సమ్మక్క దర్శనం.. భక్తజన పరవశం!

మహా జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తమ ఇలవేల్పు సమ్మక్క గద్దెపై కొలువుదీరడంతో మేడారం మురిసిపోయింది.

Updated : 23 Feb 2024 06:40 IST

కుంకుమ భరిణె రూపంలో గద్దెపైకి వనదేవత
జనసంద్రంగా మేడారం
నేడు అమ్మవారిని దర్శించుకోనున్న గవర్నర్‌, సీఎం

మేడారం, న్యూస్‌టుడే: మహా జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తమ ఇలవేల్పు సమ్మక్క గద్దెపై కొలువుదీరడంతో మేడారం మురిసిపోయింది. చిలకలగుట్ట మీద నుంచి కుంకుమ భరిణె రూపంలో అమ్మను ఆదివాసీ పూజారులు తీసుకొచ్చే ఘట్టం ఆద్యంతం ఉద్విగ్నభరితంగా సాగింది. ఇప్పటికే సారలమ్మ సహా వనదేవతలంతా కొలువుదీరి ఉండడం, భక్తులు పెద్దమ్మగా కొలిచే సమ్మక్క కూడా గద్దెపైకి చేరడంతో జాతరకు నిండుదనం వచ్చింది.

మూడుసార్లు కాల్పులతో ఘన స్వాగతం

సమ్మక్క ఆగమన ఘట్టం గురువారం మొత్తం కొనసాగింది. తెల్లవారుజామునే మేడారానికి సమీపంలోని పడిగాపూర్‌ సమీపంలోని అడవికి వెళ్లిన పూజారులు వెదురువనాన్ని ఊరేగింపుగా గద్దెల వద్దకు చేర్చారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పూజారులు సిద్ధబోయిన మునీందర్‌, మహేశ్‌, లక్ష్మయ్య, జగ్గారావు, వడ్డె కొక్కెర కృష్ణయ్య తదితరులు చిలకలగుట్టపైకి వెళ్లి రహస్య పూజలు నిర్వహించారు. చిలకలగుట్ట మీద నుంచి కిందికి వచ్చే సమయంలోనే సమ్మక్కను దర్శించుకునేందుకు తండోపతండాలుగా జనం తరలివచ్చారు. ఆ తల్లి రాక కోసం వేయి కళ్లతో వేచి చూశారు. మంత్రి సీతక్క, దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, కలెక్టర్‌ త్రిపాఠి, అదనపు కలెక్టర్‌ శ్రీజ, ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ అర్రెం లచ్చుపటేల్‌, ఎస్పీ శబరీశ్‌తోపాటు ముఖ్య అధికారులు, నిర్వహణ కమిటీ సభ్యులు సాయంత్రం నాలుగు గంటల నుంచే గుట్ట కింద వేచి ఉన్నారు. సాయంత్రం పూజాక్రతువులు పూర్తయ్యాక 6.51 గంటలకు పూజారులు గుట్ట దిగుతుండగా ఎస్పీ శబరీశ్‌ గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కకు వైభవంగా స్వాగతం పలికారు. అమ్మవారి ఊరేగింపు గుట్ట దిగిన తర్వాత మరోసారి గాల్లోకి కాల్పులు జరిపారు.

అందమైన ముగ్గుల మధ్య అమ్మవారి ఊరేగింపు

చిలకలగుట్ట కింద నుంచి గద్దెల వరకు దారి పొడవునా భక్తులు వేసిన అందమైన ముగ్గుల మధ్య అమ్మవారి ఊరేగింపు కొనసాగింది. చెలపెయ్య చెట్టు వద్దనున్న పూజా మందిరంలో ఊరేగింపును ఆపి అమ్మవారికి కాసేపు విశ్రాంతినిచ్చారు. ఆ సమయంలో మరోసారి ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించాక మళ్లీ మొదలైన ఊరేగింపు మేడారం గద్దెల వరకూ కొనసాగింది. ఈ క్రమంలో దారికి ఇరువైపులా వేలాదిగా బారులుదీరిన భక్తులు ‘జై సమ్మక్క’ అంటూ జయజయధ్వానాలు చేశారు. ఎదురుకోళ్లు సమర్పిస్తూ నిండు కుండలతో నీళ్లారబోస్తూ హారతులు పట్టారు. పూజారులు గద్దెల వద్దకు చేరుకునే ముందు క్యూలైన్‌లను నిలిపేశారు. రాత్రి 9.23 గంటల సమయంలో డోలీ వాయిద్యాలతో జాతర ప్రాంగణమంతా దద్దరిల్లుతుండగా..భక్తి పారవశ్యంలో మహిళలు నృత్యాలు చేస్తుండగా పుణ్యఘడియల్లో సమ్మక్క అమ్మవారిని పూజారులు గద్దెపైన ప్రతిష్ఠించారు.


నేడు మేడారానికి గవర్నర్‌, ముఖ్యమంత్రి రాక

ఈనాడు, హనుమకొండ: గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం మేడారం జాతరకు వస్తారని మంత్రి సీతక్క తెలిపారు. ఉదయం 10 గంటలకు గవర్నర్‌, మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి గద్దెలను దర్శించుకుంటారని వెల్లడించారు. కేంద్ర మంత్రి అర్జున్‌ముండా కూడా గద్దెల దర్శనానికి వస్తారన్నారు. రేవంత్‌రెడ్డి గత సంవత్సరం ఫిబ్రవరిలో పీసీసీ అధ్యక్షుని హోదాలో మేడారం విచ్చేసి తల్లులను దర్శించుకున్నారు. ఇక్కణ్నుంచే ‘హాథ్‌ సే..హాథ్‌ జోడో’ యాత్ర ప్రారంభించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో రానున్నారు. ప్రముఖుల రాక దృష్ట్యా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

భారాస అధినేత కేసీఆర్‌ శుభాకాంక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల పూజలందుకుంటున్న సమ్మక్క, సారలమ్మ జాతరను పురస్కరించుకుని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ సాధన ఉద్యమంలో సమ్మక్క, సారలమ్మలు అందించిన స్ఫూర్తి ఇమిడి ఉందని ఆయన పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని