ఎస్సై బ్యాక్‌లాగ్‌ పోస్టుల పూర్తి వివరాలు తెలపండి

ఎస్సై నియామకాల్లో బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది.

Published : 22 Feb 2024 04:32 IST

రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ, నియామక బోర్డుకు హైకోర్టు నోటీసులు

ఈనాడు, అమరావతి: ఎస్సై నియామకాల్లో బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలంటూ సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ సీఎస్‌, ఏపీ రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సై నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు చెందిన 246 బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు అనుముల వంశీకృష్ణ పిల్‌ దాఖలు చేశారు. బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున న్యాయవాది మాదాసు జయప్రకాశ్‌ వాదనలు వినిపించారు. గతంలో ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినప్పటికీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయలేదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రతివాదుల స్పందన తెలపాలని నోటీసులు జారీచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని