సార్వత్రిక ఎన్నికల వేళ.. సీఎం కోసం రెండు కొత్త హెలికాప్టర్లు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు సరికొత్త హెలికాప్టర్లను సమకూర్చుకుంటోంది.

Published : 23 Feb 2024 04:08 IST

జగన్‌ పర్యటనలకు విజయవాడలో ఒకటి, విశాఖపట్నంలో మరొకటి
వామపక్ష తీవ్రవాదులు, ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నందునేనట!
రెండు హెలికాప్టర్లకు నెల అద్దె రూ.3.85 కోట్లు, ఇతర ఖర్చులు అదనం
ఎన్నికల ప్రచారం కోసమేనని ప్రతిపక్షాల విమర్శ

ఈనాడు, అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు సరికొత్త హెలికాప్టర్లను సమకూర్చుకుంటోంది. వీటిలో ఒకటి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో, మరొకటి విశాఖపట్నం విమానాశ్రయంలో అందుబాటులో ఉంచనుంది. గ్లోబల్‌ వెక్ట్రా సంస్థ నుంచి అద్దె ప్రాతిపదికన రెండు ట్విన్‌ ఇంజిన్‌ హెలికాప్టర్లను తీసుకుంటోంది. ఒక్కోదానికి రూ.1,91,75,000 చొప్పున రెండింటికీ కలిపి నెలకు రూ.3,83,50,000 అద్దె చెల్లించనుంది. సీఎంగా జగన్‌ పదవీకాలం మే నెలాఖరు వరకు ఉంది. అంటే ఈ మూడు నెలలకు హెలికాప్టర్ల అద్దెకే కేవలం రూ.11.50 కోట్లు ఖర్చవుతుంది. ఇవి కాకుండా గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ ఛార్జీలు, పైలట్లకు స్టార్‌ హోటళ్లలో బస, పైలట్లు, సాంకేతిక సిబ్బందికి రవాణా ఛార్జీలు, ఇంధన రవాణా ఛార్జీలు, హెలికాప్టర్‌ సిబ్బంది మెడికల్‌ ఖర్చులు, ఏటీసీ ఛార్జీలు వంటివి అదనంగా చెల్లించనుంది. హెలికాప్టర్లు సమకూర్చుకునేందుకు అనుమతిస్తూ పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

జగన్‌ భద్రతకు ముప్పు ఉందట.. అందుకే కొత్త హెలికాప్టర్లట

‘ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జెడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రతలో ఉన్నారు. ఆయనకు వామపక్ష తీవ్రవాదులు, ఉగ్రవాదులు, వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు, అసాంఘిక శక్తుల నుంచి ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం భద్రత ఏర్పాట్ల పట్ల అత్యంత సున్నితంగా వ్యవహరించాలి. ముఖ్యమంత్రి పర్యటనల కోసం ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ ఏవియేషన్‌ కార్పొరేషన్‌ 2010 నుంచి బెల్‌ 412 వీటీ-ఎంఆర్‌వీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను వినియోగిస్తోంది. హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి పర్యటనలు పెరగటం, దానిలో ఎక్కువ దూరాలు ప్రయాణిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతమున్న హెలికాప్టర్‌ స్థానంలో కొత్తవి సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ నిఘా విభాగం డీజీపీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీంతో పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ టెండర్లు పిలిచి ఈ రెండు హెలికాప్టర్లను అద్దె ప్రాతిపదికన సమకూర్చుకుంది. వీటిని సీఎంతో పాటు ఇతర వీవీఐపీల పర్యటనలకూ వినియోగిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారం కోసమేనా?

మరో 10, 15 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. రెండు నెలల్లోగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భద్రత ముసుగులో ప్రభుత్వ ఖర్చుతో కొత్త హెలికాప్టర్లు సమకూర్చుకుని, ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించేందుకు వినియోగించుకోబోతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

భద్రత పేరిట ఇప్పటికే అత్యుత్సాహం

ముఖ్యమంత్రికి అవసరమైన భద్రత ఏర్పాటు చేయటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ఏపీ పోలీసులు సీఎం భద్రత పేరిట అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన భార్య, పిల్లలు, తల్లికి దేశ, విదేశాల్లో సైతం అత్యంత సమీపం నుంచి భద్రత (ప్రాక్స్‌మేట్‌ సెక్యూరిటీ) కల్పించేందుకు స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూపు (ఎస్‌ఎస్‌జీ)ని ఏర్పాటు చేస్తూ ఏకంగా ప్రత్యేక చట్టమే చేశారు. ఆయన ఎక్కడున్నా ఎస్‌ఎస్‌జీ పూర్తి భద్రత కల్పిస్తుంది. ఎస్‌ఎస్‌జీ గ్రూపులోని సభ్యులు విధి నిర్వహణలో భాగంగా చేపట్టే పనులకు న్యాయపరమైన రక్షణ (లీగల్‌ ఇమ్యూనిటీ) కూడా చట్టంలో కల్పించారు. మరోవైపు జగన్‌ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుంటే రోడ్లపైన ట్రాఫిక్‌ నిలిపేసిన ఉదంతాలున్నాయి. ఆయన జిల్లాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటుంటే.. అక్కడి జాతీయ రహదారులపై సైతం వాహనాలను గంటల తరబడి ఆపేస్తున్నారు. సీఎం ఎక్కడికైనా వస్తున్నారంటే.. అక్కడి చెట్లన్నీ నరికేస్తున్నారు.

ఆయన పర్యటన ఉందంటే చాలు రెండు, మూడు రోజుల ముందు నుంచే ఆ ప్రాంతంలోని దుకాణాలు, వ్యాపారాలన్నింటినీ బలవంతంగా మూసేయిస్తున్నారు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రజా సమస్యలపై గొంతెత్తేవారిని ముందుగానే అరెస్టులు, గృహనిర్బంధాలు చేస్తున్నారు. భద్రత కోసం ఇంత హంగామా చేస్తూ.. ఇప్పుడు మళ్లీ ఆయనకు ముప్పు ఉందంటూ ప్రజాధనాన్ని వెచ్చించి హెలికాప్టర్లు సమకూర్చుకోవటంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ‘అసలు రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదమే లేదని డీజీపీ నుంచి ఎస్పీల వరకూ పదే పదే ప్రకటిస్తున్నారు. ఉగ్రవాదుల కదలికలు మన రాష్ట్రంలో లేనే లేవు. అయినా సరే వారి నుంచి ముప్పు ఉందంటూ రూ.కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి హెలికాప్టర్లు అద్దెకు తీసుకోవడమేంటి?’ అని నిలదీస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని