ఉన్నత విద్య వైపు.. ‘హీల్‌’.. పేద విద్యార్థుల కోసం మరో ముందడుగు

అనాథలు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయిన  చిన్నారులకు నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందించే లక్ష్యంతో మూడు దశాబ్దాల కిందట ప్రవాసాంధ్రుడు డాక్టర్‌ కోనేరు సత్యప్రసాద్‌ ఏర్పాటు చేసిన హీల్‌ ప్యారడైజ్‌ సంస్థ మరో ముందడుగు వేసింది.

Updated : 22 Feb 2024 10:25 IST

హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ, అలేఖ్య ఏఐ సెంటర్‌
తోటపల్లిలో నేడు శంకుస్థాపన కార్యక్రమాలు

ఈనాడు, అమరావతి - ఆగిరిపల్లి, న్యూస్‌టుడే : అనాథలు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయిన  చిన్నారులకు నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందించే లక్ష్యంతో మూడు దశాబ్దాల కిందట ప్రవాసాంధ్రుడు డాక్టర్‌ కోనేరు సత్యప్రసాద్‌ ఏర్పాటు చేసిన హీల్‌ ప్యారడైజ్‌ సంస్థ మరో ముందడుగు వేసింది. ఇప్పటివరకూ ఇంటర్మీడియట్‌ వరకూ ఉచితంగా విద్యను అందిస్తున్న ఈ సంస్థ ఇకపై ఉన్నత విద్యను అందించేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ ఫర్‌ లెర్నింగ్‌, అలేఖ్య హీల్‌ ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, ప్రతిపాదిత డీమ్డ్‌ విశ్వవిద్యాలయ భవనాలకు గురువారం శంకుస్థాపన చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వీటితోపాటు హీల్‌ సెంటర్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ ఎక్సలెన్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ సెంటర్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా శాంతా బయోటెక్నిక్స్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కె.ఐ.వరప్రసాద్‌ రెడ్డి హాజరవుతారు.

గన్నవరం విమానాశ్రయానికి 15 కి.మీ. దూరంలో ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలోని తోటపల్లి గ్రామంలో 60 ఎకరాల విస్తీర్ణంలో హీల్‌ ప్యారడైజ్‌ పేరుతో పేద విద్యార్థులు, అభాగ్యుల కోసం ఓ గ్రామాన్నే డాక్టర్‌ కోనేరు సత్యప్రసాద్‌ నిర్మించారు. ఇక్కడ పాఠశాల, ఆసుపత్రి, అంధుల కోసం ప్రత్యేకంగా విద్యా సంస్థ, యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం, కృత్రిమ అవయవాల కేంద్రం, వయోవృద్ధుల సంరక్షణ సంస్థ, సేంద్రీయ వ్యవసాయం, అలేఖ్య హీల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(కృత్రిమ మేథ) సెంటర్‌, క్రీడలకు ప్రత్యేక మైదానాలు ఇక్కడ నెలకొల్పారు. ఉచితంగానే ఇక్కడ అన్ని సేవలూ అందిస్తున్నారు. హీల్‌ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా వలంటీర్లు, భాగస్వాములు, మద్దతుదారులున్నారు.

అందరికీ విద్య, వైద్యమే నినాదంగా..

అందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించాలనేదే సంస్థ ప్రధాన లక్ష్యం. అయిదు దశాబ్దాల క్రితం డాక్టర్‌ కోనేరు సత్యప్రసాద్‌ వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడు గుంటూరు కేంద్రంగా ప్రజాసేవా సమితి పేరుతో సామాజిక కార్యక్రమాలను ప్రారంభించారు. 1922లో ఆ సంస్థను హీల్‌ ఛారిటీగా మార్చారు. గత 32 ఏళ్లుగా విజయవాడ, భద్రాచలం, తోటపల్లి కేంద్రాలుగా సంస్థ వేల మందికి సేవలు అందిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు