ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు సర్వ హక్కులు

‘జగనన్న కాలనీల్లో ఇళ్లపట్టాలు పొందిన లబ్ధిదారులకు ఆ స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 58 నెలల్లో 31 లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చాం’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

Published : 24 Feb 2024 05:39 IST

58 నెలల్లో 31 లక్షల మందికి పట్టాలు ఇచ్చాం
ఒంగోలు సభలో సీఎం జగన్‌ ప్రకటన
జిల్లా నేతల ప్రస్తావన లేకుండానే ప్రసంగం
గైర్హాజరైన సిటింగ్‌ ఎంపీ, ఎమ్మెల్యే, మాజీలు

ఈనాడు, ఒంగోలు: ‘జగనన్న కాలనీల్లో ఇళ్లపట్టాలు పొందిన లబ్ధిదారులకు ఆ స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 58 నెలల్లో 31 లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చాం’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో పలువురు లబ్ధిదారులకు ఆయన ఇళ్లస్థలాల పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉచితంగా పంపిణీ చేసిన ఇంటి స్థలాలపై మహిళలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్‌ కూడా చేసి హక్కు పత్రాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం మరో పది రోజులపాటు కొనసాగుతుందన్నారు. ఇంటి పట్టాలు ఇవ్వడాన్ని తెదేపా కోర్టు కేసుల ద్వారా అడ్డుకుంటోందని ఆరోపించారు. నాడు- నేడు, విద్య, వైద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, ఆరోగ్యశ్రీ పరిధిని రూ. 25 లక్షలకు పెంచామని, పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్‌ వసతులు కల్పించామని చెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలనే అమలు చేయలేదని, ఇప్పుడు కొత్త మ్యానిఫెస్టోతో ఇంటింటికీ కిలో బంగారం, బెంజ్‌ కారు అనే హామీలతో మోసం చేసే ప్రయత్నం చేస్తారని విమర్శించారు.

పొగిడినా ఫలితం లేకపోయే..

సభలో తొలుత ప్రసంగించిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్సార్‌, జగన్‌లను పొగడ్తలతో ముంచెత్తారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇళ్లపట్టాలు పంపిణీ చేసి, ఇచ్చిన మాట నిలుపుకొన్నారంటూ కొనియాడారు. అనంతరం సీఎం జగన్‌ ప్రసంగిస్తూ.. రాష్ట్రవ్యాప్త కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా ఒంగోలులో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమమని చెప్పలేదు. దాదాపు గంటపాటు మాట్లాడిన ఆయన.. ఎక్కడా బాలినేని పేరు ప్రస్తావించలేదు. ఒంగోలు నుంచి పోటీ చేస్తారని, గెలిపించాలంటూ సీఎం చెబుతారని బాలినేని అభిమానులు ఆశించి నిరుత్సాహానికి గురయ్యారు. ఒంగోలు సిటింగ్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి అసలు ఆహ్వానమే అందలేదు. ప్రొటోకాల్‌ ప్రకారం కూడా సమాచారం లేకపోవడంతో ఆయన దూరంగానే ఉండిపోయారు. దర్శి వైకాపా సిటింగ్‌ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, మాజీమంత్రి శిద్దా రాఘవరావు కూడా సభకు హాజరుకాలేదు. బాపట్ల జిల్లా చీరాల నుంచి కరణం బలరాం, ఆయన కుమారుడు కరణం వెంకటేష్‌, ఎమ్మెల్సీ పోతుల సునీత, కందుకూరు నుంచి ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు వచ్చారు. అదే సమయంలో అక్కడి సిటింగ్‌ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ గైర్హాజరయ్యారు.

ఏమో.. అభ్యర్థులు మారా వచ్చు..

బహిరంగ సభ అనంతరం ముఖ్యమంత్రి జగన్‌ ఒంగోలు కార్పొరేటర్లు, ఇతర నాయకులతో ఫొటోలు దిగారు. జిల్లా నేతలు, అధికారులను పలకరించారు. హెలిప్యాడ్‌ వద్ద దాదాపు గంటపాటు జిల్లాలోని ద్వితీయ శ్రేణి నాయకులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో ముచ్చటించారు. అభ్యర్థులు ఎవరనేది చూడకుండా, ఎవరికి టికెట్‌ ఇచ్చినా అంతా కలిసికట్టుగా అందరి గెలుపు కోసం కృషిచేయాలని వారికి సూచించినట్లు తెలిసింది. ఈ పరిణామాలతో సిటింగ్‌లు, సమన్వయకర్తల్లో అయోమయం నెలకొంది. చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చినా ఆశ్చర్యపోవాల్సింది లేదని కొందరు చర్చించుకోవడం గమనార్హం. ఒంగోలు నుంచి బాలినేని పోటీ చేస్తారని చెప్పకపోవడం, ఆయన పేరును ప్రస్తావించకపోవడంపై కూడా గందరగోళం నెలకొంది.


తీసుకొచ్చారు..  ఎండలో వదిలేశారు..

సీఎం సభ పేరుతో గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి 500 ఆర్టీసీ బస్సులు, ఉమ్మడి ప్రకాశంలోని ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన 400 బస్సులు, మినీ వ్యాన్ల ద్వారా జన సమీకరణ చేశారు. వీరందరినీ సీఎం వచ్చే సమయానికి సభా ప్రాంగణానికి తెచ్చి వదిలేశారు. బస్సులను దూరంగా తీసుకెళ్లి నిలిపారు. సభా ప్రాంగణం నుంచి కొప్పోలు రోడ్డు వరకు పొలాల మధ్య మూడు కిలోమీటర్లు కొత్తగా వేసిన మట్టిరోడ్డు కావడంతో వాహనాల రాకపోకలతో పరిసరాలు దుమ్ము ధూళితో నిండిపోయాయి. ఏ బస్సు ఎక్కడుందో తెలియక మహిళలు రెండు గంటలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. నీళ్లు, ఆహారం లేక అవస్థలు పడ్డారు. సభకు రావాల్సిందేనంటూ బలవంతంగా తీసుకొచ్చారని, తీరా ఇక్కడ పట్టాలు ఇవ్వకపోగా భోజనమైనా పెట్టకుండా ఎండలో వదిలేశారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా ఏర్పాట్లు లేక ఇబ్బందులు పడ్డారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొందరు బస్సుల్లోనే ఉండిపోయారు. మరికొందరు సభకు వెళ్లకుండా బయటే కూర్చున్నారు. ఇంకొందరు సీఎం ప్రసంగిస్తుండగానే సభ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి వందల సంఖ్యలో బస్సులను కేటాయించడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటలపాటు బస్టాండ్లలోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని