చొక్కాలు మడవమనడం దిగజారుడుతనమే

చొక్కాలు మడతపెట్టాలని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పడం దిగజారుడుతనమేనని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. జనాలను రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

Published : 23 Feb 2024 04:38 IST

సీఎం స్థాయి వ్యక్తి అనాల్సిన మాటలా అవి?
‘ఈటీవీ’ ప్రతిధ్వనిలో విశ్లేషకుల మనోగతం

ఈటీవీ, అమరావతి: చొక్కాలు మడతపెట్టాలని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పడం దిగజారుడుతనమేనని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. జనాలను రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘రాష్ట్రం బాగుంటే ఇప్పుడున్న మనమే కాదు.. మన తర్వాతి తరాలు కూడా బాగుంటాయి. దానికి బీజాలు ఇప్పుడే వేయాలి. అలా చేయగల సమర్థుడి చేతిలో రాష్ట్రాన్ని పెట్టాలి’ అని వారు అభిప్రాయపడ్డారు. ‘అభివృద్ధి ఎవరిది? వినాశనం ఎవరిది?’ అనే అంశంపై గురువారం ‘ఈటీవీ ప్రతిధ్వని’ నిర్వహించిన చర్చలో పాల్గొన్న విశ్లేషకుల మనోగతం ఇది.


ఎదుటి వారి చేతికి నెత్తురు పూసి..

- ఎ.శ్రీనివాసరావు - సామాజిక విశ్లేషకులు

సిద్ధం సభలు పెట్టి జనంపై యుద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌.. తాను చేసిన అభివృద్ధి గురించి ఎక్కడా వివరించడం లేదు. అభివృద్ధిపై చర్చకు రావాలంటూ మాజీ సీఎం చంద్రబాబు చేసిన సవాల్‌కు అంగీకరించేందుకు ఆయన సిద్ధంగా లేరు. రాజకీయ విమర్శలకు సిద్ధం సభలను వేదికగా చేసుకుంటున్నారే తప్ప అభివృద్ధిపై కాదు. జగన్‌ తన తండ్రి అధికారం సాయంతో లక్షల కోట్ల రూపాయలు కొట్టేశారు. సత్యం రామలింగరాజు వంటి వారిని జైలుపాల్జేశారు. కులం పేరుతో ఎదుటివారిపై నిందలు మోపారు. తన సొంత బాబాయి హత్యకు గురైతే ఎదుటివారి చేతులకు నెత్తురు పూసి తన పత్రికలో వ్యతిరేక కథనాలు ప్రచురించారు. ఈ వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసు. అందరి కంటే 20 ఏళ్ల ముందు చూపుతో చంద్రబాబు యోచన చేస్తారు. ఏ పాలకుడికయినా ఉండాల్సిన దార్శనికత ఇదే. చంద్రబాబులో నిరంతరం కష్టపడే గుణం, సంస్కరణల ఆకాంక్ష, దూరదృష్టి, తాను తీసుకునే నిర్ణయాలకు వెంటనే కాకపోయినా ఖచ్చితమైన ఫలితాలు వస్తాయనే విశ్వాసం ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలోను, ఆపదలప్పుడు ఆయన స్పందన మెరుపు వేగంతో ఉంటుంది. అతి తక్కువ వర్షపాతం కలిగిన అనంతపురం జిల్లాలో సూక్ష్మసేద్య విధానం ద్వారా రైతులకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. ఆయన తర్వాత జగన్‌ వచ్చాక పోలవరం ప్రాజెక్టును పడకేయించారు. రివర్స్‌ టెండరింగ్‌తో పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు సరికదా.. ఉన్న నిర్మాణాలు దెబ్బతిన్నాయి.


చంద్రబాబు అంటే ఐటీ.. జగన్‌ అంటే లూటీ

- ఎం.సుబ్బారావు - రాజకీయ విశ్లేషకులు

అబ్దుల్‌కలాం, వాజ్‌పేయీ, ఆడ్వాణీ వంటి నాయకులతో కలిసి పని చేసిన వ్యక్తి చంద్రబాబు. చొక్కాలు మడవమనే జగన్‌ భాష చూస్తుంటే గోరంట్ల మాధవ్‌, అంబటి రాంబాబు, కొడాలి నాని వంటి వారి నుంచి ఈ భాష ఆయనకు వచ్చిందా అనే అనుమానం కలగడం సహజం. నియంతగా జగన్‌ తన పాలనలో సృష్టించిన విధ్వంసం కొన్ని తరాల పాటు ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రాన్ని చంద్రబాబు సమర్థంగా పరిపాలించారు. హుద్‌హుద్‌ తుపాను చేసిన విధ్వంసం నుంచి ప్రజలను ఏ విధంగా చంద్రబాబు కాపాడారనేది ఉత్తరాంధ్ర ప్రజలకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఉత్తరాఖండ్‌లో వరదల్లో చిక్కుకుపోయిన తెలుగువారిని విమానాల్లో స్వస్థలాలకు తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. చంద్రబాబు అంటే ఐటీ, జగన్‌ అంటే లూటీ. జగన్‌ది విధ్వంసం - బాబుది నిర్మాణం. విజనరీగా బాబుకు పేరుంటే ప్రిజనరీగా జగన్‌ ప్రసిద్ధి. ఆయన పేరు వినిపిస్తే కోడి కత్తి, బాబాయి గొడ్డలివేటు గుర్తుకొస్తాయి. జగన్‌ పాలనలో విశాఖలో నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సు ద్వారా ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారని ప్రశ్నిస్తే అధికారపక్షం నుంచి సరైన సమాధానం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని