మంగళగిరి ఎయిమ్స్‌లో క్యాన్సర్‌కు సమగ్ర చికిత్స

క్యాన్సర్‌ వ్యాధికి సంబంధించిన అన్ని రకాల చికిత్సలు మంగళగిరి ఎయిమ్స్‌ అందుబాటులో ఉన్నాయని, ఇతర అరుదైన వ్యాధులకూ వైద్యం అందిస్తున్నామని ఎయిమ్స్‌ డైరెక్టర్‌, సీఈఓ డాక్టర్‌ మాదబానంద్‌కర్‌ వెల్లడించారు.

Updated : 24 Feb 2024 06:04 IST

త్వరలో పారా మెడికల్‌ కోర్సుల ప్రారంభం
డైరెక్టర్‌ మాదబానంద్‌కర్‌ వెల్లడి
25న ‘ఎయిమ్స్‌’ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని

ఈనాడు, అమరావతి: క్యాన్సర్‌ వ్యాధికి సంబంధించిన అన్ని రకాల చికిత్సలు మంగళగిరి ఎయిమ్స్‌ అందుబాటులో ఉన్నాయని, ఇతర అరుదైన వ్యాధులకూ వైద్యం అందిస్తున్నామని ఎయిమ్స్‌ డైరెక్టర్‌, సీఈఓ డాక్టర్‌ మాదబానంద్‌కర్‌ వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 25న మంగళగిరి ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేయబోతున్నారు. ఈ సందర్భంగా మాదబానంద్‌కర్‌ ఎయిమ్స్‌ ఆవరణలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ‘రోబోటిక్‌ ద్వారా కూడా శస్త్రచికిత్సలు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. కార్డియోథొరాసిక్‌, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాలు అందుబాటులోకి వస్తే ఎయిమ్స్‌లో అన్నిరకాల వైద్య సేవలూ వచ్చినట్లే. ఎయిమ్స్‌ వైద్యులు తయారుచేసిన సుమారు 400 పరిశోధనపత్రాలు వివిధ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ముద్రితమయ్యాయి. 2024-25 విద్యా సంవత్సరంలో పారా మెడికల్‌ కోర్సులను ప్రారంభించబోతున్నాం. బీఎస్సీ నర్సింగ్‌ విద్యలో ప్రస్తుతం ఉన్న 50 సీట్లను 100 పెంచబోతున్నాం. 2019 మార్చి 12న ఎయిమ్స్‌లో ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రోజుకు సగటున 2,500 మంది ఓపీ విధానంలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 20వ తేదీనాటికి చికిత్స పొందిన రోగుల సంఖ్య 15 లక్షలకు చేరింది. ఇప్పటివరకు 7,200 శస్త్రచికిత్సలు చేశాం. పీఎం-జేఏవై ఆయుష్మాన్‌ భారత్‌/ఆరోగ్యశ్రీ ఆరోగ్య బీమా సేవలు, సీజీహెచ్‌ నగదు రహిత సదుపాయం కల్పిస్తున్నాం. ఎయిమ్స్‌లో నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడా. ఈ నెల 25న ప్రధాని మోదీ వర్చువల్‌ విధానంలో మంగళగిరి ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేయడంతోపాటు 9 క్రిటికల్‌ కేర్‌ బ్లాకులకు శంకుస్థాపన చేస్తారు. విశాఖలోని మైక్రోబయాలజీ ఫుడ్‌ టెస్టింగ్‌ లేబొరేటరీ, రాష్ట్రానికి కేటాయించిన నాలుగు మొబైల్‌ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను ప్రారంభిస్తారు’ అని మాదబానంద్‌కర్‌ వివరించారు. విలేకర్ల సమావేశంలో ఎయిమ్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కల్నల్‌ శశికాంత్‌ తుమ్మల తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని