ఇది జగన్‌ మార్కు రూల్‌

రాష్ట్రంలో పాలనకు ఎలాంటి నిబంధనలూ లేవు.. ఏ పద్ధతులూ అక్కర్లేదు. అవసరమైతే ఒకే ఒక్క సంతకంతో ఏ రూలు, ఏ ఉత్తర్వులకైనా మినహాయింపు ఇచ్చేస్తారు.

Updated : 22 Feb 2024 07:02 IST

ఈఈ.., ఎస్‌ఈ.. చీఫ్‌ ఇంజినీరూ ఆయనే
జూనియర్‌ ఈఈకి ఎస్‌ఈగా పదోన్నతి
పెద్దిరెడ్డి సిఫార్సు.. సీఎంవో ఆదేశాలు

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో పాలనకు ఎలాంటి నిబంధనలూ లేవు.. ఏ పద్ధతులూ అక్కర్లేదు. అవసరమైతే ఒకే ఒక్క సంతకంతో ఏ రూలు, ఏ ఉత్తర్వులకైనా మినహాయింపు ఇచ్చేస్తారు. వాళ్లు ఏమనుకుంటారో అది చేసేస్తారు. అంతా మా ఇష్టం. మా రాజ్యం అంటూ పెత్తనం చెలాయిస్తున్నారు. సీఎంవో ఏం చెబితే అదే నిర్ణయం. అందుకు అనుగుణంగా అయ్యా..ఎస్‌.. అంటూ ఉత్తర్వులు వెలువడిపోతున్నాయి. తాజాగా జలవనరులశాఖలో చోటు చేసుకున్న పరిణామం ఉద్యోగలోకాన్ని విస్తుపోయేలా చేసింది. ముఖ్యమంత్రి జగన్‌ నియోజకవర్గంలోని గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు సర్కిల్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు మల్లికార్జునరెడ్డి పని చేస్తున్నారు. ఆ కేడర్‌లో ఆయన కన్నా సీనియర్లు ఎందరో ఉన్నారు. కానీ ఈయన ఎస్‌ఈ పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా గాలేరు నగరి సుజల స్రవంతి చీఫ్‌ ఇంజినీరు పదవీ విరమణ చేయగా, ఈ జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరుకు సూపరింటెండెంట్‌ ఇంజినీరుగా అడ్‌హాక్‌ పదోన్నతి కల్పించారు. అంతేకాదు- నేరుగా చీఫ్‌ ఇంజినీరు పోస్టులో పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చేశారు. అక్కడ ఆయన ఈఈ, ఎస్‌ఈ పోస్టులో అడ్‌హాక్‌ పదోన్నతి. ఆపైన చీఫ్‌ ఇంజినీరుగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు. ఒక పులివెందుల అధికారి సాధించిన అక్రమ పోస్టింగ్‌ ఇది. ఇది అలా ఇలా సాధించింది కాదు- సాక్షాత్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డి నేరుగా సిఫార్సు చేశారు. ఈ సిఫార్సు లేఖలపై ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి సైతం సిఫార్సు చేసి జలవనరులశాఖలో ఫైలు తయారు చేయించి ఆఘమేఘాలపై కదిలించారు. ఆ జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు కన్నా రాష్ట్రం మొత్తం మీద తొమ్మిది మంది ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు సీనియర్లుగా ఉన్నారు. వాస్తవానికి వారందరికీ పదోన్నతులు ఇస్తే తప్ప ఈ మల్లికార్జున్‌రెడ్డికి పదోన్నతి పొందే అవకాశమే లేదు. పులివెందుల మార్కు రూలు పాలిస్తుండటంతో మొత్తం ఉద్యోగలోకమే విస్తుపోయే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన పైన ఉన్న సీనియర్లు నిస్సహాయులుగా ఉండిపోవాల్సి వచ్చింది. ఎవరైనా తప్పు చేస్తే పై వాళ్లకు చెబుతుంటాం. నేరుగా పై వాళ్లే తప్పు చేస్తే ఎవరికి చెబుతాం అని ఆవేదన చెందుతున్నారు.

నిలిచిపోయిన పదోన్నతుల ప్రక్రియ

జలవనరులశాఖలో ఎప్పటి నుంచో పదోన్నతుల వివాదం సాగుతోంది. జోనల్‌ వ్యవస్థను పక్కన పెట్టి వర్టికల్‌ సీనియారిటీ పద్ధతిలో పదోన్నతుల జాబితా ఖరారు చేసి గతంలో 2017లోనే పదోన్నతులు కల్పించారు. ఇలా జోనల్‌ వ్యవస్థను పక్కన పెట్టి పదోన్నతులు కల్పించడం రాజ్యాంగం విరుద్ధం అంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. మరో వ్యవహారంలో ఏపీపీఎస్సీ సీనియారిటీని కూడా పరిగణనలోకి తీసుకోవాలనే డిమాండ్లు ఉన్నాయి. ఈ అన్ని అంశాల్లోను ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టులో వివాదాలు సాగుతుండటంతో పదోన్నతుల ప్రక్రియ ఎప్పటి నుంచో సందిగ్ధావస్థలో ఉంది. డీఈఈ పోస్టు నుంచి చీఫ్‌ ఇంజినీరు పోస్టు వరకు రెగ్యులర్‌ పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఆయా పోస్టుల్లో పూర్తిస్థాయి అదనపు బాధ్యతల పేరుతో పోస్టింగులు ఇస్తున్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఏటా సాధారణ బదిలీల సమయంలో ఇలా అదనపు బాధ్యతల కోసం పైరవీలు సాగుతున్నాయి. తాజాగా ఈ జనవరిలో కొత్తగా పదవీ విరమణలు ప్రారంభం కావడంతో పదోన్నతుల అంశం తెరపైకి వచ్చింది. జనవరి 31న చాలామంది పదవీ విరమణ చేశారు. నిజానికి జనవరి 31న చీఫ్‌ ఇంజినీరు పోస్టులో పదవీ విరమణ చేసిన వెంటనే పూర్తి అదనపు బాధ్యతలతో కొత్త అధికారిని నియమించాల్సి ఉంది. కేవలం పులివెందుల ఈఈకి రాజకీయంగా అండదండలు ఉండటంతో ఆ వ్యవహారం పెండింగ్‌లో పడింది.

తొమ్మిదిమందిని తప్పించి..  

ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతి పొందిన ఈఈ కన్నా ముందు జోన్‌ 4లో ఆరుగురు, జోన్‌ 1లో ముగ్గురు ఈఈలు ఉన్నారు. పదోన్నతులు ఇవ్వాలంటే తొలుత ఆ తొమ్మిది మందికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రస్తుత ఈఈ మల్లికార్జునరెడ్డి పదోన్నతికి అర్హులవుతారు. జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌, ముఖ్య కార్యదర్శి సైతం తమ ఫైలులో ఈ అంశాలు పేర్కొన్నట్లు తెలిసింది. ఆయన పైన ఉన్న 9 మందికి పదోన్నతులు కల్పించాలని కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 35 మందికి పదోన్నతులు కల్పించాల్సి ఉంటుందని కూడా లెక్క తేల్చారు. నిజానికి సాధారణంగా పదోన్నతుల అంశం ముఖ్యమంత్రి వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ వ్యవహారంలో నేరుగా సీఎంవో నుంచి ఒత్తిడి ఉండటంతో సంబంధిత ఫైలు అక్కడికి చేరింది. ఎగువన ఉన్న అందరి పేర్లు కొట్టేసి పులివెందుల ఈఈ మల్లికార్జునరెడ్డికి పదోన్నతి కల్పించాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. సీఎం కార్యాలయం ఆదేశాల మేరకే ఉత్తర్వులు వెలువడ్డాయని తెలిసింది.

అడ్‌హాక్‌ పద్ధతిలో..

ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఈఈ మల్లికార్జునరెడ్డికి అడ్‌హాక్‌ పదోన్నతి కల్పించారు. ఆయన కన్నా సీనియర్లు కూడా ఉన్నతాధికారులను కలిసి తమకు కూడా అడ్‌హాక్‌ పదోన్నతులు ఇవ్వాలని విన్నవించుకున్నారు. ఎలాగూ తమలో చాలామంది ఆగస్టు లోపు పదవీ విరమణ చేసేవారమేనని, ఆ ఎస్‌ఈ పోస్టులు మళ్లీ కావాలనుకున్న వారికి ఇచ్చుకోవచ్చని- అంతవరకు తమకు కూడా అడ్‌హాక్‌ పదోన్నతులు కల్పిస్తే ఎస్‌ఈలుగా పదవీ విరమణ చేస్తామని, ఆ ప్రయోజనాలు పొందుతామని వారు అడుగుతున్నారు. తమకు చీఫ్‌ ఇంజినీరు పోస్టులు అవసరం లేదని కూడా విన్నవిస్తున్నారు.


నాడు పంచాయతీరాజ్‌లో...

ఇప్పుడే కాదు- గతంలో పంచాయతీరాజ్‌శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ పోస్టు పోస్టులోను ఇదే తరహా వ్యవహారం సాగింది. సీనియారిటీ ప్రకారం అర్హత కలిగిన వారిని పక్కన పెట్టి ఆ జాబితాలో అయిదో స్థానంలో ఉన్న వ్యక్తిని ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ స్థానంలో పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించి కూర్చోబెట్టారు. అప్పట్లో చీఫ్‌ ఇంజినీరుగా పదవీ విరమణ చేసిన బి.సుబ్బారెడ్డికే పదవీ కాలాన్ని రెండు విడతలుగా వైకాపా సర్కార్‌ పొడిగించింది. ఆయనకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో ఈఎన్‌సీ పోస్టు అప్పగించారు. ఫలితంగా ఆయన కన్నా సీనియర్లు అయిన ఎస్సీ, ఎస్టీ చీఫ్‌ ఇంజినీర్లు నష్టపోయారు. బి.సుబ్బారెడ్డి పదవీ విరమణ చేసిన తర్వాత సీనియర్‌గా ఉన్న ఎస్టీ వర్గానికి చెందిన బాలూ నాయక్‌కు ఈఎన్‌సీ పోస్టు దక్కాల్సి ఉంది. ఆయనను కాదని ఆయన కన్నా జూనియర్‌గా అయిదో స్థానంలో ఉన్న  సి.వి.సుబ్బారెడ్డిని ఆ పోస్టులో నియమించి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ నిర్ణయంపై విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గి చివరికి బాలూ నాయక్‌ను నియమించింది. ప్రస్తుతం జలవనరులశాఖ చీఫ్‌ ఇంజినీరు నియామక ప్రక్రియ కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. సీనియారిటీ ఉన్న ఈఈలకు అడ్‌హాక్‌ ఎస్‌ఈలుగా పదోన్నతులు కల్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని