తితిదే గౌరవ ప్రధానార్చకుడిపై చర్యలు తీసుకోవాలి

తిరుమల శ్రీవారి ఆలయం, తితిదే అధికారులపై అసత్య ప్రచారాలు చేస్తూ.. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్న తితిదే గౌరవ ప్రధానార్చకుడు రమణ దీక్షితులుపై తితిదే చర్యలు తీసుకోవాలని శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు డిమాండ్‌ చేశారు.

Updated : 23 Feb 2024 06:26 IST

శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల డిమాండ్‌

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి ఆలయం, తితిదే అధికారులపై అసత్య ప్రచారాలు చేస్తూ.. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్న తితిదే గౌరవ ప్రధానార్చకుడు రమణ దీక్షితులుపై తితిదే చర్యలు తీసుకోవాలని శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు డిమాండ్‌ చేశారు. తితిదే పరిపాలన అంశాలు, శ్రీవారి ఆలయ నిర్వహణపై రమణ దీక్షితులు సామాజిక మాధ్యమం వేదికగా చేసిన వ్యాఖ్యలు వైరల్‌ కావడంతో స్థానిక అర్చక భవనంలో గురువారం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. ‘తితిదే, అధికారులపై రమణ దీక్షితుల వ్యాఖ్యలను అర్చకులమంతా ఖండిస్తున్నాం. శ్రీవారి ఆలయంలో కైంకర్యాల విషయంలో ఛైర్మన్‌, ఈవో, సిబ్బంది జోక్యం చేసుకోరు. అన్నీ ఆగమోక్తంగానే జరుగుతున్నాయి. ఆలయంలోకి స్తంభాలు తీసుకువచ్చారని, తవ్వకాలు జరిగాయంటున్న ఆయన వ్యాఖ్యల్లో వాస్తవం లేదు. భక్తులు ఇలాంటివి నమ్మొద్దు. రమణ దీక్షితులను సీఎం గౌరవ ప్రధాన అర్చకుడిగా నియమించినప్పటికీ, నాలుగేళ్లుగా గుడికే రాకుండా ప్రతినెలా రూ.80 వేలు జీతం తీసుకుంటున్నారు. ఆయన కుమారుడు కూడా ఆలయానికి రాలేదు. లుంగీలు, టీషర్టులు ధరించిన ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్‌ అని చెప్పిన రమణ దీక్షితులు తాను మాట్లాడిన వీడియోలో కూడా టీషర్టు ధరించారు. నేటికి ఆయన తన గదిని, క్వార్టర్స్‌ను ఖాళీ చేయలేదు’ అని పేర్కొన్నారు.

వీడియోలో గొంతు నాది కాదు: రమణ దీక్షితులు

శ్రీవారి ఆలయం, తితిదే అధికారులపై తాను వ్యాఖ్యలు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరలైందని, అందులోని గొంతు తనది కాదని ఎక్స్‌ వేదికగా రమణ దీక్షితులు తెలిపారు. తనను అగౌరవపరిచేందుకు కొంతమంది ఇలాంటివి చేస్తున్నారని, తితిదే అధికారులతో తన సంబంధాలను చెడగొట్టేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. ఈ అంశాలతో తితిదే ఈవోకు రమణ దీక్షితులు లేఖ రాసినట్లు సమాచారం.

వీడియో వ్యవహారంపై తితిదే సీరియస్‌?

భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా రమణ దీక్షితులు తరచూ చేస్తున్న ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు తితిదే సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదే సమయంలో సామాజిక మాధ్యమంలో ఉన్న వీడియో తనది కాదని రమణ దీక్షితులు చెబుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో తితిదే ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీవారి ఆలయ జీయంగార్లు, పోటు కార్మికులు రమణ దీక్షితులుపై కఠిన చర్యలు తీసుకోవాలని తితిదే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని