కొత్త ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఇచ్చేద్దాం!

సాధారణ ఎన్నికల ముందు కొత్త ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు అనుమతులు ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమవుతోంది.

Published : 22 Feb 2024 04:32 IST

ఎన్నికల ముందు అయినవారికి కట్టబెట్టే ప్రయత్నాలు
కొత్త సబ్జెక్టులు, సెక్షన్లు, కళాశాలలు ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు
నాణ్యత పాటించని 500 కళాశాలలను మూసివేయాలన్న బాలకృష్ణన్‌ కమిటీ సిఫార్సు గాలికి

ఈనాడు, అమరావతి: సాధారణ ఎన్నికల ముందు కొత్త ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు అనుమతులు ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమవుతోంది. అధికార పార్టీ నాయకులు, వారి అనుచరణ గణానికి ప్రైవేటు కళాశాలల అనుమతులు కట్టబెట్టేందుకు తెర వెనుక కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న డిగ్రీ కళాశాలల్లోనే ప్రవేశాలు సరిగా లేవు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకపోయినా చర్యలు తీసుకోని ఉన్నత విద్యామండలి ఇప్పుడు కొత్తవాటిపై మోజు చూపుతోంది. కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలకు కొత్త డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇచ్చేందుకు 2022లో ప్రయత్నాలు చేసిన మండలి దానిపై వ్యతిరేకత రావడంతో విరమించుకుంది. ఇప్పుడు ఎన్నికలకు ముందు మరోసారి కొత్త కళాశాలల నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. డిగ్రీలో కొత్తగా మరికొన్ని సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టులు, అదనపు సెక్షన్లకు అనుమతి ఇవ్వాలని భావిస్తోంది. రాష్ట్రంలో ఇప్పుడున్న డిగ్రీ కళాశాలల్లోనే సీట్లు మిగిలిపోతుండగా.. కొత్తవాటిని తీసుకొచ్చేందుకు ఉన్నత విద్యామండలి చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న కళాశాలల్లో నాణ్యమైన విద్య అందేలా చూడకుండా కొత్తవి ఇచ్చి ప్రయోజనం ఏంటని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.

కమిటీలు వద్దన్నా..

విద్యా సంస్కరణలపై వైకాపా ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఏర్పాటు చేసిన బాలకృష్ణన్‌ కమిటీ రాష్ట్రంలో నాణ్యత ప్రమాణాలు పాటించని 500 డిగ్రీ కళాశాలలను మూసివేయొచ్చని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,153 ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో చేరుతున్న వారిలో 40 శాతం మంది ఫైనల్‌ పరీక్షలు రాయడం లేదని, 30 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారని వెల్లడించింది. 71% ప్రైవేటు కళాశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని పేర్కొంది. 40 శాతం కళాశాలల్లో ప్రవేశాలు నాలుగో వంతు కూడా లేవని బహిర్గతం చేసింది.

రాష్ట్రంలో కొత్త కళాశాలలకు అనుమతులు ఇవ్వొద్దని 2018-19లో ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసిన సర్వే కమిటీ సైతం వెల్లడించింది.

సీట్ల భర్తీలోనూ..: ఈ ఏడాది అన్ని కళాశాలల్లో కలిపి కన్వీనర్‌, ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 3.74 లక్షల సీట్లు ఉంటే 1.55 లక్షలే భర్తీ అయ్యాయి. మొదటి విడతలో 16 కళాశాలల్లో ఒక్కరూ చేరలేదు. డిగ్రీ ప్రవేశాలకు ఆదరణ తగ్గుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. నాలుగేళ్ల డిగ్రీ, సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానం ప్రవేశపెట్టడంతో ఎక్కువ మంది విద్యార్థులు బీటెక్‌లాంటి సాంకేతిక విద్య కోర్సులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరికొందరు ఇతర రాష్ట్రాల్లో ప్రవేశాలు తీసుకుంటున్నారు.

  • ఒకపక్క ప్రభుత్వం నియోజకవర్గానికో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. మరోవైపు కొత్తగా ప్రైవేటు కళాశాలలు కూడా వస్తే విద్యార్థుల ప్రవేశాలు ఎక్కడి నుంచి వస్తాయి? వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా నాలుగు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతులిచ్చింది. వీటిలోనూ సాధారణ డిగ్రీలు ప్రవేశపెడుతున్నారు.  
  • ఉన్నత విద్యలో స్థూల ప్రవేశాల నిష్పత్తి (జీఈఆర్‌) తగ్గినట్లు ఇటీవల అఖిల భారత ఉన్నత విద్య సర్వే (ఏఐఎస్‌హెచ్‌ఈ) వెల్లడించింది. 2020-21లో స్థూల ప్రవేశాల నిష్పత్తి 37.2 శాతం ఉండగా.. 2021-22కి 36.5 శాతానికి తగ్గిందని పేర్కొంది. అబ్బాయిల ప్రవేశాలు 0.6%, అమ్మాయిల అడ్మిషన్లు 0.8% తగ్గాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని