సంక్షిప్త వార్తలు (4)

రైతు ఉద్యమకారుడు శుభ్‌కరణ్‌ సింగ్‌ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు, కౌలు రైతుల సంఘం డిమాండు చేసింది.

Updated : 22 Feb 2024 04:55 IST

రైతు ఉద్యమంపై కేంద్రం తీరు సరికాదు
ఆంధ్రప్రదేశ్‌ రైతు, కౌలు రైతుల సంఘం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రైతు ఉద్యమకారుడు శుభ్‌కరణ్‌ సింగ్‌ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు, కౌలు రైతుల సంఘం డిమాండు చేసింది. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న రైతులపై కేంద్రం అనుసరిస్తున్న తీరుకు ఇది నిదర్శనమని బుధవారం ఒక ప్రకటనలో విమర్శించింది. ‘బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. స్వామినాథన్‌ సిఫారసుల ప్రకారం రైతులకు కనీస మద్దతు ధర అందించాలి’ అని కోరారు.


ఉద్యోగులు సంఘ విద్రోహ శక్తులా?
ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సతీష్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌కు ఉద్యోగులు తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల్లా కనిపిస్తున్నారా? అని ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్‌ ప్రశ్నించారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని మాటలు చెప్పే సీఎం జగన్‌ వారిని పోలీసులతో దిగ్బంధించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ను ముందస్తు అరెస్టు చేయడం ఫ్రెండ్లీ ప్రభుత్వానికి మరో మచ్చుతునక అని బుధవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. ‘ఫిబ్రవరి 18న చలో విజయవాడ ఓట్‌ ఫర్‌ ఓపీఎస్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిరంకుశంగా అడ్డుకుంది. కానీ మంగళవారం ఏపీఐకాస వారికి అనుమతిచ్చింది. ఈ ద్వంద్వ వైఖరికి ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధి చెబుతాం. ఇచ్చిన హామీ నెరవేర్చని ప్రభుత్వాన్ని ఇంటికి పంపుతాం’ అని హెచ్చరించారు.


నారీమన్‌ మృతిపై   సీఎం దిగ్భ్రాంతి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీనియర్‌ న్యాయవాది నారీమన్‌ మృతిపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.


ఏపీలో 28 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలి

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని 28 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య, ఏపీ బీసీ కమిషన్‌ సభ్యుడు ఎన్‌.మరేష్‌లు జాతీయ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ హన్స్‌రాజ్‌ జి.ఆహిర్‌ను కోరారు. వీరిద్దరూ బుధవారం ఆయన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కేంద్ర బడ్జెట్‌లో ఓబీసీల అభివృద్ధికి రూ.2లక్షల కోట్ల బడ్జెట్‌ కేటాయించి బీసీ యువతకు విద్య, ఉద్యోగావకాశాలు పెంచాలని కోరారు. ఐఐటీ, ఐఐఎం, జాతీయస్థాయి వైద్య కళాశాలల్లో ఫీజులు ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల అత్యంత వెనుకబడిన కులాలవారికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను దేశవ్యాప్తంగా అమలుచేయాలని డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని