ఏపీపీఎస్సీనా? వైసీపీఎస్సీనా?

ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ఓ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసింది జగన్‌ సర్కారు. వైకాపాలో పని చేయడం, ఆ పార్టీతో అంటకాగడం, సీఎం జగన్‌తో బంధుత్వం ఉండటం.. వీటినే అర్హతలుగా కమిషన్‌ సభ్యత్వ పదవులు కట్టబెట్టారు.

Updated : 23 Feb 2024 13:20 IST

రాజకీయ పునరావాస కేంద్రంగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌
వైకాపాతో అంటకాగిన వారికే పదవులు
సభ్యుల భర్తీలో ఉత్తరాంధ్రకు మొండిచేయి
రాజ్యాంగబద్ధ సంస్థలో సమ ప్రాతినిధ్యానికి సమాధి
ఈనాడు, అమరావతి

సలాంబాబు.. వైకాపా యువజన విభాగం మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ జీవీ సుధాకర్‌రెడ్డి.. వైకాపాలో పనిచేసిన నాయకుడు పి.సుధీర్‌.. జగన్‌కు దగ్గరి బంధువు.. ఆ కమిషన్‌లోని మరికొందరిదీ ఇలాంటి నేపథ్యమే... అదేదో వైకాపాకు సంబంధించిన కమిషన్‌ అనుకునేరు.. కానే కాదు.. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌.. అక్కడ వీరికెలా చోటు దక్కిందంటారా.. జగన్‌ పార్టీలో వర్క్‌ చేశారు.. అదే సోషల్‌ వర్క్‌ అనీ.. అంతకంటే అర్హతేం కావాలనీ.. సభ్యులుగా నియమించారు. అలా ఏపీపీఎస్సీని కాస్త ‘వైసీపీఎస్సీ’గా మార్చేశారు!

ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ఓ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసింది జగన్‌ సర్కారు. వైకాపాలో పని చేయడం, ఆ పార్టీతో అంటకాగడం, సీఎం జగన్‌తో బంధుత్వం ఉండటం.. వీటినే అర్హతలుగా కమిషన్‌ సభ్యత్వ పదవులు కట్టబెట్టారు. ప్రస్తుతం ఉన్న ఎనిమిది మంది సభ్యుల్లో ఆరుగురికి అసలు ఉద్యోగ నియామకాలపై అవగాహనే లేదు. ప్రభుత్వ విభాగాల్లో పని చేసిన అనుభవమూ లేదు. గ్రూపు-1, 2లాంటి ముఖ్యమైన పోస్టులు భర్తీ చేసే ఏపీపీఎస్సీకి ఇలాంటి దుస్థితి కల్పించారు. తొలుత గ్రూపు-1 నియామకాలకు మౌఖిక పరీక్షలు (ఇంటర్వ్యూలు) ఉండవని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం మళ్లీ పాత విధానాన్నే అమలుచేస్తోంది. దీంతో సభ్యులకు డిమాండ్‌ పెరిగింది.

ఉత్తరాంధ్రకు అన్యాయం

కమిషన్‌లో ఛైర్మన్‌ కాకుండా ఎనిమిది మంది సభ్యులు ఉంటే ఇందులో కడప, కర్నూలు జిల్లాలకు చెందిన వారు ఇద్దరేసి చొప్పున ఉండగా.. నంద్యాల, అనంతపురం, గుంటూరు, కాకినాడ జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తానేదో పేటెంట్‌ తీసుకున్నట్లు గొప్పలు చెప్పే సీఎం జగన్‌ వాస్తవంలో ఆ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తున్నారు. బీసీలు అధికంగా ఉండే ఆ ప్రాంతానికి చెందిన విద్యావేత్తలకు ఉద్యోగ నియామక కమిషన్‌ పదవుల్లో ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారు. పెత్తందారీ పోకడలతో ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తూనే మరోపక్క వారిపై ప్రేమ నటించడం జగన్‌కే చెల్లింది. రాష్ట్రంలో 18కిపైగా విశ్వవిద్యాలయాలు ఉంటే ఒక్క వర్సిటీకి కూడా ఉపకులపతిగా ఆ ప్రాంతానికి చెందిన వారిని నియమించలేదు. విచిత్రమేమిటంటే ఆ ప్రాంతంలోని వర్సిటీలకు సైతం ఇతర ప్రాంతాల వారినే వీసీలుగా నియమించారు. ఉద్యోగ నియామకాల్లో కీలకమైన ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ)కి ఒక్క సభ్యుడిని సైతం ఆ ప్రాంతం నుంచి నియమించేందుకు జగన్‌కు చేతులు రాలేదు. ఇదేనా ఉత్తరాంధ్ర అభివృద్ధిమీద, అక్కడి ప్రజలపైనా జగన్‌కు ఉన్న ప్రేమంటే? ఇదేనా ఆ ప్రాంతానికి చేసే సముచిత న్యాయం?

నియామకాలపై అవగాహన తక్కువే..

కమిషన్‌ నిర్వహించే నియామకాలు తక్కువగా ఉండగా... సభ్యుల నియామకాలు మాత్రం చకాచకా జరిగిపోతున్నాయి. వీరిలో కార్యాలయానికి వచ్చే వారు తక్కువే. నెలకోసారి జరిగే కమిషన్‌ సమావేశంలో మాత్రమే సభ్యులు మెరుస్తున్నారు. పలువురు సభ్యులకు ఉద్యోగ నియామకాల గురించి ఏ మాత్రం అవగాహన లేదు. ప్రభుత్వ సర్వీస్‌ వ్యవహారాల గురించి తెలిసిన వారు చాలా తక్కువ. కమిషన్‌లో తీసుకునే నిర్ణయాలకు ఆమోదం తెలుపుతూ సంతకాలు పెట్టేందుకు మాత్రమే వారు పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. వీరి కోసం పెద్ద ఛాంబర్లు, ప్రత్యేక సహాయకులు ఉన్నారు. సభ్యుల నియామకాలపై పెట్టిన శ్రద్ధ ఉద్యోగాల భర్తీపై సీఎం జగన్‌ పెట్టడం లేదు. ఏపీపీఎస్సీ ద్వారా ఏటా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న జగన్‌ సర్కారు ఆచరణలో దారుణంగా విఫలమైంది. కమిషన్‌ నుంచి గడిచిన నాలుగున్నరేళ్లలో కేవలం 2,210 పోస్టుల భర్తీ కోసం 33 నోటిఫికేషన్లు మాత్రమే వెలువడ్డాయి. ఇందులో సగం వరకు గత ప్రభుత్వ హయాంలో మంజూరైనవే.

వైకాపాతో ఉన్నవారే అధికం..

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా 2022 ఫిబ్రవరి 19న మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ప్రభుత్వం నియమించింది. దీనికంటే ముందు నుంచే సభ్యుల నియామకం చేపట్టింది. ఎనిమిది మంది సభ్యుల్లో ఐదుగురిని ‘సోషల్‌ వర్కర్‌’ కేటగిరీలో నియమించగా.. ముగ్గురికి ఇన్‌సర్వీస్‌ కేటగిరీలో అవకాశాన్ని కల్పించింది. కమిషన్‌లో సభ్యులుగా ఉండే వారికి ప్రిన్సిపల్‌ సెక్రటరీ హోదాలో ప్రొటోకాల్‌ ఉంటుంది.  ఒక్కొక్కరికి వేతనం రూ.2 లక్షలకుపైనే. ఈ హోదాలో ప్రభుత్వపరంగా వచ్చే సదుపాయాల గురించి ఆలోచించే వారే సభ్యుల్లో ఎక్కువగా ఉన్నట్లు విమర్శలున్నాయి.


సభ్యుల నేపథ్యం ఇదీ..

సలాం బాబు: కడప జిల్లా సీకేదిన్నె మండలం అంగడివీధికి చెందిన ఈయన వైకాపా యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. వైకాపాకు పని చేసినందుకు అధికారంలోకి రాగానే జగన్‌ ఆయన్ని ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమించి, రుణం తీర్చుకున్నారు.

సీవీ శంకర్‌రెడ్డి: కడప జిల్లాకు చెందిన ఈయన కేంద్ర పర్యాటక శాఖలో పని చేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఈయన సతీమణి తెలంగాణలో ఐఏఎస్‌ అధికారిణి. సీఎం జగన్‌కు సన్నిహితులైన ఓ న్యూరాలజిస్ట్‌ సిఫార్సుతో కమిషన్‌లో స్థానం కల్పించారు. ఈయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

రమణారెడ్డి: కర్నూలు జిల్లాకు చెందిన ఈయనకు తెలంగాణలో ప్రైవేటు విద్యా సంస్థలున్నాయి. కర్నూలు జిల్లాలో గతంలో రెండు విద్యా సంస్థలు నిర్వహించారు. హైదరాబాద్‌లో స్థిరపడటంతో వాటి నిర్వహణ నుంచి వైదొలిగారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు.

పి.సుధీర్‌: సీఎం జగన్‌ తాత రాజారెడ్డి అన్న ప్రభాదాస్‌రెడ్డి మనవడు. కర్నూలు జిల్లాలో ఉంటారు.

సిద్ధం శ్రీరామ్‌: నంద్యాల సమీపంలోని బిల్లలాపురానికి చెందిన ఈయన మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. గతంలో నంద్యాల మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా, యువజన కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడిగా పని చేశారు. నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డితో ప్రస్తుతం సన్నిహితంగా ఉంటున్నారు. ఈ పరిచయాలతో ఆయన ఏపీపీఎస్సీలో సభ్యుడిగా నియమితులయ్యారు.

డాక్టర్‌ జీవీ సుధాకర్‌రెడ్డి: అనంతపురం జిల్లా తాడిపత్రికి సమీపంలోని ఊరుచింతల ఈయనది. ఎల్‌ఐసీలో డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తూ కదిరిలో స్థిరపడ్డారు. వైకాపా ఆవిర్భావంతో ఆయన ఉద్యోగం వదిలేసి ఆ పార్టీలోకి వెళ్లారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు చూసేవారు. వైకాపా అధికారంలోకి రావటంతో ఏపీపీఎస్సీ సభ్యుడిగా పదవి కట్టబెట్టింది.

బి.ఎస్‌.సెలీనా: గుంటూరుకు చెందిన ఈమె ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో అకడమిక్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. సీఎంతో సన్నిహితంగా ఉండే వారు చేసిన సిఫార్సు మేరకు ఈమె కమిషన్‌ సభ్యులయ్యారు. 

సోనీవుడ్‌: కాకినాడ జిల్లా తునిలో నాసా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్నారు. క్రైస్తవ ప్రచార సభలు సైతం నిర్వహిస్తారు. ఐపీఎస్‌ సునీల్‌ కుమార్‌ ఈయనకు మావయ్య. జగన్‌ పాదయాత్రలో ఏర్పడిన పరిచయం కమిషన్‌లో అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు