డీఎస్సీ జాప్యానికే గందరగోళం సృష్టిస్తున్నారా?

ఎన్నికలకు ముందు డీఎస్సీ ప్రకటించిన ప్రభుత్వం ఆ ఉపాధ్యాయ నియామకాలు సైతం జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

Published : 22 Feb 2024 04:33 IST

ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారికి అవకాశం లేదంటూ జీఓ-4 జారీ
ఆ తర్వాత అనుమతిస్తూ సవరణ మెమో
రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్వేచ్ఛ ఇచ్చిందంటూ కమిషనర్‌ కొత్త భాష్యం
బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమంటూ తాజాగా హైకోర్టుకు నివేదన

ఈనాడు, అమరావతి: ఎన్నికలకు ముందు డీఎస్సీ ప్రకటించిన ప్రభుత్వం ఆ ఉపాధ్యాయ నియామకాలు సైతం జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. జీఓలను తరచూ సవరిస్తూ గందరగోళం సృష్టిస్తోంది. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ) పోస్టులకు బీఈడీ చేసిన వారు అనర్హులంటూ జనవరి 26న ప్రభుత్వమే జీఓ-4 ఇచ్చింది. ఆ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చే సమయానికి దీన్ని సవరిస్తూ మెమో జారీ చేసింది. ఈ విరుద్ధమైన నిర్ణయాలను చూస్తుంటే ప్రభుత్వమే నియామకాలను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారు అనర్హులని రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ విషయం ప్రభుత్వానికి తెలుసు. జీఓ-4లోనూ సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించింది. ఆ తర్వాత నోటిఫికేషన్‌కు మాత్రం బీఈడీ వారిని అనుమతిస్తూ సవరణ ఆదేశాలు జారీ చేసింది. ‘సుప్రీంకోర్టు తీర్పు రాజస్థాన్‌ రాష్ట్రానికే వర్తిస్తుంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారికి అర్హత కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్వేచ్ఛనిచ్చింది. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు దీనిపై నిర్ణయం తీసుకున్నాం’ అని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఈనెల 12న విలేకర్ల సమావేశంలో తెలిపారు. డీఎస్సీ-2018లో పాటించిన నిబంధనలే పాటిస్తున్నామన్నారు. డీఎస్సీ-2018 తర్వాత రిజర్వేషన్‌ రోస్టర్‌ మారింది.. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసినవారికి అర్హత లేదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇవి పట్టించుకోకుండా అన్నింటికీ సొంత భాష్యం చెబుతూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. హైకోర్టుకు మాత్రం ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారిని అనుమతించమని, అనుమతిస్తూ ఇచ్చిన నిబంధనపై స్టే ఇవ్వండని ప్రభుత్వమే చెప్పింది.

రిజర్వేషన్‌ రోస్టర్‌..

రిజర్వేషన్‌ రోస్టర్‌పై సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, క్రీడా కోటాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు 2న జీఓ-77 జారీ చేసింది. ఇందులో వీరికి హారిజాంటల్‌ రిజర్వేషన్‌ పాటించాలని, సమాంతర రోస్టర్‌ పాయింట్లు ఇవ్వకూడదని సూచించింది. కానీ, డీఎస్సీలో ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ), పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ), ప్రిన్సిపల్‌ పోస్టులకు సమాంతర రోస్టర్‌ పాయింట్లు ఇచ్చారు. విచిత్రమేమిటంటే జీఓ-77లో హారిజాంటల్‌ అని ఉంటే.. పాఠశాల విద్యాశాఖ మాత్రం మహిళ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, క్రీడా కోటాకు రోస్టర్‌ పాయింట్లు ఉన్నాయంటూ ప్రకటన విడుదల చేసింది. రిజర్వేషన్‌ రోస్టర్‌లోనూ అయోమయం సృష్టించి, న్యాయ వివాదాలు తలెత్తేలా ప్రభుత్వమే ప్రయత్నిస్తున్నట్లు ఉందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

పీజీటీకి టెట్‌ మార్కులట..

డీఎస్సీ దరఖాస్తుకు పీజీటీ అభ్యర్థులు సైతం టెట్‌ మార్కులు నమోదు చేయాలనే ఐచ్ఛికాన్ని పెట్టారు. పీజీటీలకు టెట్‌ లేనప్పుడు మార్కులు ఎక్కడి నుంచి వస్తాయి. టెట్‌ మార్కులు నమోదు చేయకపోతే దరఖాస్తు తీసుకోవడంలేదు.

డీఎస్సీ దరఖాస్తు గడువు పొడిగింపు

డీఎస్సీ దరఖాస్తు గడువును ఈనెల 25వ తేదీ రాత్రి 12గంటల వరకు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఫీజు చెల్లింపునకు గడువు బుధవారంతో ముగియగా.. దీన్ని మూడు రోజులు పొడిగించింది. ఇప్పటి వరకు టెట్‌కు 3,17,950, డీఎస్సీకి 3,19,176 దరఖాస్తులు వచ్చాయి.

స్థానికేతర అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకున్న సమయంలోనే స్థానికేతర ఐచ్ఛికం ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అభ్యర్థులు అప్పుడే నమోదు చేసుకోవచ్చని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని