలుగు గంటల నరకం!

ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనంటే ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాల సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అలాంటి పరిస్థితే బుధవారం వారికి ఎదురైంది.

Updated : 22 Feb 2024 06:57 IST

సీఎం విశాఖ పర్యటనలో అక్కచెల్లెమ్మల విలవిల
జగన్‌కు స్వాగతం పలికేందుకు మండుటెండలో పడిగాపులు
ప్రతిపక్షాల ఫ్లెక్సీలు తొలగించిన అధికారులు

ఈనాడు, విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనంటే ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాల సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అలాంటి పరిస్థితే బుధవారం వారికి ఎదురైంది. విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలకు సీఎం జగన్‌ విచ్చేసిన నేపథ్యంలో స్వాగతం పలికేందుకు నాలుగు గంటల పాటు మండుటెండలో నిల్చొని మహిళలు ఇక్కట్లకు గురయ్యారు. ఎండలో నిల్చోలేక, చెమటలు కారిపోతుంటే.. జగన్‌ ఏసీ కారులో అద్దాలు కూడా దించకుండా అభివాదాలు చేస్తూ ముందుకెళ్లారు. నాలుగున్నరేళ్లుగా పరదాల మాటున సీఎం పర్యటనలు సాగిపోగా, ఎన్నికల వేళ జనాలు నిండుగా కనిపించాలంటూ జగన్‌ ఆదేశాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో శారదా పీఠం వార్షికోత్సవాలకు మహిళా సంఘాల సభ్యులను భారీగా తరలించాలని స్థానిక నాయకులు హుకుం జారీ చేశారు. ‘ఇదే చివరి సమావేశం. ఇకపై ఇబ్బంది పెట్టం’ అంటూ కొందరు ఆర్పీలు డ్వాక్రా సంఘాల సభ్యులకు నచ్చజెప్పి తీసుకొస్తే, మరికొందరు రుణాలు ఇవ్వబోమని బెదిరించి తరలించారు.

పింఛనుదార్లను తీసుకొచ్చే బాధ్యతలను వాలంటీర్లకు అప్పగించారు. కూడళ్ల వద్ద పర్యవేక్షణకు ఏపీడీలను నియమించారు. విమానాశ్రయం నుంచి చినముషిడివాడ వరకు దాదాపు 24 ప్రాంతాల్లో ఉదయం 8.30 గంటలకే ఆటోల్లో మహిళలను తరలించారు. ‘సిద్ధం సీఎం సార్‌’ అని రాసి ఉన్న ప్లకార్డులు వారికిచ్చి నిల్చోబెట్టారు. సీఎం ఎప్పుడు వస్తారో సమయం కూడా చెప్పలేదు. అప్పటినుంచి మధ్యాహ్నం 12.26 గంటల వరకు, అంటే సుమారు నాలుగు గంటలపాటు మండుటెండలోనే ఉండిపోయారు. ప్లకార్డులు, చున్నీలు, చీరకొంగులు ఎండకు అడ్డుపెట్టుకుని నానాతంటాలు పడ్డారు. విమానాశ్రయం కూడలి నుంచి కాకానినగర్‌ బస్‌స్టాప్‌ వరకు బారికేడ్లు ఏర్పాటు చేసి, అందులో మహిళలను బంధించినట్లు నిలబెట్టారు. ఎండ మండిపోతున్నా.. చెట్ల నీడకు వెళ్లడానికి కూడా వీల్లేని పరిస్థితి. ‘సీఎం పర్యటన ఏ సమయంలో ఉంటుందో కూడా చెప్పకుండా ఉదయమే తీసుకొచ్చి రోడ్లపై పడేశారు. ఎండలు మండిపోతున్నాయి. మాకేమైనా జరిగితే సీఎం చూస్తారా’ అంటూ పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు జగన్‌ పర్యటన మార్గంలో రాత్రికిరాత్రే తెదేపా ఫ్లెక్సీలను తొలగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని