సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ భూముల జప్తు

స్థిరాస్తి ప్రాజెక్టుల పేరుతో వినియోగదారులను నిండా ముంచిన సాహితీ ఇన్‌ఫ్రా మోసం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Updated : 24 Feb 2024 06:03 IST

24 ఎకరాలను  స్వాధీనం చేసుకున్న సీసీఎస్‌

ఈనాడు, హైదరాబాద్‌: స్థిరాస్తి ప్రాజెక్టుల పేరుతో వినియోగదారులను నిండా ముంచిన సాహితీ ఇన్‌ఫ్రా మోసం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కాజా గ్రామంలో 24 ఎకరాల సాహితీ భూములను తొలిసారిగా జప్తు చేయించారు. తొలుత 56 మంది రైతుల నుంచి సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ యజమాని బూదాటి లక్ష్మీనారాయణ ఆ భూముల్ని సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ భూముల్లో అపార్ట్‌మెంట్లు, ఐటీపార్కులు, విల్లాలు కడతానని డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్లు చేయించుకుని, అనంతరం ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో పలువురు వినియోగదారుల నుంచి రూ.కోట్లలో డబ్బులు వసూలు చేసి, మిగిలిన ప్రాజెక్టుల మాదిరిగానే లక్ష్మీనారాయణ పూర్తి చేయకుండా వదిలేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రాజెక్టులకు చెందిన పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో సీసీఎస్‌ పోలీసులు కేసును దర్యాప్తు చేయగా లక్ష్మీనారాయణ ఆస్తుల దందా వెలుగులోకి వచ్చింది. ఇటీవలే పెదకాకాని భూముల వ్యవహారం వెల్లడి కావడంతో వాటిని జప్తు చేయించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన సీసీఎస్‌ జప్తు ఉత్తర్వుల గురించి అక్కడి రైతులకు, బాధితులకు తెలియజేశారు. కొత్తవాళ్లెవరూ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఆ ప్రాజెక్టు భూముల్లో నోటీసు బోర్డులు పెట్టించారు. అక్కడ ఇంకెవరైనా బాధితులుంటే హైదరాబాద్‌ సీసీఎస్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని నోటీసుబోర్డుల్లో పేర్కొన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సైతం గతంలో ఈ సంస్థలకు చెందిన పలు ఆస్తుల్ని జప్తు చేసింది. తెలంగాణాలో ప్రీలాంచ్‌ ఆఫర్ల పేరుతో సుమారు 3వేల మందిని మోసం చేసినట్లు లక్ష్మీనారాయణపై హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు పలు కేసులు నమోదవ్వగా, 2019-22 మధ్య కాలంలో పలు ప్రాజెక్టుల పేర్లు చెప్పి సుమారు రూ.1500కోట్లు వసూలు చేసినట్లు అభియోగాలున్నాయి. ఇప్పటివరకు 50 కేసుల్లో నిందితులుగా ఇతనితో సహా 22 మందిని అరెస్ట్‌ చేశారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో 24 ఎకరాలు జప్తు చేయడంతో పాటు సాహితీ ఇన్‌ఫ్రా, సాహితీ కన్‌స్ట్రక్షన్స్‌, సాహితీ ఆర్కిటెక్ట్‌ సంస్థల్లో సోదాలు నిర్వహించి పలు కీలకపత్రాలను స్వాధీనం చేసుకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని