హైస్కూల్‌ ప్లస్‌.. ఆదరణ మైనస్‌..!

రాష్ట్రంలో ‘హైస్కూల్‌ ప్లస్‌’ అంటూ చేపట్టిన ప్రయోగం మిథ్యగా మారింది. సీబీఎస్‌ఈ తరహాలో బాలికల కోసం పాఠశాలల్లోనే ప్రత్యేకంగా ప్రారంభించిన ఇంటర్‌ విద్యను వైకాపా సర్కారు గాలికి వదిలేసింది.

Published : 22 Feb 2024 03:56 IST

రాష్ట్రవ్యాప్తంగా 44 ఇంటర్‌ కళాశాలల్లో ప్రవేశాలు ‘సున్నా’
బాలికలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో జగన్‌ సర్కారు ఫెయిల్‌
ప్రయోగశాలలు లేక పది కిలోమీటర్లు ప్రయాణించాల్సిన దుస్థితి
కొత్త నియామకాల్లేక స్కూల్‌ అసిస్టెంట్లతోనే పాఠాలు
గతేడాది ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 88 శాతం అనుత్తీర్ణత

‘ఆరంభ శూరత్వం’..
ఈ పదం జగన్‌ సర్కారుకు సరిగ్గా నప్పుతుంది.

ఎందుకూ అంటే..
‘హైస్కూల్‌ ప్లస్‌’ అన్నారు..
వాటిల్లో బాలికలకే ఇంటర్‌ ప్రవేశాలన్నారు..  
ఆ తర్వాత వాటిని గాలికి  వదిలేశారు..
బోధకులు లేరు.. సౌకర్యాలను పట్టించుకోరు..
ఇంకేముంది.. ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోయింది.. ప్రవేశాలూ తగ్గిపోయాయి..
ఉన్నవాటిని వదిలేసి.. కొత్త రాగం తీసి..  
పేద పిల్లల జీవితాలతో ఆటలెందుకు జగన్‌?

రాష్ట్రంలో ‘హైస్కూల్‌ ప్లస్‌’ అంటూ చేపట్టిన ప్రయోగం మిథ్యగా మారింది. సీబీఎస్‌ఈ తరహాలో బాలికల కోసం పాఠశాలల్లోనే ప్రత్యేకంగా ప్రారంభించిన ఇంటర్‌ విద్యను వైకాపా సర్కారు గాలికి వదిలేసింది. చదువుపై పెట్టే ప్రతిపైసాను పెట్టుబడిగానే భావిస్తానని గొప్పలు చెప్పే సీఎం జగన్‌.. ఆయా విద్యాసంస్థల్లో కనీస సదుపాయాలు కల్పించడంలోనూ విఫలమయ్యారు. పేదలకు అన్నీ తానే అన్నట్లు చెప్పుకొంటూ.. రూపుమార్చుకున్న అంటరానితనమంటూ.. ఆయన చేసిందేమైనా ఉందా అంటే ఏమీ లేదు. హైస్కూల్‌ ప్లస్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్‌ చదువులో బాలికలు ప్రాక్టికల్స్‌ చేసేందుకు కనీసం ప్రయోగశాలలు కూడా ఏర్పాటు చేయలేదు. పాఠాలు చెప్పేందుకు గతేడాది లెక్చరర్లకే దిక్కు లేదు. ఉచిత పాఠ్యపుస్తకాల పథకాన్ని ఎత్తివేశారు. ఇవన్నీ రూపుమార్చుకున్న అంటరానితనం కాదా? ఒక్కమాటలో చెప్పాలంటే.. హైస్కూల్‌ ప్లస్‌ బాలికల ఇంటర్మీడియట్‌ విద్యలో ప్రభుత్వం ఫెయిలైంది. బాలికల కోసం ప్రత్యేక జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలిచ్చి.. ఆ తర్వాత వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు.

గతేడాది 12 శాతమే ఉత్తీర్ణత

గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా మండలానికో బాలికల జూనియర్‌ కళాశాలంటూ 292 పాఠశాలల్లో ‘హైస్కూల్‌ ప్లస్‌’ పేరిట ఇంటర్మీడియట్‌ విద్యను ప్రవేశపెట్టారు. 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించినా.. పాఠాలు చెప్పేందుకు లెక్చరర్లను మాత్రం నియమించలేదు. పదో తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులతోనే స్థానికంగా పాఠాలు చెప్పించాలని ఆదేశించారు. 2022 జూన్‌లో తరగతులు ప్రారంభమైతే.. 2023 జనవరిలో పాఠ్యపుస్తకాలు ఇచ్చారు. కొన్నిచోట్ల పాత పుస్తకాలనే సర్దుబాటు చేశారు. పేద బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కళాశాలల్లో కనీస సదుపాయాలూ లేవు. ప్రత్యేకంగా తరగతి గదులు లేకపోవడంతో హైస్కూల్‌లోని కొన్ని గదులనే దీనికోసం సర్దుబాటు చేశారు. గతేడాది 292చోట్ల ఇంటర్మీడియట్‌ ప్రారంభిస్తే.. 115 చోట్ల ఒక్కరూ చేరలేదు. మిగతా వాటిల్లోనూ సరాసరిగా 12మంది చొప్పున మాత్రమే ప్రవేశాలు పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,054 మంది మొదటి సంవత్సరం పబ్లిక్‌ పరీక్షలు రాస్తే, 366మంది మాత్రమే  ఉత్తీర్ణులయ్యారు. అంటే కేవలం 12శాతం. రెండో సంవత్సరం చదువుతున్న వారికి ప్రాక్టికల్‌ పరీక్షల కోసం ల్యాబ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. సమీపంలోని బడులు, జూనియర్‌ కళాశాలల్లో ఉన్నవాటినే వినియోగించుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చి వదిలేశారు. దీంతో చాలాచోట్ల అసలు ప్రయోగాలే జరగలేదు. కొన్నిచోట్ల 10 కిలోమీటర్లకుపైగా దూరం వెళ్లి ప్రయోగాలు చేయాల్సి వచ్చింది. ఇంటర్మీడియట్‌ బోధన కోసం ఈ ఏడాది 1,752 మంది అధ్యాపకులను నియమించారు. వారికి ఒక ఇంక్రిమెంట్‌ ఇస్తామని ప్రభుత్వం చెప్పినా.. విడుదల చేయలేదు.

ఈ ఏడాదీ అదే దుస్థితి..

ఈ విద్యా సంవత్సరంలోనూ 44 చోట్ల ఒక్కరూ చేరలేదు. మొత్తం అన్ని కళాశాలల్లో కలిపి 4,935 మంది మాత్రమే ప్రవేశం పొందారు. అంటే.. సగటున ఒక్కో కళాశాలలో చేరింది 17 మందే. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు కలిపి చూస్తే సగటున 27మంది చొప్పున ఉన్నారు. 20లోపు అమ్మాయిలు ఉన్న హైస్కూల్‌ ప్లస్‌లు 84వరకు ఉన్నాయి. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, ప్రయోగశాలలు ఏర్పాటు చేయకపోవడంతో బాలికలు వీటిలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. రెగ్యులర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనే ప్రవేశాలు తగ్గిపోతుండటం సర్కారు పనితీరుకు అద్దం పడుతోంది.

ఒకవైపు బాలికల కళాశాలల్లోనే ప్రవేశాలు లేవంటే, వచ్చే ఏడాది నుంచి మండలానికి ఒక కో-ఎడ్యుకేషన్‌ కళాశాల ఏర్పాటుకు సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు కళాశాలల ఏర్పాటు గురించి ఎమ్మెల్యేలకు మంత్రి బొత్స లేఖలు కూడా రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 206 మండలాల్లో కో-ఎడ్యుకేషన్‌ కళాశాలలు లేనట్లు గుర్తించిన అధికారులు.. వచ్చే ఏడాది ఏర్పాటుకు హడావుడి చేస్తున్నారు. సదుపాయాలు కల్పించకుండా ఇంటర్మీడియట్‌ విద్యను ప్రారంభించడం.. ఆ తర్వాత విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేయడం ఈ ప్రభుత్వానికి సర్వసాధారణమైంది.

రెగ్యులర్‌ అధ్యాపకులే కరవు..

జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు హడావుడి చేస్తున్న ప్రభుత్వం వీటిలో బోధించేందుకు రెగ్యులర్‌ అధ్యాపకులను మాత్రం నియమించడం లేదు. హైస్కూల్‌ ప్లస్‌లో స్కూల్‌ అసిస్టెంట్లకు ఒక ఇంక్రిమెంట్‌ ఇచ్చి నియమించింది. రెగ్యులర్‌  లెక్చరర్లుగా క్రమబద్ధీకరించాలని వారు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయే మండలానికో కో-ఎడ్యుకేషన్‌ కళాశాలలకూ స్కూల్‌ అసిస్టెంట్లనే నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. రెగ్యులర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 84 చోట్ల అధ్యాపక పోస్టులే లేవు. కాంట్రాక్టు వారితో బోధిస్తున్నారు. ఈ పోస్టులు మంజూరు చేయాలని ఎన్ని ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం స్పందించడం లేదు. విద్యపై రూ.70వేల కోట్లు ఖర్చు చేశామని, విద్యార్థులను ప్రపంచ స్థాయిలో తీర్చుదిద్దుతున్నామని గొప్పలు చెబుతున్న జగన్‌ చేస్తున్న ఘనకార్యాలివీ.


మండలానికో బాలికల జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేయాలి. ఎక్కడైనా రెండు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలుంటే, అందులో ఒకదాన్ని బాలికల కళాశాలగా మార్చాలి.

2022లో సమీక్ష సమావేశంలో సీఎం జగన్‌


ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని