కోర్టులకూ కత్తెర.. భూహక్కులకు పాతర

న్యాయవ్యవస్థలకే ముకుతాడు వేసేలా... న్యాయాధికారుల హక్కులను లాక్కునేలా.. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులనే బేఖాతరు చేసేలా... సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌నే తోసిరాజనేలా... రాష్ట్ర ప్రభుత్వం ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం-2022 (టైటిలింగ్‌ యాక్ట్‌) తెచ్చింది.

Updated : 24 Feb 2024 06:25 IST

ప్రజల స్థిరాస్తులకు ఎసరు
కుంపటి రాజేసిన ‘టైటిలింగ్‌ యాక్ట్‌’
భూ కబ్జాదారులకు వరంగా కొత్త చట్టం
కోర్టుల పరిధిని లాగేసి అధికారులకే హక్కుల నిర్ణయాధికారం
వైకాపా ప్రభుత్వ బాధ్యతారాహిత్య చర్య
సొంతవారి కోసం రికార్డులు సృష్టించే ఎత్తుగడ
2023 అక్టోబరు 31 నుంచే చట్టం అమల్లోకి వచ్చినట్లు జీవో జారీ
అభ్యంతరాలొచ్చాక... సలహాలు స్వీకరిస్తామంటూ కల్లబొల్లి మాటలు

న్యాయవ్యవస్థలకే ముకుతాడు వేసేలా...
న్యాయాధికారుల హక్కులను లాక్కునేలా..
హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులనే బేఖాతరు చేసేలా...
సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌నే తోసిరాజనేలా...
రాష్ట్ర ప్రభుత్వం ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం-2022 (టైటిలింగ్‌ యాక్ట్‌) తెచ్చింది.

ఈనాడు - అమరావతి

జగన్‌ సర్కారు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ భూ యాజమాన్య హక్కు చట్టం-2022 (టైటిలింగ్‌ యాక్ట్‌) ప్రజల స్థిరాస్తులకు అత్యంత ప్రమాదకారిగా మారబోతోంది. ఈ చట్టంపై వారిలో తీవ్ర ఆందోళన మొదలైంది. సొంతవారి కోసం రికార్డులు సృష్టించేందుకు వైకాపా ప్రభుత్వం వేసిన ఎత్తుగడగా దీనిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమాలను సక్రమంగా మార్చే ఆయుధంగా ఈ చట్టం దుర్వినియోగం కానుందని, అందులోని వివిధ సెక్షన్లు అత్యంత ప్రమాదకంగా ఉన్నాయని న్యాయవాదులు సైతం అభిప్రాయపడుతున్నారు. ‘‘భూ వివాదాలను పరిష్కరించే అధికారాన్ని సివిల్‌ కోర్టుల పరిధి నుంచి ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. న్యాయశాస్త్ర పరిజ్ఞానం లేని అధికారులకు భూయాజమాన్య హక్కులను నిర్ణయించే అధికారాన్ని కట్టబెడుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. భూహక్కులను అధికారులు నిర్ణయించలేరని, న్యాయస్థానాలు మాత్రమే తేల్చగలవని సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఈ చట్టాన్ని హడావుడిగా అమల్లోకి తీసుకొచ్చి ప్రజల్లో ఆందోళన, అశాంతిని సృష్టించింది’’ అని వారు మండిపడుతున్నారు. భూమి వివాదంలో ఉన్నా... లేకున్నా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఎవరో ఒకరి పేరును టైటిల్‌ రిజిస్టర్‌లో చేర్చే ప్రమాదం ఉందనే అనుమానాలు మొదలయ్యాయి. కబ్జాదారులకు ఈ చట్టం చుట్టంలా మారుతుంది. ప్రజల స్థిరాస్తులతోపాటు ప్రభుత్వ, దేవాలయాల భూములకు భద్రత లేకుండా పోతుంది. ఏపీ న్యాయవాదుల మండలి(బార్‌ కౌన్సిల్‌) ఈ వ్యవహారంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిందంటే టైటిలింగ్‌ చట్టం ఎంత ప్రమాదకారో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 2023 అక్టోబరు 31 నుంచే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ‘ఏపీ ల్యాండ్‌ అథారిటీ’ని ఏర్పాటు చేసి, దానికి ఛైర్‌పర్సన్‌, కమిషనర్‌, సభ్యులను నియమిస్తూ గతేడాది డిసెంబరు 29న ఉత్తర్వులిచ్చింది. తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో ‘‘ఇప్పుడే ఈ చట్టాన్ని అమలు చేయడం లేదు. అమలు చేసే ముందు న్యాయనిపుణులు, న్యాయవాదులు, ప్రజాసంఘాలు చెప్పిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంటాం. రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే పూర్తి చేయాల్సి ఉంది. చట్టం అమలుకు నిబంధనలు కూడా ఇంకా తయారు చేయలేదు’’ అని కల్లబొల్లి మాటలను వల్లెవేస్తోంది. ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు వైకాపా ప్రభుత్వం మోసపూరిత మాటలు చెబుతోంది. చట్టాన్ని అమల్లోకి తెచ్చాక సూచనలు, సలహాలను ఆహ్వానిస్తామని చెప్పడం సర్కారు అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. ఎన్నికల వేళ ప్రభుత్వం గోడమీద పిల్లివాటం ప్రదర్శిస్తోంది.


ఇవీ ఇక్కట్లు తెచ్చిపెట్టే సెక్షన్లు

ఏదైనా కొత్త చట్టాన్ని తెస్తే అది ప్రజలకు మేలు చేసేదిగా, పాత విధానం కంటే మరింత సౌకర్యంగా ఉండాలి. ప్రస్తుత టైటిలింగ్‌ చట్టం మేలు చేయకపోగా పౌరుల ఆస్తులకు కీడు చేసేదిగా ఉంది. స్థిరాస్తుల క్రయవిక్రయాలకు అవరోధంగా మారేలా ఉంది. ఈ చట్టంలోని వివిధ సెక్షన్లు ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టేవిగా ఉన్నాయి. ముఖ్యంగా నిరక్షరాస్యులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. తమ ఆస్తులకు తామే యజమానులమని నిరూపించుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద వరసకట్టే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదముంది. ప్రజల ఆందోళనకు ఇవీ కొన్ని కారణాలు...


1 అత్యంత కీలకమైన టీఆర్‌వోల నియామకంపై స్పష్టత కరవు!

ఈ చట్టంలోని సెక్షన్‌-5... టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (టీఆర్‌వో) నియామకం గురించి తెలియజేస్తోంది. ‘ఏపీ ల్యాండ్‌ అథారిటీ’ ఏ వ్యక్తినైనా, వ్యక్తులనైనా టీఆర్‌వోగా నియమించొచ్చని చెబుతోంది.

ప్రజల ఆందోళన ఏమిటంటే...

కొత్త చట్టంలోని టీఆర్‌వోలు అత్యంత కీలక అధికారులు. వీరి పనితీరుపైనే చట్టం అమలు ఆధారపడి ఉంటుంది. వీరిని ఏపీ ల్యాండ్‌ అథారిటీ ఛైర్‌పర్సన్‌ (ప్రధాన కమిషనర్‌, భూ పరిపాలన) నియమిస్తారు. అయితే, వారి అర్హతలేమిటి? ఏ శాఖకు చెందిన, ఏస్థాయి అధికారిని నియమిస్తారో తెలియడం లేదు. తహసీల్దార్లకు ప్రాధాన్యమిస్తారా? వాలంటీర్‌ వ్యవస్థలాగా నచ్చిన వారికే అధికారమిస్తారా అనే దానిపైనా స్పష్టత లేదు. రాజకీయ నేతల చెప్పుచేతల్లో ఉండే వారిని నియమిస్తే... టైటిల్‌ రిజిస్టర్‌లో అసలు యజమానుల పేర్లకు బదులు ఇతరుల పేర్లు చేర్చి భూకబ్జాలకు ఊతమిస్తారనే భయముంది.


2 కొత్త వివాదాలకు అవకాశం

సెక్షన్‌-6 ప్రకారం... నోటిఫైడ్‌ ప్రాంతంలోని అన్ని స్థిరాస్తులకు సంబంధించి హద్దుల వివరాలతో కూడిన రికార్డులను టీఆర్‌వో తయారు చేయాలి. ప్రతి విషయానికి ఈ రికార్డే ప్రామాణికం.

ఇదీ ప్రజల ఆందోళన...

అధికార పార్టీ నేతల ఒత్తిడితో నిరక్షరాస్యులు, రైతుల భూములను ఇతరుల పేర్లపై మార్చేయవచ్చు. ఏదైనా ఆస్తి తమదేనంటూ ఎవరైనా తప్పుడు క్లెయిమ్‌ దాఖలు చేస్తే, సంబంధిత ఆస్తి వివాదంలో ఉన్నట్లు ‘డిస్‌ప్యూట్‌ రిజిస్టర్‌’లో టీఆర్‌వో నమోదు చేస్తారు. వెంటనే సమస్య ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పిలేట్‌ ఆఫీసర్‌ (ఎల్‌టీఏవో-జాయింట్‌ కలెక్టర్‌ హోదాకు తగ్గని అధికారి) చెంతకు చేరుతుంది. అక్కడ తేలే వరకు ఆ ఆస్తిపై ఎలాంటి లావాదేవీలకు, క్రయవిక్రయాలకు అవకాశముండదు. అంటే... గిట్టని వ్యక్తులు తప్పుడు ఒప్పందాన్ని(అగ్రిమెంట్‌) తయారు చేసి ‘డిస్‌ప్యూట్‌ రిజిస్టర్‌’లో ఆ విషయాన్ని నమోదు చేయిస్తే అసలైన యజమాని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.


3 నిరక్షరాస్యులైన భూ యజమానులకు అన్యాయం జరగొచ్చు

రికార్డుల్లో ఒకసారి పేరు చేర్చాక... ఎవరూ  అభ్యంతరం చెప్పకపోతే రెండేళ్ల తర్వాత ఆ పేరుగల వ్యక్తే యజమాని అవుతారు. ఈ విషయాన్ని సెక్షన్‌-13 ప్రకారం తిరుగులేని సాక్ష్యం(కంక్లూజివ్‌ ఎవిడెన్స్‌)గా పరిగణిస్తారు.

ఆందోళన ఏమిటంటే...

ఒకసారి టైటిల్‌ రిజిస్టర్‌లో పేరు చేరితే ఇష్టానుసారంగా మార్చడానికి వీలుండదు. అది బలమైన సాక్ష్యమని టైటిలింగ్‌ చట్టం చెబుతోంది. రిజిస్టర్‌లో పేర్లను చేర్చే క్రమంలో... కొందరు అధికారులు రాజకీయ నేతలు చెప్పినట్లు తారుమారు చేసే అవకాశముంది. రిజిస్టర్‌లో ఎవరి పేరు నమోదు చేశారనే విషయం నిరక్షరాస్యులు, రైతులు సులువుగా తెలుసుకోలేరు. పైగా టైటిల్‌ రిజిస్టర్‌ను ఆన్‌లైన్లో ఉంచుతామని చట్టంలో పేర్కొనలేదు. ఈసీ(ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌), పహానీల గురించిన ప్రస్తావనే లేదు. అందుకే అధికారులు రిజిస్టర్లను గోప్యంగా ఉంచి, అవినీతికి పాల్పడతారనే ఆందోళన నెలకొంది.


4 హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను సైతం అమలు చేయడం సాధ్యం కాదంటా!!

భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన వివాదం సివిల్‌ కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంటే సంబంధిత వ్యక్తులు ఈ విషయాన్ని టీఆర్‌వో దృష్టికి తీసుకొచ్చి రికార్డులో నమోదు చేయించుకోవాలి(సెక్షన్‌ 18). నోటిఫికేషన్‌ ఇచ్చిన ఆరు నెలల్లో టీఆర్‌వో నుంచి ధ్రువపత్రం పొంది దాన్ని సంబంధిత కోర్టులో దాఖలు చేయాలి. వివాదాన్ని పరిష్కరిస్తూ న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను 15 రోజుల్లోపు టీఆర్‌వో దృష్టికి తీసుకురావాలి. ఈ విధంగా చేయడంలో విఫలమైతే కోర్టులిచ్చిన తీర్పులను అమలు చేయడం సాధ్యం కాదు.

ఆందోళన ఏమిటంటే...: కోర్టుల తీర్పు ప్రతులను 15 రోజుల్లోనే టీఆర్‌వో దృష్టికి తీసుకెళ్లకుంటే వాటిని అమలు చేయడం సాధ్యంకాదని చెప్పడం ప్రభుత్వ లెక్కలేనితనానికి నిదర్శనం. బాధితులు ఏదైనా ఊహించని సమస్యలో ఇరుక్కుని టీఆర్‌వోను 15 రోజుల్లో కలుసుకోలేకపోతే, ఒకవేళ టీఆర్‌వోనే అందుబాటులో లేకుంటే... ఎవరు బాధ్యత వహిస్తారు? కోర్టుల తీర్పులనే పట్టించుకోకుంటే ప్రజలకు ఏవిధంగా న్యాయం జరుగుతుంది?


5 రిజిస్టర్‌లో పేరు చేరితేనే యాజమాన్య హక్కులు

రాష్ట్రంలోని స్థిరాస్తుల వివరాలు ప్రభుత్వం నోటిఫై చేశాక... ప్రజల వద్ద ఉన్న దస్తావేజులు, ఇతర వివరాలను టీఆర్‌వోకి చూపించాలి. ఆయన సంతృప్తి మేరకు ‘టైటిల్‌ రిజిస్టర్‌’లో పేరును చేరుస్తారు. రిజిస్టర్‌లో పేరు చేరినప్పుడే యాజమాన్య హక్కులొస్తాయి.

ఆందోళన ఏమిటంటే...

ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు ప్రస్తుతం యజమానుల దగ్గరే ఉంటున్నాయి. క్రయవిక్రయాల సమయంలో వాటిని అధికారికంగా వాడుకోవచ్చు. తాజా చట్టం ప్రకారం ఈ దస్తావేజులకు విలువే ఉండదు. ‘‘మీరే యజమాని’’ అంటూ టీఆర్‌వో ఇచ్చే ధ్రువపత్రమే చెల్లుబాటు అవుతుంది. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో... చట్ట ప్రకారం లక్షల రూపాయలను స్టాంప్‌ డ్యూటీగా చెల్లించి అధికారికంగా పొందిన దస్తావేజులకు విలువ లేకుండా... టీఆర్‌వో ఇచ్చే ధ్రువపత్రానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం తీవ్ర అభ్యంతరకరం.


6 సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ నిబంధనలను పాటించాల్సిన అవసరం లేదట!!

ఎల్‌టీఏవో... సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌(సీపీసీ)కు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని సెక్షన్‌ 37లో పేర్కొన్నారు. సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా వ్యవహరించొచ్చని, ఎల్‌టీఏవో ఇచ్చే ఉత్తర్వులేవైనా జ్యుడిషియల్‌ ప్రొసీడింగ్స్‌లో భాగంగానే ఇచ్చినట్లు భావించాలని పొందుపరిచారు.

ఇష్టానుసారంగా వ్యవహరించే అవకాశం

రాజకీయ ప్రలోభాల కారణంగా ఎల్‌టీఏవో సహజ న్యాయసూత్రాల పేరిట ఇష్టానుసారంగా వ్యవహరించే అవకాశముంది. సీపీసీ ప్రకారం... బాధితులకు నోటీసులు ఇస్తారు. వారికి వాదనలు చెప్పుకొనే అవకాశం ఉంటుంది. రాతపూర్వక అభ్యంతరాలనూ సమర్పించొచ్చు. అయితే... ఎల్‌టీఏవో తన విచారణలో సీపీసీ నిబంధనలను పాటించలేదని గ్రహిస్తే... దానిపై హైకోర్టులోనే సవాలు చేసుకోవాలి తప్ప వేరే మార్గం లేదు.


7 ప్రభుత్వ, దేవాదాయ భూములకు దిక్కే ఉండదు

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ స్థిరాస్తి వివరాలను టైటిల్‌ రిజిస్టర్లో నమోదు చేయించుకోవాల్సిందే.

ఆందోళన ఏమిటంటే...

అధికారులను దారిలోకి తెచ్చుకొని ఎవరైనా... ప్రభుత్వ, దేవాదాయ భూములకు యజమానిగా టైటిల్‌ రిజిస్టర్‌లో వారి పేరు చేర్పించుకుంటే దాని గురించి పట్టించుకునే వాళ్లుండరు. రిజిస్టర్లు అధికారుల ఆధీనంలో ఉంటాయి. కాబట్టి బయటకు తెలిసే అవకాశముండదు. పేరు మార్పును రెండేళ్ల వరకు ఎవరూ పట్టించుకోకుంటే ఆ తర్వాత భూములపై యాజమాన్య హక్కులు వారికే దఖలు పడతాయి. అదే జరిగితే అధికారం, ధనబలం, కండబలం ఉన్న వ్యక్తుల చేతుల్లోకి దేవాదాయ, ప్రభుత్వ భూములు వెళ్లిపోతాయి. ప్రైవేటు వ్యక్తుల మాదిరిగా ప్రభుత్వ అధికారులు ముందుకొచ్చి ఆ భూముల కోసం పోరాటం చేసే పరిస్థితి ఉండదు.


8 సివిల్‌ కోర్టుల్లో అప్పీలు చేసే హక్కుకు కత్తెర

సెక్షన్‌ 16 ప్రకారం... టైటిల్‌ రిజిస్టర్‌లో పేరు చేర్చే వ్యవహారంపై తలెత్తే వివాదంపై ఎల్‌టీఏవో ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులో మాత్రమే రివిజన్‌ పిటిషన్‌ వేసుకోవాలి.

ఆందోళన ఏమిటంటే...

ఎల్‌టీఏవో ఉత్తర్వులపై అభ్యంతరమున్న బాధితులు హైకోర్టును మాత్రమే ఆశ్రయించాలి. ఇది చాలదన్నట్లు రివిజన్‌ అంటే... పునఃపరిశీలనకు మాత్రమే అవకాశమిచ్చిన సెక్షన్‌-16 కారణంగా హైకోర్టుకు వివాద లోతుల్లోకి వెళ్లి విచారించే అవకాశం లేకుండా చేశారు. హైకోర్టును ఆశ్రయించడం వ్యయ, ప్రయాసలతో కూడిన పని. ఎంతమంది దాని గడప తొక్కుతారనేది ప్రశ్నార్థకం.


9 సివిల్‌ కోర్టులు విచారించకుండా నిషేధం

టీఆర్‌వో, ఎల్‌టీఏవోలకు కల్పించిన భూ వివాదాల పరిష్కారం, భూ హక్కుల నిర్ణయం, రికార్డుల్లో వివరాల నమోదు, భవనాలు, ప్లాట్లు(ఇమ్మూవబుల్‌ ప్రాపర్టీ) తదితర విషయాలపై సివిల్‌ కోర్టులు విచారణ జరపకుండా సెక్షన్‌ 38 ప్రకారం నిషేధం.

ఆందోళన ఏమిటంటే...

ప్రజలకు భౌగోళికంగా చేరువలో ఉండే సివిల్‌ కోర్డులను భూ వివాదాలలో జోక్యం చేసుకోకుండా పూర్తిగా దూరం పెట్టారు. ఇది కుట్రతో కూడుకున్న వ్యవహారమే. రాజకీయ నాయకుల ప్రలోభాలు అధికమవుతున్న ప్రస్తుత సమయంలో అధికారుల చేతుల్లో భూ యాజమాన్య హక్కులను నిర్ణయించే అధికారాన్ని ఉంచడం ఎంతమాత్రం శ్రేయస్సు కాదు.


10 జైలుశిక్ష వేస్తారంట...!

సమాచారాన్ని అందించడంలో విఫలమైన ఏ వ్యక్తికైనా ఆరు నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా లేదా రెండు విధించే అధికారం ఈ చట్టంలోని సెక్షన్‌-64 ప్రకారం అధికారులకు ఉంది. సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తే వ్యక్తిగతంగానూ బాధ్యులవుతారు.

బెదిరించేందుకు ఇదో అస్త్రం...

సహజంగా జైలుశిక్ష విధింపు వ్యవహారం న్యాయస్థానాల పరిధిలో ఉంటుంది. న్యాయస్థానాలకు జ్యుడిషియల్‌ అధికారాలు ఉంటాయి. టీఆర్‌వో, ఎల్‌టీఏవో, ఏపీ ల్యాండ్‌ అథారిటీ(ఏపీఎల్‌ఏ)లో ఎవరికి జైలుశిక్ష విధించే అధికారం కల్పించారో చట్టంలో పేర్కొనలేదు. ఇలాంటి సెక్షన్‌ తీసుకురావడం పౌరులను బెదిరించేందుకు అధికారులకు అవకాశం ఇచ్చినట్లే. ఈ సెక్షన్‌ను ఆసరాగా తీసుకొని కక్షసాధించేందుకు కూడా ఏ వ్యక్తినైనా సమాచారం కోరే ప్రమాదముంది.


11 టీఆర్‌వో సంతృప్తి మేరకే క్రయవిక్రయాలు, భూ బదలాయింపులు

మరొకరికి భూమిని బదిలీ చేయాలనుకుంటే వివరాలన్నింటినీ సంబంధిత యజమాని... టీఆర్‌వో దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆయన సంతృప్తి చెందాకే క్రయవిక్రయాలు, బదలాయింపులు జరపడానికి అవకాశం ఉంది.(టైటిలింగ్‌ చట్టంలోని ఛాప్టర్‌-8). 

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సంక్లిష్టం

టైటిలింగ్‌ చట్టంలోని సెక్షన్‌ 50, 51ల ప్రకారం ‘రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ’ను సంక్లిష్టం చేశారు. వీటివల్ల మరిన్ని కష్టాలు ఎదుర్కొనే ప్రమాదముంది. స్థిరాస్తిని మరొకరికి బదిలీ చేయాలంటే టీఆర్‌వోకు వివరాలన్నీ సమర్పించాలి. ఆయన సంతృప్తి చెందితేనే క్రయవిక్రయాలకు వీలుంది. ఈ విధానం అవినీతికి దారితీస్తుంది.


ప్రజల ఆస్తులకు, గోప్యతకు ముప్పు

- నీలం రామమోహన్‌రావు, సీనియర్‌ న్యాయవాది, టైటిలింగ్‌ యాక్ట్‌పై గుంటూరు జిల్లా కార్యక్రమాల సమన్వయకర్త, గుంటూరు జిల్లా బార్‌ ఫెడరేషన్‌ సభ్యుడు

ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతారు. సివిల్‌ కోర్టులకు విచారణ పరిధి లేకుండా చేయడం సరికాదు. టైటిలింగ్‌ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొనే... రాష్ట్రంలోని స్థిరాస్తులన్నింటిపై ప్రభుత్వం రీ-సర్వే చేస్తోంది. ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా గోప్యతను పాటిస్తోంది. భారతీయ సమాజానికి సరిపోయేలా ఇప్పటికే కేంద్ర చట్టాలున్నాయి. వాటిని పక్కనపెడితే ఎలా...? పిల్లల చదువులు, పెళ్లి ఖర్చులు, ఇంటి అవసరాల కోసం ఆస్తి దస్తావేజులు తాకట్టుపెట్టి అప్పు తెచ్చుకొని గుట్టుగా సంసారం సాగించే వారు కొందరుంటారు. తనఖాపెట్టి అప్పుతీసుకున్న దస్తావేజులను సైతం టైటిలింగ్‌ చట్ట ప్రకారం టీఆర్‌వోకి తెలియజేయాలి. అనుమతి తీసుకోవాలి. అప్పుడే ఈ తాకట్టు చెల్లుతుంది. దీంతో ప్రజలు అప్పులు తీసుకున్న విషయం సైతం రిజిస్టర్‌లోకి ఎక్కుతుంది. ఈ విధానం పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించడమే. టైటిలింగ్‌ చట్ట ప్రకారం దరఖాస్తు, అప్పీల్‌ చేయాలంటే రుసుము ఎంత చెల్లించాలో విధివిధానాలు లేవు. చట్టం అమలుకు నిధులెక్కడి నుంచి తెస్తారో స్పష్టత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించడం ఆందోళనకు గురిచేస్తోంది.


రెవెన్యూ అధికారులు చెప్పేదే ఫైనల్‌ అవుతుంది!

టైటిలింగ్‌ చట్టాన్ని తీసుకురావడానికి కారణం ఏమిటో ప్రభుత్వానికే తెలియదు. ప్రతిచిన్న విషయానికి భూ వివాదాన్ని లేవనెత్తేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తోంది. అధికారులేమైనా తప్పులు చేస్తే ఇప్పటివరకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాం. అలాంటి వారికే భూ యాజమాన్య హక్కుల చట్టం పేరిట అమితమైన అధికారాలు కట్టబెట్టడం సరికాదు. సివిల్‌ కోర్టుల అధికారాలను అధికారుల చేతుల్లో పెట్టారు. రెవెన్యూ అధికారులు ఏది చెబితే అది చట్టం అనే పరిస్థితి వస్తుంది. ఎలాంటి సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలనే విషయం అధికారులకు తెలియదు. కోర్టులకే ఆ విషయం తెలుస్తుంది. భూ యాజమాన్య హక్కులను నిర్ణయించే అధికారం అధికారులకు ఇస్తే... ఒకరి ఆస్తి ఇంకొకరికి, ఇంకొకరి ఆస్తి మరొకరికి ధారాదత్తం అవుతుంది. ఇది అత్యంత ప్రమాదకర చట్టం.

చిదంబరం, సీనియర్‌ న్యాయవాది, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు


మీకు అంతో ఇంతో భూమి ఉంది. వాటి పత్రాలూ పదిలంగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రిజిస్టర్‌లో పేరు లేదనే సాకుతో వాటిని ఉన్నపళంగా చెల్లని కాగితాల కింద లెక్కగడితే?

దారుణం అని అంటారా? అనరా?


మీ భూమిని తనదంటూ ఎవరో ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తారు. ఆ సంగతి మీకు తెలియదు. భూమికాస్త వివాదంలో పడిపోతుంది. రెండేళ్లలో మీరు స్పందించకుంటే ఆ భూమిని దరఖాస్తు చేసిన వ్యక్తిపేరిట రాసేస్తే....?

ఇదెక్కడి న్యాయం అని అంటారా? అనరా?


భూవివాదాల విచారణ అధికారాన్ని సివిల్‌ కోర్టుల నుంచి తీసేసి ప్రభుత్వం నియమించే అధికారులకు అప్పగిస్తే? వారికే శిక్షలు విధించే అధికారం కూడా కట్టబెడితే?

ఇంత కంటే అరాచకం మరోటి ఉంటుందా?


ఞ మీ భూమికి సంబంధించి హైకోర్టులోనో, సుప్రీంకోర్టులోనో నడిచిన కేసు పూర్తయింది. తీర్పు వచ్చిన 15రోజుల్లోగా ఆ వివరాలను ప్రభుత్వానికి అందించాలి. లేదంటే... ఆ తీర్పునకు విలువలేదని ప్రభుత్వం అంటే?...

ఇది నియంతృత్వం కాక, ప్రజాస్వామ్యం అని అంటారా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని