జగన్‌ ఏలుబడిలో దేవుళ్లకూ రక్షణ కరవే

శ్రీరాముడి విగ్రహం తలనరికేశారు... లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యరథం తగలబెట్టేశారు... బెజవాడ దుర్గమ్మ వెండిరథంలోని సింహాలను తస్కరించారు.. ప్రసన్న వెంకటేశ్వరస్వామి రథానికి నిప్పంటించేశారు.... సీతమ్మ తల్లి విగ్రహ విధ్వంసానికి తెగబడ్డారు.. గోవిందరాజుల స్వామి వారి ఆలయంలో దోపిడీకి యత్నించారు..

Updated : 24 Feb 2024 09:40 IST

ఆయన గద్దెనెక్కింది మొదలు హిందూ దేవాలయాలపై వరుస దాడులు
శ్రీరాముడి విగ్రహం తలనరికేయటం మొదలు.. రథాల దహనం వరకూ వందల ఘటనలు
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలయాల కూల్చివేతలు, దేవత విగ్రహాల విధ్వంసాలు, దేవస్థానాల్లో చోరీలు
అసలు నేరగాళ్లను పట్టుకోని పోలీసులు
దుశ్చర్యలకు పాల్పడ్డ దుండగులు జగన్‌ నిర్లక్ష్యంతో దర్జాగా తిరుగుతున్నారు  
ఆ అలసత్వం ఫలితమే తాజాగా అమరలింగేశ్వరస్వామి ఆలయంలో చోరీ
ఈనాడు - అమరావతి

శ్రీరాముడి విగ్రహం తలనరికేశారు...
లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యరథం తగలబెట్టేశారు...
బెజవాడ దుర్గమ్మ వెండిరథంలోని సింహాలను తస్కరించారు..
ప్రసన్న వెంకటేశ్వరస్వామి రథానికి నిప్పంటించేశారు....
సీతమ్మ తల్లి విగ్రహ విధ్వంసానికి తెగబడ్డారు..
గోవిందరాజుల స్వామి వారి ఆలయంలో దోపిడీకి యత్నించారు..

పదుల సంఖ్యలో ఆలయాల్ని తవ్వేశారు.. వందల సంఖ్యలో దేవతా ప్రతిమలను ధ్వంసం చేసేశారు.. హుండీలు కొల్లగొట్టారు.. ఆభరణాలు దోచుకెళ్లారు. ఇలా ఒకటా.. రెండా.. జగన్‌ ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరగనన్ని దాడులు జరుగుతున్నాయి. ఈ స్థాయిలో దేవాలయాలపై దుశ్చర్యలకు తెగబడుతుంటే జగన్‌ ప్రభుత్వంలో చలనం లేదు. శ్రీరాముడి విగ్రహం తల తెగ్గోస్తే.. హా ఏముందిలే కొత్త విగ్రహం పెట్టేస్తామన్నారు.. దివ్యరథం తగలబెట్టేస్తే నూతన రథం నిర్మించి ఇచ్చేస్తామన్నారు. దేవాలయాలపై దాడులకు అడ్డుకట్ట వేసేలా ఒక్కటంటే ఒక్క చర్యా తీసుకోవట్లేదు. దేవస్థానాల్లో వేలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామంటూ ప్రగల్భాలు పలికారు. అసలు అవి పనిచేస్తున్నాయో లేదో పట్టించుకునే దిక్కు లేదు. అన్నిచోట్లా భద్రతా ఆడిట్‌ చేసేశామంటూ ఆర్భాటపు ప్రకటనలిచ్చారు.. ఆలయాల్ని కొల్లగొడుతుంటే అడ్డుకునేవారు లేరు.  ఈ లెక్కలేనితనం ఫలితంగానే ఇలాంటి ఘటనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. తాజాగా అమరావతిలోని ప్రఖ్యాత అమరరామలింగేశ్వరస్వామి ఆలయంలో చోరీ ఘటన... జగన్‌ జమానాలో దేవాలయాల్లో భద్రత లేమికి నిలువెత్తు నిదర్శనం.

మతిస్థిమితం లేని వ్యక్తులు చేశారట!

 • విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తలనరికేసిన ఘటన జరిగి మూడేళ్ల మూడు నెలలవుతోంది. ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించినా.. నిందితులెవరో కూడా ఇప్పటివరకూ తేల్చలేకపోయారు.
 • అంతర్వేదిలోని లక్ష్మీనరసింహ స్వామి దివ్యరథం దహనమై మూడున్నరేళ్లవుతోంది... దానిపై మొదట్లో ఏవేవో కట్టుకథలు చెప్పిన పోలీసులు తర్వాత ఆ కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని చేతులు దులిపేసుకున్నారు. అటు సీబీఐ కూడా ఆ కేసు తీసుకోలేదు.  
 • బిట్రగుంటలోని ప్రసన్న వెంకటేశ్వరస్వామి దివ్యరథానికి ఓ మతిస్థిమితం లేని వ్యక్తి నిప్పంటించాడని తేల్చేసి, ఆ కేసును అటకెక్కించేశారు.
 • మతిస్థిమితం లేని వ్యక్తులు, మద్యం మత్తులో ఉన్నవారు ఈ దాడులకు పాల్పడ్డారంటూ చాలా కేసుల్ని పోలీసులు తేల్చేశారు. మూఢ నమ్మకాలు, గుప్తనిధుల కోసం ఈ దారుణాలకు ఒడిగట్టారంటూ మరికొన్ని కేసుల్ని నీరుగార్చేశారు. కొన్ని ఘటనల్లో అసలు కేసులే నమోదు చేయలేదు. మరికొన్ని ఘటనల్లో ఏళ్లు గడుస్తున్నా నిందితుల్ని పట్టుకోలేదు. కొన్ని సందర్భాల్లో ఈ విధ్వంసాలను వెలుగులోకి తీసుకొచ్చిన ప్రతిపక్ష పార్టీల నాయకులకే ఆ నేరాన్ని ఆపాదింజేయడం మరింత దారుణం.

సీఎంపై పోస్టు పెడితే వెతికి మరీ పట్టుకుంటారే... దేవాలయాలపై దాడులు చేసిన వారిని పట్టుకోలేరా?

2020 జనవరి నుంచి 2021 జనవరి మధ్య రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, దేవతా విగ్రహాల విధ్వంసాలు, ఆలయాల్లో చోరీల ఘటనల్లో ముఖ్యమైన 44 కేసుల్ని తీసుకుంటే.. వాటిలో 15 కేసులను ఇప్పటి వరకూ ఛేదించలేకపోయారు. మిగతా 29 కేసుల్లో కూడా ఎవరో ఒకర్ని నిందితులుగా చూపించి, మమ అనిపించేశారు. సత్వరం స్పందించకపోవటం, సరైన దర్యాప్తు చేయకుండా వదిలేయటం, నేరగాళ్ల అరెస్టుకు చొరవ చూపకపోవటం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, అధికార పార్టీ నాయకుల్ని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా ఓ చిన్న పోస్టు పెడితే చాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారెవరో, ఎక్కడున్నారో వెతికి వెతికి పట్టుకునే పోలీసులు.. దేవాలయాలపై దాడులకు తెగబడుతున్న వారిని మాత్రం పట్టుకోరు. హిందూ దేవాలయాల్లో దుశ్చర్యలకు పాల్పడిన ఆ దుండగులు జగన్‌ సర్కారు పుణ్యమా అని దర్జాగా ఎక్కడో చోట గడిపేస్తున్నారు.

భద్రత ఆడిట్లు.. సీసీ కెమెరాలు ఏమైపోయాయి?

2020-21 మధ్య దేవాలయాలపై వరుస దాడుల నేపథ్యంలో.. ‘రాష్ట్రంలోని 58,871 ప్రార్థనా మందిరాలను గుర్తించి మ్యాపింగ్‌, భద్రత ఆడిట్‌ పూర్తి చేశాం. 13,296 ప్రదేశాల్లో 44,521 సీసీ కెమెరాలు అమర్చాం’ అని 2021 జనవరిలో అప్పటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రకటించారు. నిజంగా ఆయన చెప్పినట్లు భద్రత ఆడిట్‌ జరిగి, అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెడితే ఇప్పటికీ వరుస ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఆ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా? భద్రత లోపాల్ని సరిదిద్దారా లేదా అని ఈ రెండేళ్లలో ఒక్కసారైనా సమీక్షించకపోవటం వల్లే కదా హిందూ దేవాలయాలపై ఇన్ని దుశ్చర్యలు చోటుచేసుకుంటున్నాయి. అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయంలో గత 30 ఏళ్లలో అసలు చోరీయే జరగలేదు. అలాంటిది తాజాగా ఓ దుండగుడు అర్ధరాత్రి వేళ ఆలయంలోకి చొరబడి హుండీని కొల్లగొట్టాడు. అంత ప్రఖ్యాత ఆలయం వద్ద రాత్రి వేళలో గస్తీ నిర్వహించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? ఆలయంలో దేవాదాయ శాఖ తరఫున ఇద్దరు రాత్రికాపలాదారులు ఉంటారు. వారేం చేస్తున్నట్లు?

చేతులెత్తేసిన సిట్‌

జగన్‌ అధికారం చేపట్టాక రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, చోరీల ఘటనలు వందల సంఖ్యలో జరగ్గా... పోలీసులు కొన్నింటిలోనే కేసులు నమోదు చేశారు. వాటిలో ముఖ్యమైన కేసుల దర్యాప్తు కోసం డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం కొన్ని కేసుల్ని మాత్రమే ఛేదించింది. తాగుబోతులు, మతిస్థిమితం లేని వారే ఈ నేరాలకు పాల్పడ్డారని తేల్చేసింది. గతంలో ఎప్పుడో జరిగిన ఘటనలను ఇప్పుడే సంభవించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎదురుదాడి చేసింది. అంతే తప్ప వ్యవస్థీకృతంగా జరుగుతున్న ఈ దాడుల వెనక ఉన్న సూత్రధారుల్ని మాత్రం పట్టుకోలేదు. అసలు నిందితుల్ని పట్టుకోలేక.. చివరికి పలు కేసుల్లో  తెదేపా, భాజపా నాయకుల్ని అరెస్టు చేసి ప్రతిపక్షాలపై బురద చల్లేందుకు యత్నించారు.


జగన్‌ పాలనలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసాల తదితర ఘటనల్లో ముఖ్యమైనవి ఇవీ

 • 2020 మార్చి 12: ఆకివీడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని సరస్వతీదేవి విగ్రహం ధ్వంసం
 • 2020 ఏప్రిల్‌ 9: ద్వారకాతిరుమలలో సీతారాముల విగ్రహాల్ని అపవిత్రం చేసిన ఘటన
 • 2020 ఆగస్టు 4: నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెదకొండూరు పంచాయతీలో తిప్పపైనున్న జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో చోరీ
 • 2020 ఆగస్టు 9: తాళ్లాయపాలెం కృష్ణా పుష్కర ఘాట్‌లోని శివుడి విగ్రహం ధ్వంసం
 • 2020 సెప్టెంబరు 4: బేతంచర్ల ముచ్చట్ల మల్లికార్జునస్వామి జెండా స్తంభం ధ్వంసం
 • 2020 సెప్టెంబరు 5: అంతర్వేదిలోని లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యరథం దహనం
 • 2020 సెప్టెంబరు 15: విజయవాడ పటమటలోని సాయిబాబా విగ్రహం ధ్వంసం
 • 2020 సెప్టెంబరు 15: విజయవాడ దుర్గగుడి వెండిరథంలోని వెండి సింహాల తస్కరణ
 • 2020 సెప్టెంబరు 16: వత్సవాయిలో నంది విగ్రహం ధ్వంసం
 • 2020 సెప్టెంబరు 22: గుంటూరు జిల్లా నకరికల్లులోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో బంగారు, వెండి ఆభరణాల చోరీ
 • 2020 సెప్టెంబరు 25: నాయుడుపేటలో ఆంజనేయ స్వామి విగ్రహం తోక ధ్వంసం
 • 2020 సెప్టెంబరు 27: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఆగరమంగళంలో ఆంజనేయస్వామి ఆలయంలో దోపిడీ.. నంది విగ్రహం ధ్వంసం.
 • 2020 అక్టోబరు 5: మంత్రాలయం నరసింహస్వామి ఆలయంలో నాగ శిరస్సు ధ్వంసం
 • 2020 అక్టోబరు 21: కోరింగలో హనుమాన్‌ విగ్రహం ధ్వంసం
 • 2020 నవంబరు 2: మాచవరం దక్షిణామూర్తి విగ్రహం ధ్వంసం
 • 2020 డిసెంబరు 12: కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లు గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహం తొలగింపు
 • 2020 డిసెంబరు 12: కర్నూలు జిల్లా మద్దికెరలోని పురాతన మద్దమ్మ ఆలయాన్ని తవ్వేశారు.
 • 2020 డిసెంబరు 8: రామతీర్థంలో సీతారామస్వామి విగ్రహం ధ్వంసం
 • 2021 జనవరి 1: రాజమహేంద్రవరంలోని సిద్ధి విఘ్నేశ్వరస్వామి విగ్రహం ధ్వంసం
 • 2021 జనవరి 3: విజయవాడ ఆర్టీసీ బస్టాండులోని సీతాదేవి విగ్రహం ధ్వంసం
 • 2021 జనవరి 10: అనంతపురం జిల్లాలోని దిగువచెక్కవారిపల్లెలో ఆంజనేయస్వామి పాదాల ధ్వంసం  
 • 2021 మార్చి 1: వెల్దుర్తి మండలంలోని తిక్కతాత స్వామి, ఎల్లమ్మ, అయ్యప్పస్వామి ఆలయాల్లో హుండీలు చోరీ
 • 2021 మార్చి 3: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి యత్నం
 • 2021 మార్చి 21: విశాఖపట్నం పెదవాల్తేరు కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయంలో 35 తులాల బంగారు ఆభరణాల చోరీ
 • 2021 ఏప్రిల్‌ 16: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం నాయుడుపాలెంలో ముత్యాలమ్మతల్లి ఆలయంలో చోరీకి యత్నం
 • 2022 ఏప్రిల్‌ 25: పులివెందుల పాతకూరగాయల మార్కెట్‌లోని తూర్పు ఆంజనేయస్వామి, సాయిబాబా ఆలయాల్లో దొంగతనాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని