తెలుగమ్మాయి మరణానికి కారణమైన పోలీసుపై నేరాభియోగాల్లేవ్‌

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి మరణానికి కారణమైన పోలీసు కెవిన్‌ డవేపై నేరాభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు వెల్లడించారు.

Published : 23 Feb 2024 04:13 IST

వాషింగ్టన్‌: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి మరణానికి కారణమైన పోలీసు కెవిన్‌ డవేపై నేరాభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడమే అందుకు కారణమని కింగ్‌ కౌంటీ ప్రాసిక్యూటింగ్‌ కార్యాలయం బుధవారం ప్రకటించింది. సమగ్ర విచారణ జరిపిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. జాహ్నవి మృతిని తక్కువ చేస్తూ చులకనగా మాట్లాడిన మరో పోలీసు అధికారి డేనియల్‌ అడెరెర్‌ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ లేడని కింగ్‌ కౌంటీ ప్రాసిక్యూటింగ్‌ అటార్నీ లీసా మానియన్‌ తెలిపారు. అయితే అడెరెర్‌ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేశారు. ప్రజలకు పోలీసులపై విశ్వాసం తగ్గించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే అతడిపై సస్పెన్షన్‌ వేటు పడింది. అతడిపై చర్యల తుది విచారణ మార్చి 4న జరగనుంది.

కర్నూలు జిల్లా ఆదోని ఎంఐజీ కాలనీకి చెందిన కందుల జాహ్నవి (23) ఉన్నత చదువులకు 2021లో అమెరికా వెళ్లారు. ఈ ఏడాది జనవరి 23న రాత్రి కళాశాల నుంచి ఇంటికి వెళ్తూ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడి జాహ్నవి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో పోలీసు అధికారి కెవిన్‌ డేవ్‌ గంటకు 119 కి.మీ.ల వేగంతో వాహనం నడిపి జాహ్నవిని ఢీకొట్టగా ఆమె 100 అడుగుల దూరం ఎగిరిపడినట్లు సియాటెల్‌ పోలీసు విభాగం తెలిపింది. ఈ కేసు దర్యాప్తుపై పోలీసు అధికారి డేనియల్‌ అడెరెర్‌ చులకనగా మాట్లాడారు. ఆ మాటలన్నీ అతడి శరీరానికి అమర్చిన కెమెరాలో రికార్డయ్యాయి. ఆ తర్వాత అవి బయటకొచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని