ఉత్తరాంధ్రంటే... ఉత్తదనుకుంటివా?

ఉత్తరాంధ్రకు జగన్‌ సర్కారు ఐదేళ్లలో ఉత్తి చేతులు చూపింది. ఈ ప్రాంతానికి చెందిన ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయింది.

Updated : 23 Feb 2024 07:48 IST

మూడు ఉమ్మడి జిల్లాలను నిలువునా మోసం చేసిన జగన్‌
హామీ ఇచ్చిన ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయకుండా దగా
అవసరం రూ.3,288 కోట్లయితే... ఇచ్చింది రూ.594 కోట్లే
వైకాపా ఐదేళ్ల కాలంలో వెనకబడిన ప్రాంతంపై తీవ్ర నిర్లక్ష్యం
ఈనాడు - అమరావతి

ఉత్తరాంధ్ర అంటే ఉత్తుత్తి ఆంధ్ర అనుకున్నారో... ఉత్తరాంధ్రులంటే ఉత్తర కుమారులు అనుకున్నారో... అందుకే హామీలిచ్చారు... నిధులివ్వలేదు... ఉత్తరాంధ్ర జల ప్రాజెక్టులను నీటి మూటలు చేశారు... ఏడాదిలో పూర్తి చేస్తానని ఐదేళ్లయినా చేతులెత్తేశారు... ఇప్పుడు మళ్లీ చిటికెల పందిరి వేస్తూ... ఓట్ల కోసం వస్తున్నారు... జనులారా జరభద్రం!

త్తరాంధ్రకు జగన్‌ సర్కారు ఐదేళ్లలో ఉత్తి చేతులు చూపింది. ఈ ప్రాంతానికి చెందిన ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయింది. వెనకబడిన జిల్లాలకు సాగునీటి ప్రాజెక్టులే కీలకాధారం. సాగులోకి తీసుకురావాల్సిన ఆయకట్టు ఎంతో ఉన్నా ప్రాజెక్టుల నిర్మాణాన్ని గాలికి వదిలేసింది. ఉత్తరాంధ్రపై జగన్‌ తన ప్రసంగాల్లో కురిపిస్తున్న ప్రేమ... చేతల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇక్కడి ప్రాజెక్టులకు నిధులివ్వలేదు. ఆఖరికి తొలి ఏడాదిలోనే పూర్తి చేస్తామని ఘనంగా లక్ష్యాలు విధించుకున్న వంశధార రెండో దశకు చెందిన రెండో భాగం, వంశధార-నాగావళి అనుసంధానం ప్రాజెక్టులనూ పూర్తి చేయలేదు. ఈ ప్రాంత సాగు, తాగునీటి అవసరాలను తీర్చడానికి గత తెదేపా హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు అన్నింటికీ రూ.3,288.52 కోట్లు కేటాయించాల్సిన ఉండగా... ఐదేళ్లలో రూ.594.74 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ నేపథ్యంలో అవన్నీ ఎప్పటికి పూర్తవుతాయో తెలియాని పరిస్థితి నెలకొంది.


తోటపల్లి ఎప్పటికయ్యేను సంపూర్ణం..?

ఉమ్మడి విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద నాగావళి నదిపై ఈ బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. తోటపల్లి పాత రెగ్యులేటర్‌, ఓపెన్‌ హెడ్‌ ఛానల్‌ కింద ఉన్న 64 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతోపాటు కొత్తగా 1,31,000 ఎకరాలకు నీరివ్వడం లక్ష్యం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఏడు మండలాల్లోని 132 గ్రామాలకు, ఉమ్మడి విజయనగరంలోని పది మండలాల్లో ఉన్న 155 గ్రామాలకు లబ్ధి కలుగుతుంది. కుడి కాలువ ద్వారా 42 చెరువులను నింపి 24 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. తెదేపా ప్రభుత్వ హయాంలోనే పనులు 90% పైగా పూర్తయ్యాయి. దీన్ని రెండు ప్యాకేజీలుగా విడగొట్టారు. మొదటి ప్యాకేజీలో బ్యారేజీ హెడ్‌వర్క్సుతోపాటు కుడి ప్రధాన కాలువను సున్నా కి.మీ. నుంచి 52.450 కి.మీ. వరకు తవ్వాలి. తెదేపా హయాంలోనే 77% పనులు జరిగాయి. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వంలో మిగిలిన పనుల కోసం కొత్తగా టెండర్లు పిలిచి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇందులో ఇంకా మట్టి తవ్వకం, 40 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని, అనేక కట్టడాల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది.

రెండో ప్యాకేజీలో కుడి ప్రధాన కాలువను 52.450 కి.మీ. నుంచి 117.89 కి.మీ. వరకు తవ్వాలి. డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువలను నిర్మించాలి. తెదేపా హయాంలోనే 90% పనులు పూర్తయ్యాయి. జగన్‌ వచ్చాక గుత్తేదారును తొలగించి మళ్లీ టెండర్లు పిలిచి కొత్తగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి.


వంశధార రెండో దశపై సన్నగిల్లిన ఆశలు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన ప్రాజెక్టు ఇది. వంశధార నదిపై కాట్రగడ్డ వద్ద సైడ్‌ వియర్‌ నిర్మించి వరద నీటిని హిరమండలం జలాశయానికి మళ్లించి ఆయకట్టుకు నీరు ఇవ్వాలనేది యోచన. 19.05 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో జలాశయం నిర్మిస్తున్నారు. దీని కుడికాలువ కింద 20 వేల ఎకరాలు, వరద కాలువ కింద 20 వేల ఎకరాలు, హైలెవెల్‌ కాలువ కింద 5,000 ఎకరాల ఆయకట్టుకు నీటిని ఇవ్వాల్సి ఉంది. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదిలోనే పూర్తి చేస్తామని ఘనంగా ప్రకటించిన జగన్‌... ఆయా పనులను ఇప్పటికీ కొలిక్కి తేలేకపోయారు. చాలినన్ని నిధులు ఇవ్వకపోవడం, బిల్లులను సకాలంలో చెల్లించకపోవడంతోనే పనులు ఆలస్యం అవుతున్నాయి.


గజపతినగరం బ్రాంచి కాలువ

తోటపల్లి కుడి ప్రధాన కాలువ పొడిగింపు పథకం ఇది. గజపతినగరం బ్రాంచి కాలువను 97.70 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల వరకు పొడిగించి విజయనగరం జిల్లాలోని గరివిడి, మెరకముడిదాం, గుర్ల, గజపతినగరం, దత్తిరాజేరు మండలాల్లోని 41 గ్రామాల్లో 15 వేల ఎకరాల ఆయకట్టుకు 1.912 టీఎంసీల నీటిని అందించాలనేది లక్ష్యం. జగన్‌ వచ్చాక రెండు గుత్తేదారు సంస్థలు తాము చేస్తున్న పనుల నుంచి వైదొలిగాయి. తాజాగా పనుల అంచనా వ్యయం పెరిగింది.


వంశధార-నాగావళి అనుసంధానం... 

వంశధార-నాగావళి నదులను అనుసంధానించి... వంశధార వరద జలాలను మళ్లించే పనులూ పూర్తవలేదు. శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని జలాశయం నుంచి బూర్జ మండలంలోని నారాయణపురం ఆనకట్టకు నీటిని మళ్లించాలనేది లక్ష్యం. ఇది అందుబాటులోకి వస్తే నారాయణపురం ఆనకట్ట కింద 18,527 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతోపాటు కొత్తగా నాలుగు మండలాల్లోని 5,000 ఎకరాలకు నీళ్లు అందుతాయి. రూ.145 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును జగన్‌ సర్కారు తన తొలి ఏడాదిలోనే అందుబాటులోకి తెస్తానంది. ఐదేళ్లు కరిగిపోయినా... పూర్తి చేయలేకపోయింది.


మహేంద్రతనయ రిజర్వాయర్‌ ఎప్పటికయ్యేనో?

శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలం చాప్రా గ్రామంలో మహేంద్రతనయ నదిపై 1.76 టీఎంసీల సామర్థ్యంతో ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ నిర్మించాలని నిర్ణయించారు. రూ.127 కోట్ల అంచనా వ్యయంతో దీనికి 2007లో పాలనామోదం ఇచ్చారు. జలాశయం నుంచి 1.89 టీఎంసీల నీటిని నాలుగు మండలాల్లోని 108 గ్రామాల్లో ఉన్న 24,600 ఎకరాల ఆయకట్టుకు మళ్లిస్తారు. 26 గ్రామాలకు, కాశీబుగ్గ మున్సిపాలిటీకి తాగునీటికి 0.180 టీఎంసీలను వినియోగించాలనేది ప్రణాళిక. బడ్జెట్‌ కేటాయింపుల్లో ఏకంగా రూ.425 కోట్లు చూపినా... ఖర్చు చేసింది మాత్రం చాలా స్వల్పం. దాంతో ఇప్పటికీ పనులు పూర్తవడంలేదు.


మద్దువలస రెండో దశ... ఏదీ ధ్యాస?

శ్రీకాకుళం జిల్లాలో వంగర మండలం మద్దువలస వద్ద ఈ ప్రాజెక్టు ఉంది. ఈ రిజర్వాయర్‌ కుడి ప్రధాన కాలువను విస్తరించి 12,500 ఎకరాల అదనపు ఆయకట్టుకు నీళ్లు అందించాలనేది లక్ష్యం. ఇందుకోసం 1.12 టీఎంసీల నీటిని వినియోగించుకుని జి.సిగ్ధం, పొందూరు, లావేరు, ఎచ్చెర్ల మండలాల్లోని 21 గ్రామాలకు ప్రయోజనం కల్పించాలి. సకాలంలో బిల్లులివ్వని కారణంగా పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రాలేదు. టెండర్ల ప్రక్రియ ఆలస్యమైంది. ఫలితంగా ఈ ప్రాజెక్టు పనులూ ముందుకు సాగడం లేదు.


తారకరామా... కరుణించవయ్యా...!

విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగండ్రేడు సమీపంలో చంపావతి నదిపై బ్యారేజీ నిర్మించి 16,538 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చేందుకు సారిపల్లి వద్ద తారకరామతీర్థసాగర్‌ జలాశయాన్ని చేపట్టారు. డెంకాడ ఆనకట్ట కింద 8,172 ఎకరాల ఆయకట్టును కూడా స్థిరీకరించాల్సి ఉంది. 2019 మే నాటికే 47.51 శాతం పనులు పూర్తయ్యాయి. వైకాపా హయాంలో చేసిన పనులు అంతంతమాత్రమే. దీనికి రాష్ట్ట్ర్ర బడ్జెట్‌లో రూ.500 కోట్లకుపైగా కేటాయింపులు చూపినా    రూ.100 కోట్లనైనా ఖర్చు చేయలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని