‘కలెక్టర్లూ..’ ఇంతలా దిగజారిపోవాలా?

‘ముఖ్య’ నేత సోదరుడు, ప్రభుత్వ సలహాదారు ఒకరు, ఎన్నికలపై సర్వేలు నిర్వహించే ఓ వ్యక్తి, గతంలో కార్పొరేట్‌ సంస్థకు ఏపీ ప్రతినిధిగా వ్యవహరించిన గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి..రాష్ట్రంలో ఇసుక మాఫియాను నడిపిస్తున్నది ఈ నలుగురే.

Published : 23 Feb 2024 05:21 IST

‘ముఖ్య’ నేత సోదరుడు, మరో ముగ్గురికి తలొగ్గడమేనా?
ఇసుక తవ్వకాల్లేవంటూ 20 జిల్లాల కలెక్టర్ల నివేదిక
ఎన్జీటీ ముందు అడ్డంగా దొరకడంతో పోయిన పరువు
గుత్తేదారుకు శిక్ష ఖాయమని ఎన్జీటీ చెప్పినా ఆగని దందా
గురువారమూ రాష్ట్ర వ్యాప్తంగా తవ్వకాలు

ఈనాడు, అమరావతి: ‘ముఖ్య’ నేత సోదరుడు, ప్రభుత్వ సలహాదారు ఒకరు, ఎన్నికలపై సర్వేలు నిర్వహించే ఓ వ్యక్తి, గతంలో కార్పొరేట్‌ సంస్థకు ఏపీ ప్రతినిధిగా వ్యవహరించిన గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి..రాష్ట్రంలో ఇసుక మాఫియాను నడిపిస్తున్నది ఈ నలుగురే. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీలను లెక్క చేయకుండా భారీ దోపిడీకి పాల్పడుతున్నది వీరే. అందుకే కళ్లెదుటే ఇసుక తవ్వకాలు జరుగుతున్నా సరే, అడ్డుకునే ప్రయత్నం చేయకుండా కలెక్టర్లు వణికిపోతున్నారు. కనీసం ‘తవ్వకాలు నిజమే’ అని అంగీకరించేందుకూ భయపడిపోతున్నారు. నేరుగా ‘ముఖ్య’నేత ఆగ్రహానికి గురవుతామని ఆందోళన చెందుతున్నారు. అందుకే ఏకంగా 20 జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలో ఇసుక తవ్వకాలు జరగలేదని, తమ పరిశీలనలో అవేవీ కనిపించలేదంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)కు నివేదిక ఇచ్చారు. ముఖ్య నేత సోదరుడితో పాటు నలుగురితో కూడిన ఇసుక మాఫియా బృందం సూచించినట్లే ఇసుక తవ్వకాల్లేని రీచ్‌లనే కలెక్టర్లు పరిశీలించి, తవ్వకాల్లేవంటూ నివేదిక ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. కానీ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (ఎంవోఈఎఫ్‌)కు చెందిన అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేసి ఇసుక దోపిడీ నిజమని తేల్చారు. దీంతో కలెక్టర్ల నివేదికలపై ఎన్జీటీ ఆశ్చర్యపోయింది. కలెక్టర్లు మరీ ఇంతలా ఎందుకు దిగజారిపోయారు? ప్రభుత్వ తాబేదార్లుగా ఎందుకు మారిపోయారు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బుధవారం ఎన్జీటీ తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ.. గురువారం కూడా తవ్వకాలు యథవిధిగా కొనసాగాయి.

తవ్వకాల్లేని చోట తనిఖీలా?

జిల్లా పాలనా వ్యవహారాలతో యంత్రాంగానికి మార్గనిర్దేశకులుగా నిలవాల్సిన కలెక్టర్లు.. ఇసుక మాఫియాకు జీ హుజూర్‌ అంటున్నారు. అక్రమ తవ్వకాల్లేవంటూ ఎన్జీటీకి తప్పుడు నివేదికలు ఇచ్చి.. పరువు పోగొట్టుకున్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, వైయస్‌ఆర్‌, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల జిల్లాల కలెక్టర్లు ఇటీవల తమ జిల్లాల్లో రీచ్‌లను పరిశీలించారు. ఏ రీచ్‌లలో పెద్దఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయో తెలిసినప్పటికీ.. వీరంతా వాటి జోలికి వెళ్లలేదు. అసలు తవ్వకాల్లేని చోట తనిఖీలు చేశారు. ఎక్కడా తవ్వకాల్లేవంటూ నివేదికలిచ్చి చేతులు దులిపేసుకున్నారు. కానీ, నిప్పులాంటి నిజం ఎంవోఈఎఫ్‌ రూపంలో బయటపడింది. ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది? ఇసుక మాఫియాకు, గుత్తేదారుకు రాష్ట్ర ప్రభుత్వం, గనుల శాఖ ఎలా సహకరిస్తోందో వీరి నివేదిక కళ్లకు కట్టింది. కేవలం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని తనిఖీలతోనే ఎంవోఈఎఫ్‌ ఇసుక దోపిడీని నిగ్గుతేల్చింది. ఈ బృందం మిగిలిన జిల్లాలకూ వెళ్తే.. అక్కడి అధికారుల బండారం బయటపడనుంది.

నమ్మకం కోల్పోయేలా చేశారు!

ఎక్కడా ఇసుక తవ్వకాలు లేవంటూ కలెక్టర్లు ఇచ్చిన నివేదికతో షాక్‌కు గురైన ఎన్జీటీ.. ఇక వారితో తనిఖీలు చేయించడం వృథా అన్న నిర్ణయానికి వచ్చింది. అందుకే ఎంవోఈఎఫ్‌ ద్వారానే పరిశీలింపజేయాలని నిర్ణయించింది. ఈ శాఖ ఇప్పటికే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పరిశీలించి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో.. మిగిలిన జిల్లాల్లోనూ ఆ శాఖకు చెందిన కమిటీయే తనిఖీ చేసి నివేదిక రూపొందించాలని, దానిని నేరుగా సుప్రీంకోర్టు ముందుంచాలని ఎన్జీటీ ఆదేశించింది. అంటే మన కలెక్టర్లను నమ్మే పరిస్థితి లేదని ఎన్జీటీ నిర్ధారణకొచ్చినట్లు అయ్యింది.

శాటిలైట్‌ చిత్రాలతోనూ పట్టేశారు

ఇప్పుడే కాదు, 2021 నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ ఎంవోఈఎఫ్‌ కమిటీ తేల్చింది. గూగుల్‌ ఎర్త్‌లోని శాటిలైట్‌ చిత్రాలను పరిశీలించి, ఎక్కడెక్కడ తవ్వారు? లీజు పరిధి దాటి ఎలా తవ్వేశారో గుర్తించింది. ఎన్జీటీకి ఇచ్చిన నివేదికలో ఈ విషయాలను ప్రస్తావించింది. ఇలా ఎంవోఈఎఫ్‌ అధికారులు ప్రణాళిక ప్రకారం పరిశీలించి, అన్నింటినీ విశ్లేషించి నివేదిక ఇస్తే.. కలెక్టర్లు మాత్రం కావాలనే, మొక్కుబడి తనిఖీలతో మమ అనిపించారు. 2021 నుంచి ఎన్ని రీచ్‌లకు అనుమతులు ఇచ్చారు? వాటి పేర్లేంటి? విస్తీర్ణమెంత? అందులో ఎంత పరిమాణంలో తవ్వకాలకు అనుమతించారు అనే వివరాలు ఎంవోఈఎఫ్‌ అడిగితే.. గనుల శాఖ ఏవీ ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేసింది. రాష్ట్రంలో ఇసుక దోపిడీకి కర్త, కర్మ, క్రియ అన్నీ గనుల శాఖే. అందుకే కేంద్ర ప్రభుత్వ విభాగాలు అడిగినప్పటికీ రీచ్‌ల వివరాలు ఇవ్వకుండా గోప్యంగా ఉంచింది.


తవ్వుతాం.. ఆపే దమ్ముందా?

ఇసుక అక్రమ తవ్వకాలపై బుధవారం ఎన్జీటీలో విచారణ జరిగింది. దోపిడీ నిజమని ట్రైబ్యునల్‌ తేల్చింది. గుత్తేదారు శిక్షార్హులని కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు దీనిపై నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. అయినాసరే ముఖ్య నేత సోదరుడు, అతని మాఫియాలో కించిత్‌ భయం లేదు. మమ్మల్ని ఆపేదెవరు అన్నట్లుగా గురువారం కూడా భారీ యంత్రాలతో ఇసుక తవ్వి, వందల లారీల్లో తరలించారు. గురువారం తేదీతోనే వే బిల్లులు జారీ చేశారు. శ్రీకాకుళం, ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, చిత్తూరు, వైయస్‌ఆర్‌ తదితర జిల్లాల్లో గురువారం ఇసుక తవ్వకాలు యథావిధిగా సాగాయి. అక్రమ తవ్వకాల ద్వారా వస్తున్న సొమ్మంతా నిత్యం హైదరాబాద్‌కు చేరేలా ముఖ్య నేత సోదరుడు ఏర్పాట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని