మార్చి నెలంతా పరీక్షా కాలమే

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 16.75 లక్షల మంది హాజరవుతున్నారని, పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.

Published : 23 Feb 2024 04:22 IST

వచ్చే నెలలో ఇంటర్‌, పది, డీఎస్సీ, టెట్‌
రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు, అభ్యర్థులు
ఏర్పాట్లపై అధికారులతో మంత్రి బొత్స సమీక్ష

ఈనాడు, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 16.75 లక్షల మంది హాజరవుతున్నారని, పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో గురువారం మంత్రి వర్చువల్‌గా సమీక్షించారు. ‘వచ్చే నెలంతా పరీక్షలు ఉంటాయి. టెట్‌, డీఎస్సీ, పది, ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు 20 లక్షల మంది హాజరవుతారు. అధికారులందరూ సమన్వయంతో పని చేయాలి. పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల సమీపంలో 144 సెక్షన్‌ అమలు చేయాలి’ అని సూచించారు.

  •  మార్చి 18 నుంచి 30 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు 6,23,092 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో బాలురు 3,17,939, బాలికలు 3,05,153 మంది ఉన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది సామాన్యశాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి పేపర్‌-1 కింద 50 మార్కులకు, జీవశాస్త్రం పేపర్‌-2 కింద 50 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. సామాన్యశాస్త్రాన్ని రెండు పేపర్లుగా విభజించినందున ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 11.30 వరకు ఉంటాయి. గతంలో పదో తరగతి ఫెయిల్‌ అయి ఇప్పుడు కొత్తగా ఫీజు చెల్లించిన వారు 1,02,528 మంది ఉన్నారు. వీరిలో అన్ని సబ్జెక్టులూ రాసేందుకు 1,150 మంది ఫీజు చెల్లించారు. వీరు అన్ని సబ్జెక్టుల పరీక్షలు రాసినా గతంలో వచ్చిన మార్కుల కంటే ఎక్కువ వస్తే కొత్త మార్కులను.. లేదంటే పాత వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. వీరు రెగ్యులర్‌గా ఉత్తీర్ణులైనట్లు మెమో ఇస్తారు. ఫెయిల్‌ అయిన పేపర్‌ మాత్రమే రాసేందుకు ఫీజు చెల్లించిన వారు పాస్‌ అయితే, సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనట్లు మెమో ఇస్తారు. వచ్చే వారం నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు వాటిపై కోడ్‌ నంబరుతో పాటు క్యూఆర్‌ కోడ్‌ను ముద్రిస్తున్నారు. విద్యార్థులు హాల్‌ టికెట్‌ చూపించి, ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం పొందొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా సమస్యాత్మక కేంద్రాలు 137 ఉన్నట్లు జిల్లాల విద్యాధికారులు గుర్తించారు. 130 కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నారు. పరీక్షలకు సంబంధించి సందేహాల నివృత్తికి మార్చి 1 నుంచి సహాయ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 8 వరకు నిర్వహించనున్నారు.
  •  ఇంటర్మీడియెట్‌ పరీక్షలు మార్చి 1న ప్రారంభమై 20వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 10,52,221 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
  •  సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్‌ పరీక్షలు మార్చి 18 నుంచి 26 వరకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి. పదో తరగతికి 76,572, ఇంటర్మీడియెట్‌కు 34,635 మంది హాజరు కానున్నారు.
  •  ఏపీ టెట్‌ 2,79,685 మంది రాయనున్నారు. ఈనెల 27 నుంచి మార్చి 6 వరకు ఏపీతోపాటు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, ఖమ్మం, కోదాడల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని