దాడులకు సీఎం, డీజీపీ ప్రోత్సాహం!

రాష్ట్రంలో జర్నలిస్టులు, పత్రిక కార్యాలయాలపై వైకాపా ప్రభుత్వం.. ఆ పార్టీ శ్రేణులు చేస్తున్న దాడులకు నిరసనగా అనంతపురం నగరంలో పాత్రికేయులు కదం తొక్కారు.

Updated : 23 Feb 2024 05:59 IST

లేకపోతే ఎందుకు ఖండించడంలేదు? 
‘అనంత’లో కదం తొక్కిన జర్నలిస్టులు
వైకాపా మూక దాడులపై నిరసన

అనంత జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో జర్నలిస్టులు, పత్రిక కార్యాలయాలపై వైకాపా ప్రభుత్వం.. ఆ పార్టీ శ్రేణులు చేస్తున్న దాడులకు నిరసనగా అనంతపురం నగరంలో పాత్రికేయులు కదం తొక్కారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో గురువారం ‘చలో అనంతపురం’ కార్యక్రమం చేపట్టారు. రాయలసీమ జిల్లాల నుంచి జర్నలిస్టులు తరలి వచ్చారు. నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. వారికి రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్‌, అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ఐజేయూ జాతీయ కార్యదర్శి సోమసుందర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని దుయ్యబట్టారు. పథకం ప్రకారమే వైకాపా ప్రభుత్వం మీడియాను అణచివేస్తోందని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మీడియాను గుప్పెట్లో పెట్టుకోడానికి భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

ఇన్ని దాడులు జరుగుతున్నా సీఎం జగన్‌ కానీ, డీజీపీ కానీ కనీసం ఖండించలేదని.. వారి మనస్తత్వాన్ని చూస్తుంటే దాడులను ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. జగన్‌ సీఎంగా ప్రమాణం చేసినరోజే.. కొన్ని పత్రికలు, ఛానళ్ల పేర్లు ప్రస్తావిస్తూ తన వైఖరి చెప్పారని, అప్పటి నుంచే మీడియాను అణగదొక్కే చర్యలు మొదలయ్యాయని ఆరోపించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ‘ఈనాడు’ ఫొటో జర్నలిస్టు సంపత్‌పై, అమరావతిలో ‘న్యూస్‌టుడే’ కంట్రిబూటర్‌పై, రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫొటో జర్నలిస్టు శ్రీకృష్ణపైనా.. తాజాగా కర్నూలు ‘ఈనాడు’ కార్యాలయంపైనా దాడులు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు కనిపిస్తున్నాయని ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ జర్నలిస్టుపై కేసు పెట్టాలంటూ స్వయంగా సీఎం కార్యాలయం నుంచి అక్కడి డీఈఓపై ఒత్తిడి తీసుకొచ్చారు. కృష్ణా జిల్లా నర్సీపట్నంలో ఓ పాఠశాల గదులన్నీ వర్షానికి లీకేజీ అయిన ఘటనపై కథనాలు ఇచ్చిన ఛానళ్లు, రిపోర్టర్లపై కేసులు పెట్టారు.

ఆ తర్వాత విజయవాడలో అంకబాబు, విజయనగరం జిల్లాలోని రిపోర్టర్లపై సీఐడీ కేసులు పెట్టారు. ఈ క్రమంలోనే రాయలసీమ జిల్లాల్లో ఏకంగా దాడులకు తెగబడ్డారు. ఈ విష సంస్కృతి ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా పాకిందని ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వ ప్రలోభాలకు, ఒత్తిళ్లకు తలొగ్గలేదనే దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు. సీఎం జగన్‌ స్వయంగా ఒక పత్రికకు యజమానిగా ఉండి కూడా రాష్ట్రంలో ఇలా మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారా అంటూ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నారని చెప్పారు.

తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడిస్తాం

ఏపీయూడబ్ల్యూజే సంఘానికి రాజకీయ రంగు పూయడానికి వైకాపా యత్నిస్తోందని నాయకులు అన్నారు. ‘గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం సాక్షి విలేకరులకు సభలకు అనుమతి లేదంటే ఖండించాం. 5,000 మందితో విజయవాడలో మీడియా మార్చ్‌ నిర్వహించాం. అప్పటి మంత్రులు కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథ్‌రెడ్డి, యనమల రామకృష్ణుడు సంప్రదింపులు జరపడం.. తర్వాత అన్ని సభలు, సమావేశాలకు సాక్షి మీడియాకు అనుమతి ఇవ్వడం వాస్తవం కాదా?’ అని ప్రశ్నించారు. తమ సంఘానికి 68 ఏళ్ల చరిత్ర ఉందని, ఏనాడూ ఏ పార్టీకి కొమ్ము కాయలేదని తెలిపారు. రాప్తాడు సిద్ధం సభకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఏబీఎన్‌ ప్రతినిధులను ఎవరు రమ్మన్నారు. ఎందుకు వెళ్లారంటూ గుడివాడ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం అవివేకమని అన్నారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో మాదిరిగా మీడియా రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దాడులు ఆపకపోతే రానున్న రోజుల్లో తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ‘మీ పార్టీ, మీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే మీడియాను అణచివేసేందుకు దాడులు చేస్తున్నారు’ అని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని