జిందాల్‌కు ఓబుళాపురం గనులు?

వడ్డించే వారు మనవారైతే కడాన కూర్చున్నా ఒక్కటే అనే సామెత తీరుగా ఉంది ఓబుళాపురం ఇనుప ఖనిజం గనుల లీజుల వ్యవహారం. జిందాల్‌ కోరకు.. జిందాల్‌ కోసం.. జిందాల్‌ చేత.. అనేలా నిర్వహించిన టెండర్లను ఆ సంస్థే దక్కించుకోనుంది.

Updated : 24 Feb 2024 07:08 IST

అంతా ప్రణాళిక ప్రకారమే!
1,300 హెక్టార్లలో ఖనిజాన్వేషణ, లీజు కోసం టెండర్లు
జేఎస్‌డబ్ల్యూ, దాని అనుబంధ సంస్థలే బిడ్ల దాఖలు
గతంలో ఏపీఎండీసీకి రిజర్వ్‌ చేయగా.. చేతులెత్తేసిన వైనం
ఈనాడు - అమరావతి

వడ్డించే వారు మనవారైతే కడాన కూర్చున్నా ఒక్కటే అనే సామెత తీరుగా ఉంది ఓబుళాపురం ఇనుప ఖనిజం గనుల లీజుల వ్యవహారం. జిందాల్‌ కోరకు.. జిందాల్‌ కోసం.. జిందాల్‌ చేత.. అనేలా నిర్వహించిన టెండర్లను ఆ సంస్థే దక్కించుకోనుంది. తొలుత ఏపీఎండీసీకి రిజర్వ్‌ చేసిన ఈ భూముల్లో వ్యూహాత్మకంగా ఖనిజాన్వేషణ చేయకుండా.. వాటిని వదులుకునేలా చేసి, ఇప్పుడు జిందాల్‌ చేతిలో పెట్టేందుకు తెర వెనుక పెద్దలు చక్రం తిప్పారు. దీంతో కర్ణాటక సరిహద్దులోని అనంతపురం జిల్లా ఓబుళాపురం వద్ద మించేరీ రక్షిత అటవీ ప్రాంతంలో ఇనుప ఖనిజ గనుల లీజును ఆ సంస్థ దక్కించుకోవడం లాంఛనం కానుంది. గనుల శాఖ పిలిచిన టెండర్లలో జేఎస్‌డబ్ల్యూతో (జిందాల్‌) పాటు మరో రెండు అనుబంధ కంపెనీలే బిడ్లు వేశాయి. దీంతో ఆ సంస్థే బిడ్‌ను సొంతం చేసుకోనుందని తెలిసింది.

ఏపీఎండీసీ చేతులెత్తేసింది ఇందుకేనా?

తొలుత మించేరీ రక్షిత అటవీ ప్రాంతంలో 1,300 హెక్టార్లను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు కేటాయించారు. ఈ సంస్థ అటవీ శాఖ నుంచి అనుమతులు తెచ్చుకొని ఖనిజాన్వేషణ చేయాలి. ఇందుకోసం 70 చోట్ల బోర్లు వేయాలని ప్రతిపాదించారు. ఆయా ప్రాంతాలకు చేరుకునేందుకు అప్రోచ్‌ రోడ్లు నిర్మించాలి. అందుకు దాదాపు 16 హెక్టార్ల అటవీ భూమి తీసుకోవాలి. దానికి ప్రత్యామ్నాయంగా మరోచోట అటవీ శాఖకు భూములు కేటాయించి, పరిహారం చెల్లించాలి. దీనికి సంబంధించి తొలుత దస్త్రం కదిలింది. ఉమ్మడి వైయస్‌ఆర్‌ జిల్లాలోని ఓబుళవారిపల్లె మండలంలోని ఏపీఎండీసీకి చెందిన భూముల్లో కొంతమేర అటవీ శాఖకు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని భావించారు. తరువాత ఆ ప్రతిపాదనలన్నీ ఆగిపోయాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాస్పెక్టింగ్‌ లైసెన్స్‌ కోసం కేటాయించిన భూముల్లో అయిదేళ్లలో ఖనిజాన్వేషణ పూర్తిచేసి, లీజు పొందలేకపోతే రద్దవుతుంది. ఇలా ఏపీఎండీసీ అయిదేళ్లలో ఖనిజాన్వేషణే మొదలుపెట్టలేదు. దీంతో ఆ సంస్థకు 1,300 హెక్టార్ల రిజర్వ్‌ రద్దయింది. తాజాగా వీటికి గనుల శాఖ టెండర్లు పిలిస్తే జిందాల్‌ దక్కించుకోవడానికి సిద్ధమైంది. కార్పొరేట్‌ సంస్థకు అవి దక్కేలా ఏపీఎండీసీ ఖనిజాన్వేషణ చేయకుండా చేతులెత్తేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మించేరి రిజర్వ్‌ అటవీ భూముల్లో 50 శాతం వరకు ఐరన్‌ కంటెంట్‌ ఉండే హెమటైట్‌ వెరైటీ ఇనుప ఖనిజ నిల్వలున్నాయని అంచనా వేస్తున్నారు. 70 శాతం వరకు ఐరన్‌ కంటెంట్‌ ఉండే ముడి ఇనుప ఖనిజానికి, దీన్ని జతచేస్తే స్టీల్‌ప్లాంట్‌కు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.


ఆ మూడూ వారికి చెందినవే

మించేరీ రక్షిత అటవీ ప్రాంతంలో 1,300 హెక్టార్లలో ఇనుప ఖనిజ నిల్వల కోసం ఖనిజాన్వేషణకు గనుల శాఖ కొద్ది రోజుల కిందట టెండర్లు పిలిచింది. ఆయా భూముల్లో బోర్లు వేసి, ఖనిజాన్వేషణ చేసి.. ఎంతమేర నిల్వలున్నాయో నిర్ధారించుకుంటారు. తరువాత ఆ నిల్వలున్న విస్తీర్ణం మేరకు లీజు కేటాయిస్తారు. గనుల శాఖ పిలిచిన టెండర్లలో 3 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. తొలిసారి పిలిచిన టెండర్లలో కనీసం మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేయాలనే నిబంధన ఉండగా.. విచిత్రంగా మూడే వేశాయి. అందులో జేఎస్‌డబ్ల్యూతో పాటు, జిందాల్‌కే చెందిన మరో రెండు సంస్థలు ఉన్నట్లు తెలిసింది. అటవీ, పర్యావరణ అనుమతులన్నీ టెండరు పొందిన సంస్థ పొందాల్సి ఉంటుందని నిబంధన విధించారు. అయిదేళ్ల వ్యవధిలో మూడేళ్లలో ఖనిజాన్వేషణ పూర్తి చేయాల్సి ఉంటుంది. మరో రెండేళ్లు ఈ గడువు పెంచేందుకు వీలు కల్పించారు. ఆ తరువాత మైనింగ్‌ లీజు కేటాయించనున్నారు. తవ్వి తీసే ఇనుప ఖనిజంలో ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌ ధర ప్రకారం కనీసం 10 శాతాన్ని బేస్‌ ప్రైస్‌గా ఖరారు చేశారు. బిడ్లు వేసిన మూడు సంస్థలూ ఒకరివే కావడంతో దాదాపు 10 శాతం మేరకే కోట్‌ చేసి ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం అధికారులు బిడ్ల సాంకేతిక అర్హతలను పరిశీలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని