సంక్షిప్త వార్తలు(13)

ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల్లో క్రిమినల్‌ కేసులున్నవారు పదవీ విరమణ చెందితే.. వారికి దక్కాల్సిన ప్రయోజనాలను (టెర్మినల్‌ బెనిఫిట్స్‌) చెల్లించకూడదని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.

Updated : 24 Feb 2024 05:36 IST

క్రిమినల్‌ కేసులుంటే పదవీవిరమణ ప్రయోజనాలు ఇవ్వొద్దు
ఆదేశాలు జారీచేసిన ఆర్టీసీ యాజమాన్యం

ఈనాడు, అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల్లో క్రిమినల్‌ కేసులున్నవారు పదవీ విరమణ చెందితే.. వారికి దక్కాల్సిన ప్రయోజనాలను (టెర్మినల్‌ బెనిఫిట్స్‌) చెల్లించకూడదని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారినందున.. వారికి ఉన్న ఈ నిబంధన వర్తిస్తుందంటూ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆర్టీసీలో గత నెల నుంచి పదవీ విరమణలు మొదలయ్యాయి. దీంతో క్రిమినల్‌ కేసులున్న ఉద్యోగులు రిటైర్‌ అయితే టెర్మినల్‌ బెనిఫిట్స్‌ ఇవ్వడంపై కొన్ని జిల్లాల అధికారులు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం స్పష్టతనిస్తూ ఈ ఉత్తర్వులు ఇచ్చింది.


ఇంటి నిర్మాణానికి పదేళ్ల గడువు

ఈనాడు, అమరావతి: పట్టాలు పొందిన వారు ఇంటి నిర్మాణం   పూర్తి చేయడానికి ప్రభుత్వం పదేళ్ల (120 నెలలు) గడువు ఇచ్చింది. గతంలో ఇంటి పట్టా పొందిన తేదీ నుంచి 24 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలన్న నిబంధన అమల్లో ఉండేది. దీనిని సవరిస్తూ ప్రభుత్వం   ఉత్తర్వులు విడుదల చేసింది. 25-12-2020 నుంచి పట్టాలు పొందిన వారికి మాత్రమే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది.


కొత్త ప్రైవేటు డిగ్రీ కళాశాలల అనుమతులకు నోటిఫికేషన్‌

ఈనాడు, అమరావతి: ఎన్నికల ముందు కొత్త ప్రైవేటు డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, అనుచరులు ప్రైవేటు కళాశాలల అనుమతుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంతో ఈ ప్రకటన విడుదల చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. దరఖాస్తుల స్వీకరణకు మార్చి 9 వరకు గడువు విధించింది. అపరాధ రుసుము రూ.25 వేలతో మార్చి 16 వరకు అవకాశం కల్పించింది.  కొత్త కళాశాలల మంజూరు ఆర్డర్లను ఏప్రిల్‌ 25న జారీ చేయనుంది.


సీఎంఏ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్‌ ప్రభంజనం

హైదరాబాద్‌: ‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ ఎకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా’ ఇటీవల ప్రకటించిన సీఎంఏ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్‌ విద్యార్థులు సత్తాచాటారని ఆ సంస్థ అడ్మిన్‌ అడ్వైజర్‌ మోహన్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. సీఎంఏ ఇంటర్‌ మొదటి 50 ర్యాంకుల్లో.. జాతీయ స్థాయి 5వ ర్యాంకుతో పాటు ఇతర ర్యాంకులు 49 మంది సాధించారని తెలిపారు. సీఎంఏ ఫైనల్‌ తొలి 50 ర్యాంకుల్లో..ఆలిండియా రెండో ర్యాంకుతో పాటు ఇతర ర్యాంకులు 34 మంది పొందారని పేర్కొన్నారు. ర్యాంకులతో ప్రతిభ చూపిన విద్యార్థులను మోహన్‌ అభినందించారు.


ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు చంద్రబాబు పరామర్శ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబును ఆ పార్టీ అధినేత చంద్రబాబు శుక్రవారం పరామర్శించారు. ఇటీవలే అశోక్‌బాబుకు బైపాస్‌ శస్త్రచికిత్స జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.  


రమణదీక్షితులపై చర్యలు తీసుకోండి

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాలను పర్యవేక్షిస్తున్న తమపై తిరుమల గౌరవ ప్రధానార్చకులు రమణదీక్షితులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని తిరుమల శ్రీపెద్దజీయర్‌, శ్రీచిన్నజీయర్‌స్వామి.. తితిదే ఈవో ధర్మారెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. ‘శ్రీవారి కైంకర్యాలు శ్రీవైఖానసాగమ ప్రకారం, శ్రీ వైష్ణవ సంప్రదాయాలను అనుసరిస్తూ నిరంతరం జరగాలనే ముందుచూపుతో రామానుజాచార్యులు జీయంగారు వ్యవస్థను ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వీడియోలు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి’ అని లేఖలో కోరారు.


ప్రవీణ్‌ప్రకాష్‌ను పదవి నుంచి తప్పించండి

సీఎస్‌కు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ను పదవి నుంచి తప్పించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పి.రఘువర్మ డిమాండ్‌చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)కి లేఖ రాశారు. ప్రవీణ్‌ప్రకాష్‌ అనుచిత వైఖరిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌(డీపీటీ)కి రఘువర్మ ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డీపీటీ కోరింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖను సాధారణ పరిపాలన విభాగం వివరాలు అడిగింది. కాగా విద్యాశాఖకు అధికారిగా ప్రవీణ్‌ప్రకాష్‌ ఉండటం వల్ల నివేదిక సరిగా ఉండదని, ఆయన్ను తప్పించాలని రఘువర్మ సీఎస్‌కు లేఖ రాశారు.


లాస్య నందిత మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి

ఈనాడు డిజిటల్‌, అమరావతి : సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె తండ్రి సాయన్న మరణం మరిచిపోక ముందే ఆ ఇంట్లో మరో విషాదం చోటుచేసుకోవడం విచారకరమని ‘ఎక్స్‌’లో శుక్రవారం పేర్కొన్నారు. ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విచారం వ్యక్తం చేశారు.

ఎర్రన్నాయుడు సేవలు అద్వితీయం: ప్రజా నాయకుడిగా, తెదేపా నేతగా ప్రజలకు, పార్టీకి ఎర్రన్నాయుడి సేవలు అద్వితీయమని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. బీసీల తరఫున ఆయన బలమైన గళమై గర్జించారని గుర్తుచేసుకున్నారు. శుక్రవారం ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ‘ఎక్స్‌’ వేదికగా నివాళి అర్పించారు.


చిరుధాన్యాలతో రుచికరమైన వంటలు పుస్తకం ఆవిష్కరణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం-2023ను పురస్కరించుకుని ‘చిరుధాన్యాలతో రుచికరమైన 100 రకాల వంటలు’ అనే పుస్తకాన్ని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ఆవిష్కరించారు. తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో ఈ పుస్తకాన్ని రూపొందించారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌, డాక్టర్‌ శారద జయలక్ష్మి, ఎన్‌జీ.రంగా వ్యవసాయ యూనివర్సిటీ ఉపకులపతి బాలునాయక్‌ పాల్గొన్నారు.


57 అమృత్‌ భారత్‌ స్టేషన్లకు 26న శంకుస్థాపన

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద 57 రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి పనులకు ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణలో 15 రైల్వేస్టేషన్లకు రూ.230 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 34 స్టేషన్లకు రూ.613 కోట్లు అదే విధంగా మహారాష్ట్రలో 6 స్టేషన్లకు రూ.63 కోట్లు, కర్ణాటకలో 2 స్టేషన్లకు రూ.18.5 కోట్లు ఖర్చుచేసి ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచనున్నారు. దేశవ్యాప్తంగా 554 స్టేషన్ల పునరభివృద్ధి పనులకు ఏకకాలంలో శంకుస్థాపన చేస్తారు.


12వ వేతన సవరణ సంఘానికి సిబ్బంది కేటాయింపు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 12వ వేతన సవరణ సంఘానికి అవసరమైన సిబ్బందిని మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌ రావత్‌ ఉత్తర్వులు ఇచ్చారు. కమిషనర్‌కు ఒక కార్యదర్శి, డిప్యూటీ కార్యదర్శి, సహాయ కార్యదర్శి, ప్రైవేట్‌ సెక్రటరీతో పాటు మరో ఇద్దరిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించనున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖలో ఉన్న ఉద్యోగుల నుంచి మరో ఏడుగురిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు ఆప్కాస్‌ నుంచి పొరుగు సేవల సిబ్బందిని నియమించుకోవచ్చని పేర్కొన్నారు.


ఎస్సీ గురుకులాల్లో బదిలీలకు శాశ్వత మార్గదర్శకాలు

ఈనాడు, అమరావతి: ఎస్సీ గురుకులాల్లో బదిలీలకుగాను త్వరలో శాశ్వత మార్గదర్శకాలు రూపొందించనున్నట్టు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. గురుకులాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ అదనంగా 5 రోజుల క్యాజువల్‌ లీవు ఇవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. తాడేపల్లిలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో 72వ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకులాల్లో పనిచేస్తున్న టీజీటీ ఉపాధ్యాయులకు తప్పనిసరిగా పీజీ ఉండాలన్న ఎన్‌సీఈఆర్‌టీ మార్గదర్శకాల ప్రకారం సడలించాలని నిర్ణయించామన్నారు. గురుకులాల్లో పనిచేస్తున్న జిల్లా సమన్వయ అధికారుల పదోన్నతులు ఇదివరకు ఉన్న జీవోల ప్రకారంగానే చేస్తామని వివరించారు. పొరుగు సేవల పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను జీవో నంబర్‌ 59 ప్రాతిపదికన రెగ్యులర్‌ చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపనున్నట్టు వెల్లడించారు.


తెలంగాణ నీటిపారుదలశాఖకు సలహాదారు?

ఆదిత్యనాథ్‌, ఎస్‌.కె.జోషి సహా మరికొన్ని పేర్ల పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: సాగునీటి రంగానికి ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని సలహాదారుగా నియమించే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నీటిపారుదల శాఖలో సుదీర్ఘకాలం పని చేసిన ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలోని నీటిపారుదల ప్రాజెక్టులను పర్యవేక్షించి, తర్వాత ఏపీలో జలవనరుల శాఖ కార్యదర్శిగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆదిత్యనాథ్‌దాస్‌ ఒకరు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణలోనూ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, తర్వాత తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, పదవీ విరమణ తర్వాత కొంతకాలం సలహాదారుగా పని చేసిన ఎస్‌.కె.జోషి మరొకరు. అయితే ఆదిత్యనాథ్‌ వైపే మొగ్గు ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని